తెలంగాణ జాబ్స్​ స్పెషల్​.. మద్రాస్​లో రైత్వారీ విధానం

తెలంగాణ జాబ్స్​ స్పెషల్​.. మద్రాస్​లో రైత్వారీ విధానం

స్వాతంత్ర్యానంతరం దేశం ఎదుర్కొన్న ప్రధాన సమస్య భూ కేంద్రీకరణ. కొంత మంది చేతిలో పెద్ద స్థాయిలో కమతాలు కేంద్రీకృతమై ఉండేవి. ఇందుకు బ్రిటిష్ వారు అమలు చేసిన వ్యవసాయ విధానాలే కారణం. శిస్తు పేరిట రైతులను దోపిడీకి గురిచేశారే తప్ప భూ అభివృద్ధికి కృషి చేయలేదు. 

ఈ సమస్యను పరిష్కరించేందుకు జమిందారీ, మహల్వారీ, రైత్వారీ శిస్తు విధానాలను రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం భూ పంపిణీకి చర్యలు చేపట్టింది. మధ్యవర్తుల తొలగించింది. కౌలు సంస్కరణలు చేసి, కమతాల గరిష్ఠ పరిమితి చట్టం తీసుకువచ్చింది.

ప్రభుత్వ జోక్యం ద్వారా వ్యవసాయ నిర్మాణంలో మార్పు తీసుకురావడమే భూ సంస్కరణలు. స్వాతంత్ర్యం వచ్చే నాటికి మూడు రకాల భూస్వామ్య పద్ధతులు అమలులో ఉండేవి. అవి.. జమిందారీ విధానం, మహల్వారీ విధానం, రైత్వారీ విధానం. 

జమిందారీ విధానం: ఈ విధానాన్ని ఈస్ట్​ ఇండియా కంపెనీ ప్రవేశపెట్టింది. 1793లో లార్డ్​ కారన్​ వాలీస్​ శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిని ప్రవేశపెట్టారు. ఇందులో భూస్వాములు లేదా జమిందార్లు అతి పెద్ద భూభాగాలకు యజమానులుగా ప్రకటిస్తారు. రైతుల నుంచి భాటకాన్ని వసూలు చేసి ప్రభుత్వానికి చెల్లించాలి. అంటే వ్యవసాయదార్లకు ప్రభుత్వానికి మధ్య మధ్యవర్తులుగా ఉంటారు. జమిందార్లు వసూలు చేసిన భాటకంలో 10 భాగాలు ప్రభుత్వానికి, ఒక భాగం జమిందార్లకు వెళ్తుంది. 

బెంగాల్​, బిహార్​, ఒరిస్సాల్లో దీనిని ప్రవేశపెట్టినప్పటికీ స్వాతంత్ర్యం వచ్చే నాటికి ఉత్తర్​ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్​ ల్లో కూడా ఈ విధానం కనిపిస్తుంది. ఇందులో జమిందార్లు ఇష్టానుసారం భాటకం పెంచేవారు. ఉత్పత్తిలో ఎక్కువ భాగం తీసుకోవడం వల్ల వ్యవసాయదారునికి పెట్టుబడి పెట్టడానికి మిగులు ఉండేది కాదు. ఫలితంగా వ్యవసాయం చేసేవారికి ఆధునిక పద్ధతిలో వ్యవసాయం చేయడం పట్ల శ్రద్ధ ఉండేది కాదు. భాటకాన్ని చెల్లించడానికి కొంత భూమిని కూడా అమ్ముకోవాల్సి వచ్చేది.

మహల్వారీ విధానం: ఆగ్రా, అవధ్ ప్రాంతాల్లో ముస్లిం సంప్రదాయాలకు అనుగుణంగా విలియం బెంటింగ్​ దీన్ని ప్రవేశపెట్టారు. తర్వాత మధ్యప్రదేశ్, పంజాబ్​లకు విస్తరించారు. ఇందులో మొత్తం గ్రామాన్ని ఒక యూనిట్​గా భావించి దాని నుంచి భూమి శిస్తు వసూలు చేసే బాధ్యతను గ్రామ పెద్దకు అప్పగిస్తారు. వసూలు చేసిన శిస్తును ప్రభుత్వానికి చెల్లించి గ్రామ పెద్ద కమిషన్​ పొందుతారు. నాటి సేద్య భూమిలో 5శాతం దీని కింద ఉండేది. 

