
తెలంగాణ పోటీ పరీక్షల సిలబస్‌లో వాస్తు నిర్మాణం, ప్రాచీన కట్టడాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. వీటిపైనే అత్యధిక ప్రశ్నలు అడిగే ఆస్కారం ఉంది. ముఖ్యంగా అసఫ్‌జాహీల పాలనా కాలంలో పెద్ద ఎత్తున నిర్మాణాలను చేపట్టారు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కీలకమైన ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ కాలంలో చేపట్టిన ప్రాచీన కట్టడాల గురించి తెలుసుకుందాం.
మహబూబ్ కళాశాల
రెజిమెంటల్ బజార్, జేమ్స్ స్ట్రీట్, కళాసిగూడ ప్రాంతాల్లో ఆంగ్లేయతరులు ఎక్కువగా నివసించేవారు. వీరికి తగిన విద్యావకాశాలు ఉండేవికావు. కంటోన్మెంట్‌కు సరుకులు సరఫరా చేసే కాంట్రాక్టర్ సోమసుందరం మొదలియార్, బ్రిటిష్ అధికారుల సాయంతో 1862లో ఆంగ్లో వెర్నాక్యులార్ స్కూల్‌ను సికింద్రాబాద్‌లో ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఆరో నిజాం ప్రభువు మీర్ మహబూబ్ అలీఖాన్ ఈ పాఠశాలకు తగిన నిధులు సమకూర్చడంతోపాటు ప్రతి ఏడాది పాఠశాల నిర్వహణకు గ్రాంటు మంజూరు చేసేవారు. దీంతో ఈ పాఠశాల పేరును నిజాం పేరిట మహబూబియా పాఠశాలగా మార్చారు.
మహబూబియా కళాశాల
ఆరో నిజాం ప్రభువు హైదరాబాద్ నగర మహిళలకు బహుమతిగా మహబూబియా కళాశాలను స్థాపించారు. సర్ జార్జ్ కాసన్ వాకర్, ఆయన భార్య కేన్సన్ వాకర్ల ప్రోత్సాహంతో నిజాం ప్రభువు ఈ కళాశాల ఏర్పాటుకు నిర్ణయించారు. 1907 ఫిబ్రవరి 1న నాంపల్లి రైల్వేస్టేషన్‌కు ఎదురుగా గల ఒక ప్రైవేట్ భవనంలో మహబూబియా కళాశాలను ఆరో నిజాం పేరు మీదుగా ఏర్పాటు చేశారు. ఈ కళాశాల తొలి ప్రిన్సిపల్‌గా ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకున్న జెఫ్రీని నియమించారు. 1930 నుంచి 1947 వరకు గ్రేస్ లినెల్లీ ఆఖరి ఆంగ్లేయ ప్రిన్సిపల్‌గా సేవలందించారు.
నిజాం కాలేజ్
1887లో చాదర్‌ఘాట్ స్కూల్లోని ఇంటర్మీడియట్ శాఖ, మదరసా–ఇ–ఆలియా అనే విద్యాసంస్థలను విలీనం చేసి నిజాం కళాశాలగా ఏర్పాటు చేశారు. 1872లో సాలార్జంగ్–1 కాలంలో తొలి ఇంగ్లిష్ స్కూల్‌గా హైదరాబాద్ కాలేజీ స్థాపించారు. హైదరాబాద్ కాలేజీ విద్యార్థులను మెట్రిక్యులేషన్ పరీక్షకు తగిన శిక్షణ ఇచ్చి మద్రాస్ విశ్వవిద్యాలయానికి పంపేవారు. దీనిని 1877లో చాదర్‌ఘాట్ హైస్కూల్‌గా పేరు మార్చారు. 1887 నుంచి 1947 వరకు కిండర్ గార్డెన్ స్థాయి నుంచి డిగ్రీ, పోస్టు గ్రాడ్యుయేషన్ వరకు నిజాం కాలేజ్ ఎందరికో విద్యా దానం చేసింది. 1914లో నిజాం కాలేజ్‌ను ప్రస్తుత ఎల్బీ స్టేడియం దగ్గరలోని భవనంలోకి మార్చారు.
పైగా సమాధులు
పైగా అంటే అత్యున్నత హోదా అని అర్థం. వీరు నిజాం ప్రభువుల కాలంలో సైన్యాధ్యక్షులుగా, ప్రధాన ప్రభుత్వ సలహాదారులుగాను వ్యవహరించేవారు. ఓవైసీ హాస్పిటల్ వెనుక భాగంలో పైగా సమాధులు నిర్మించారు. ఎనిమిది తరాలకు సంబంధించిన 32 మంది సమాధులు ఇక్కడ ఉన్నాయి. ఇవి దక్షిణ తాజ్‌మహల్‌గా ప్రసిద్ధి చెందాయి. ఫతేఖాన్ సమాధి పైన ఆస్ట్రిచ్ పక్షి గుడ్డు ఆకారం వేలాడదీసి ఉన్నది. ఆస్మాన్ అంటే ఆకాశమని అర్థం. అందుకే ఆయన సమాధిపైన ఏ విధమైన నిర్మాణం చేయలేదు. ఇతని సమాధికి ఉపయోగించిన పాలరాయి స్టోన్ ఆఫ్ సీజన్స్‌గా పిలువబడుతుంది. బేగం ఖుర్షిదా సమాధి షాజహాన్ సమాధిని పోలి ఉంటుంది. ఈ సమాధులు దక్కన్ రాజస్థాన్ శైలిలో నిర్మించారు.
