
హైదరాబాద్, వెలుగు: సోషల్ మీడియాలో సీఎం రేవంత్‌రెడ్డిపై అసభ్యకర పోస్టులు పెట్టిన కేసులో నిందితులైన పల్స్ న్యూస్ ఎండీ రేవతి, రిపోర్టర్ తన్వి యాదవ్‌లకు నాంపల్లి కోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. ఒక్కొక్కరు రూ.25 వేల చొప్పున రెండు పూచీకత్తులు, ఇద్దరు ష్యూరిటీలను సమర్పించాలని ఆదేశించింది.
ఛార్జిషీట్ దాఖలయ్యేంత వరకు ప్రతి సోమ, శుక్రవారం సైబర్ క్రైమ్ పీఎస్ ఎస్‌హెచ్‌ఓ ముందు హాజరుకావాలని షరతు విధించింది. దీంతో పాటు పాస్‌పోర్టులు కోర్టులో డిపాజిట్ చేయాలని చెప్పింది. అయితే, తన్వి యాదవ్‌కు పాస్‌పోర్ట్ లేకపోవడంతో అఫిడవిట్ దాఖలు చేయాలని సూచించింది. మరోవైపు, సైబర్ క్రైమ్ పోలీసులు దాఖలు చేసిన 5 రోజుల కస్టడీ పిటీషన్‌ను కోర్టు డిస్మిస్ చేసింది.