
తెలంగాణలో అత్యంత ప్రాచీన కాలం నుంచి కొనసాగుతున్న సాంఘిక దురాచారాల్లో జోగిని వ్యవస్థ ప్రధానమైంది. ఆడపిల్లలను దేవుడి పేరుతో వదిలేసే ఒక ఆటవిక సంప్రదాయమే జోగిని వ్యవస్థ. ఇది వీరశైవ సంప్రదాయానికి చెందింది. జోగిని వ్యవస్థ ద్రావిడ సంప్రదాయం, నిమ్నకుల సంస్కృతి. ఈ సామాజిక దురాచారానికి ముఖ్యంగా దళిత స్త్రీలు బలయ్యేవారు. ఇది దళిత సమస్య, స్త్రీ సమస్య, మానవ సమస్య. జోగిని అనే పదానికి గుడిసెటుది, జారంగి, వేశ్య అనే పలు అర్థాలు ఉన్నాయి. జోగిని వ్యవస్థ ఒక భూస్వామ్య వ్యవస్థ అవశేషం. సంప్రదాయం, మతం పేరుతో స్త్రీలను లైంగిక దోపిడీకి గురిచేస్తారు. అందుకే, ఈ వ్యవస్థను మతం ముసుగులో ఉన్న వ్యభిచారంగా పేర్కొంటారు
కాకతీయ సామ్రాజ్య పతనం తర్వాత జోగిని వ్యవస్థ కర్ణాటక ప్రాంతంలోని బసవిరాండ్ర వ్యవస్థ నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు పాకింది. అవివాహిత యువతులను, బాలికలను స్త్రీ దేవతకు ఇచ్చి పెళ్లి చేస్తే జోగిని అని, పురుష దేవుడికి ఇచ్చి పెళ్లి చేస్తే బసవి అని పిలుస్తారు. తెలంగాణలో అధిక మంది జోగినిలు కరీంనగర్ జిల్లాలో ఉన్నారు. కరీంనగర్ జిల్లాలో జోగినిలను పార్వతి అని పిలుస్తారు. తెలంగాణలో జోగిని వ్యవస్థ లేని ఏకైక జిల్లా ఖమ్మం.తెలంగాణలోని జోగిని వ్యవస్థపై హేమలతా లవణం విస్తృత స్థాయి అధ్యయనం చేశారు.
జోగిని సమర్పణ
గ్రామంలో ఏదైనా అంటువ్యాధి ప్రబలినప్పుడు, కరువు కాటకాలు సంభవించినప్పుడు వాటి నుంచి గ్రామాన్ని కాపాడమని దేవుడిని కోరుకుంటూ ఒక కుటుంబాన్ని ఎన్నుకుని ఆ కుటుంబంలోని అమ్మాయిని జోగినిగా సమర్పించేవారు. పోతరాజు జోగినికి మంగళసూత్రాన్ని కడ్తాడు. ఇతడిని గ్రామ దేవతలకు తమ్ముడిగా పరిగణిస్తారు.
నిర్మూలన కోసం ఏర్పాటైన సంస్థలు
సంస్కార్
1974లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో సంస్కార్ అనే స్వచ్ఛంద సంస్థ లవణం, హేమలతా లవణం దంపతులు ప్రారంభించారు. వ్యక్తిగతంగా, సామాజికంగా జోగినిల్లో మార్పు తెచ్చే ప్రధాన లక్ష్యంతో ఈ సంస్థను ప్రారంభించారు. సంస్కార్, నేషనల్ ఇన్ స్టిట్యూట్ఆఫ్ సోషల్ యాక్షన్లు కలసి నిజామాబాద్‌లో వర్ని గ్రామంలో జోగినిల కోసం చెల్లి నిలయాన్ని 1987లో ఏర్పాటు చేశారు.
నిసా
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ యాక్షన్(నిసా)ను స్వచ్ఛంద సంస్థను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ కుముద్‌బెన్ జోషి ప్రారంభించారు. ఈ సంస్థ ఆధ్వర్యంలో 1987లో న్యూఢిల్లీలో జోగినిల సంక్షేమంపై నేషనల్ కాన్ఫరెన్స్ జరిగింది.
ఆశ్రయ్
ఆశ్రయ్ సంస్థను 1993లో గ్రేస్ నిర్మల్ స్థాపించారు. ఈ సంస్థ బాలికలను జోగినిలుగా మార్చకుండా అడ్డుకుంటుంది. జోగిని వ్యవస్థ నుంచి బయటకు వచ్చిన స్త్రీలకు విద్యను అందించడానికి కృషి చేస్తుంది. ఆశ్రయ్ అనే సంస్థ దళిత అనే పత్రికను నడుపుతూ జోగినిలను చైతన్యవంతం చేస్తుంది.
జగన్ మిత్రమండలి
1906లో జగన్ మిత్ర మండలిని భాగ్యారెడ్డి వర్మ ఏర్పాటు చేశారు. హైదరాబాద్ సంస్థానంలోని సాంఘిక దురాచారాలైన దేవదాసి, జోగిని వ్యవస్థలను రూపుమాపడానికి ఈ సంస్థ ద్వారా భాగ్యరెడ్డి వర్మ కృషి చేశారు. 1980లో నిజామాబాద్ అసిస్టెంట్ కలెక్టర్ అప్పారావు, 1985లో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఆశామూర్తిలు జోగిని వ్యవస్థను రూపుమాపడానికి జోగినిలకు పునరావాసం కల్పించడానికి కృషిచేశారు.
ప్రభుత్వ చర్యలు
ఆంధ్రప్రదేశ్ దేవదాసి చట్టం–1988
ఆంధ్రప్రదేశ్దేవదాసి(అర్పణ నిరోధకం) చట్టం ప్రకారం జోగిని, దేవదాసీ, బసవి వ్యవస్థలను నిషేధించారు. ఈ చట్టం ప్రకారం బసవి, జోగిని, పార్వతి, మాతమ్మ, తాయమ్మ మొదలైన ఏ పేర్లతో అమ్మాయి సమర్పణ జరిగినా, జైలుశిక్ష విధిస్తారు.
జీవో 139
2009లో జారీ చేసిన జీఓ 139 ప్రకారం జోగినుల పిల్లలను పాఠశాలలో చేర్చుకునే క్రమంలో తండ్రి పేరుతో కాకుండా తల్లి పేరుతో పాఠశాలలోకి చేర్చుకోవడానికి అనుమతి ఇచ్చారు.