బేగంపేటలో పైగా ప్యాలెస్
ఆరో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ కాలంలో పైగా ప్రభువు వికార్ ఉల్ ఉమ్రా హైదరాబాద్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఫలక్నామా ప్యాలెస్ నిర్మించాడు. ఫలక్నామా ప్యాలెస్‌ను వికార్ ఉల్ ఉమ్రా నుంచి 1897లో నిజాం ప్రభువు కొనుగోలు చేశాడు. ఉమ్రా తన కోసం బేగంపేటలో పైగా ప్యాలెస్ నిర్మించుకున్నాడు. పైగా ప్యాలెస్‌ను యూరోపియన్ శైలిలో రెండంతస్తుల భవనంగా నిర్మించారు. కొంత కాలం పైగా ప్యాలెస్‌లో అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(హుడా) కార్యాలయాన్ని నిర్వహించారు.
నగరంలో తొలి పోస్టాఫీసు
భాగ్యనగరంలో తొలి పోస్టాఫీసును 1866 మార్చి 14న బొల్లారంలో ఏర్పాటు చేశారు. నిజాం ప్రభువుల కాలంలో సికింద్రాబాద్‌లో బ్రిటిష్ వారు తమ స్థావరాలు ఏర్పాటు చేసుకోవడంతో బ్రిటిష్ అధికారులు తమ సమాచార సౌకర్యార్థం బొల్లారంలో తొలి పోస్టాఫీసును నెలకొల్పారు. భాగ్యనగరంలో తొలిసారిగా టెలిగ్రాఫ్ సౌకర్యం కూడా ఇక్కడి నుంచే ప్రారంభించారు.
ఫలక్‌నుమా ప్యాలెస్
చార్మినార్‌కు దక్షిణంగా 5 కి.మీ.ల దూరంలో 200 అడుగుల ఎత్తయిన కొండపైన 1893లో ఫలక్‌నుమా ప్యాలెస్‌ను నిర్మించారు. ఫలక్‌నుమా అంటే ఆకాశ దర్పణమని అర్థం. పైగా ప్రభువులైన నవాబ్ సర్ వికార్ ఉల్ ఉమ్రా బహదూర్ ఈ ప్యాలెస్‌ను నిర్మించాడు. 1884, మార్చి 3న నిర్మాణ పనులను ప్రారంభించి 1893లో పూర్తి చేశారు. పైగా ప్రభువు జన్మరాశి వృశ్చికం కావడంతో ఆకాశం నుంచి చూస్తే తేలు ఆకారంలో రెండు కొండిలు, తోకతో ఉన్నట్లు ఈ ప్యాలెస్ కనిపిస్తుంది. 1897లో ఈ ప్యాలెస్‌ను పైగా ప్రభువుల నుంచి ఆరో నిజాం కొనుగోలు చేసి అదనపు నిర్మాణాలు, మరమ్మతులు చేయించాడు. ఈ ప్యాలెస్‌లోనే ఆరో నిజాం 1911లో మరణించాడు. ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ కాలంలో యూరోపియన్ రీతిలో మార్పులు చేసి రాయల్ గెస్ట్ హౌస్‌గా ఉపయోగించారు.
అసెంబ్లీ
ప్రస్తుత తెలంగాణ అసెంబ్లీ భవన సముదాయం నిజాం ప్రభుత్వ హయంలో టౌన్‌హాల్‌గా ఉండేవి. ఈ భవన నిర్మాణాలను ఆరో నిజాం మహబూబ్ అలీఖాన్ చేపట్టాడు. ఎనిమిది సంవత్సరాల తర్వాత ఏడో నిజాం పనులను పూర్తిచేసి 1913లో ప్రజా సేవకు అంకితమిచ్చాడు. ప్రజా సమస్యలను చర్చించే సమావేశ మందిరంగా ఆనాడు వినియోగించేవారు. ఆరో నిజాం 40వ జన్మదిన వేడుకల సందర్భంగా టౌన్‌హాల్ నిర్మాణం పనులు చేపట్టారు. అసెంబ్లీ భవనాన్ని ఇండో – ఇస్లామిక్ శైలి, రాజస్తానీ– పర్షియ్ మిశ్రమ ఆర్కిటెక్చర్‌తో నిర్మించారు.
స్టేట్ సెంట్రల్ లైబ్రరీ
1891లో మౌల్వీ సయ్యద్ హుస్సేన్ బిల్గ్రామి ఈ గ్రంథాలయాన్ని అబిడ్స్‌లో ఒక చిన్న బంగ్లాలో స్థాపించినట్లు చారిత్రక ఆధారాల వల్ల తెలుస్తోంది. ఈ గ్రంథాలయం అసఫ్‌జాహీ పాలకుల గుర్తుగా అసఫీయా గ్రంథాలయంగా ప్రఖ్యాతి చెందింది. 1936లో నవాబ్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ చొరవతో గౌలిగూడలో ఇండో యూరోపియన్ శైలిలో గ్రంథాలయం కోసం భవన సముదాయం నిర్మించారు. భారతదేశంలో తెలంగాణ విలీనమైన తర్వాత దీని పేరును రాష్ట్ర కేంద్ర గ్రంథాలయంగా మార్చారు.