రైత్వారీ విధానం: దీనిని మద్రాస్ లో మన్రో, రీడ్​లు ప్రవేశపెటారు. తర్వాత మహారాష్ట్ర, బీరార్​, తూర్పు పంజాబ్, అస్సాం ప్రాంతాలకు విస్తరించారు. ఇందులో భూమి దున్నే రైతే ప్రభుత్వానికి నేరుగా శిస్తు చెల్లించాలి. ఎలాంటి మధ్యవర్తులు ఉండరు. రైతే భూమి అమ్మకం, లీజుకు ఇవ్వడం తదితర అంశాల్లో హక్కులు కలిగి ఉంటాడు. శిస్తు చెల్లిస్తున్నంత కాలం తొలగించరు. ఇలాంటి హక్కులు జమిందారీ విధానంలో సేద్యం చేసే వారికి ఉండవు. 

కౌలుదార్లు జిరాయితీ హక్కులు ఉన్నవారు: వీరు భూమిపై కొన్ని హక్కులు కలిగి ఉంటారు. కౌలు భద్రత ఉంటుంది. భూమి అభివృద్ధికి దోహదపడితే దానికి పరిహారం కూడా పొందుతారు. ఏ హక్కులు లేని వారు: వీరికి ఎలాంటి కౌలు భద్రత ఉండదు. భూస్వాములు ఎప్పుడైనా వీరిని భూమి నుంచి గెంటివేయవచ్చు.

ఉప కౌలుదార్లు: వీరికి కూడా ఎలాంటి రక్షణ ఉండదు. అయితే రెండో వర్గం వారిని భూస్వాములు నియమించగా, మూడో వర్గం వారిని జిరాయితీ హక్కులున్న  కౌలుదార్లు నియమించేవారు. 

భూ సంస్కరణల అమలు మధ్యవర్తుల తొలగింపు: జమిందారీ విధానంలో వ్యవసాయదారులను విపరీతంగా దోపిడీ చేసేవారు. సేద్య భూమిలో 57శాతం దీని కిందే ఉండేది. 1951కు ముందు కొన్ని రాష్ట్రాలు మధ్యవర్తులను తొలగిస్తూ చట్టాలను తీసుకువచ్చింది. 1948లో మద్రాసులో జమిందారీ రద్దు చట్టాన్ని తీసుకువచ్చారు. మొదటి ప్రణాళికలో మధ్యవర్తుల తొలగింపు చట్టాలు ఎక్కువగా అమలు జరిగేవి. మొదటి ప్రణాళిక చివరి  నాటికి మధ్యవర్తుల తొలగింపు పూర్తయింది. 173 మిలియన్ల ఎకరాల భూమిని మధ్యవర్తుల నుంచి తీసుకుని కౌలుదార్లకు రూ.20 కోట్లు చెల్లించారు. 

కౌలు సంస్కరణలు: ఏ హక్కులు లేని కౌలుదార్లు ఉప కౌలుదార్లు  భూ యజమాని దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సి వస్తుంది. ప్రత్యేక చట్టాల ద్వారా వీరికి రక్షణ కల్పించాల్సి ఉంది. ఎన్​ఎస్​ఎస్​ఓ వారి 8వ రౌండ్​ అంచనాల్లో సేద్య భూమిలో 20శాతం దీని కిందే ఉంది. ఇది కాకుండా 35–40శాతం నోటిమాట ద్వారా జరిగే కౌలు విధానంలో ఉండేది. కేఎన్​ రాజ్​ ప్రకారం 50శాతం సేద్య భూమి కౌలుదారీ విధానం కిందే ఉండేది. కౌలు సంస్కరణల్లో భాగంగా భాటకం క్రమబద్దీకరణ, కౌలు భద్రత, కౌలుదార్లకు యాజమాన్య హక్కులు కల్పించడం వంటి సంస్కరణలు తీసుకువచ్చారు. 

కమతాల సమీకరణ: చిన్న కమతాల వల్ల ఏర్పడే సమస్యల పరిష్కారానికి ఇదొక మార్గం. ఒక వ్యక్తికి వేర్వేరు ప్రదేశాల్లో ఉన్న భూమిని ఏక ఖండంగా ఒక దగ్గరకు సమీకరించడమే కమతాల సమీకరణ. దీన్ని రైతులు స్వచ్ఛందంగా/ ప్రభుత్వ జోక్యంతో చేయవచ్చు. భారత్​లో కమతాల సమీకరణ 1951–52లో ప్రారంభమైంది. పంజాబ్​, హర్యానా, మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్, బిహార్​, ఒరిస్సాల్లో కమతాల సమీకరణ వేగంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్​, తమిళనాడు, కేరళ, పాండిచ్చేరి, ఈశాన్య రాష్ట్రాల్లో ఇది అమలు కాలేదు. దీనిలో ప్రధాన లోపం సారవంతమైన భూమిని ధనిక రైతులు పొందుతున్నారు. 2007–08 నాటికి 52శాతం కమతాల సమీకరణ పూర్తయింది. 

సహకార వ్యవసాయం: గ్రామంలోని రైతులందరూ సహకార సంఘంగా ఏర్పడి తమ భూమినంతటిని ఏక ఖండంగా చేసి సహకార ప్రాతిపదికపై నిర్వహించే వ్యవసాయం సహకార వ్యవసాయం. చిన్న కమతాల సమస్యలను పరిష్కరించేందుకు సహకార వ్యవసాయం ఉత్తమమని 1926–27 రాయల్​ కమిషన్​, 1928లో గాంధీజీ, 1949 వ్యవసాయ సంస్కరణ కమిటీ పేర్కొన్నది. ఉపాంత, చిన్న కమతాలు మనదేశంలో 86.21శాతం ఉన్నాయి. దీని కింద సేద్యభూమి 47.35శాతం ఉంది. ఈ కమతాల్లో వ్యవసాయం అంత లాభసాటిగా ఉండదు. కాబట్టి వీరు తమ భూమిని, పనిముట్లను సహకార సంఘానికి అప్పగించి సమిష్టిగా వ్యవసాయం చేస్తే  భారీ తరహా ఆదాలు పొందగలరు. 

కమతాల గరిష్ఠ పరిమితి చట్టం

ఒక వ్యక్తి చట్టబద్ధంగా తన వద్ద ఉంచుకోవడానికి అర్హత కలిగిన భూమిని వ్యవసాయ కమతాల గరిష్ట పరిమితి అంటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో 1973లో భూ గరిష్ట పరిమితం చట్టం చేయగా, 1975 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చింది. 

గరిష్ట పరిమితి వర్తించే యూనిట్​: ఒక కుటుంబాన్ని యూనిట్​గా తీసుకొని గరిష్ట పరిమితి నిర్ణయిస్తారు. కుటుంబం అంటే భార్య, భర్త, అవివాహిత సంతానం. కుటుంబ సభ్యులు ఐదుగురిని మించితే ప్రతి సభ్యునికీ 1/5 వంతు చొప్పున పరిమితి పెంచవచ్చు. ఇది సాధారణ పరిమితికి రెట్టింపు కావొద్దు.

గరిష్ట పరిమితి: ఈ చట్టాలను దేశవ్యాప్తంగా ఏక రూపేణా అమలు చేసేందుకు 1972లో ముఖ్యమంత్రుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశ ఫలితంగా భూగరిష్ట పరిమితికి సంబంధించి నూతన విధానాన్ని ప్రకటించారు. 

  •  నీటిపారుదల సౌకర్యాలుండి సంవత్సరానికి రెండు పంటలు పండే భూమికి గరిష్ట పరిమితి 10–18 ఎకరాలు
  •     సంవత్సరానికి ఒకే పంట పండే భూమికి గరిష్ట పరిమితి 27 ఎకరాలు. 
  •     భూసారం ఒకే తీరు లేని మెట్ట భూముల విషయంలో గరిష్ట పరిమితి 54 ఎకరాలు
  •     మెట్ట భూముల విషయంలో గరిష్ట పరిమితి 35 – 54 ఎకరాలు