
- అక్రెడిటేషన్, హెల్త్ కార్డులు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్
హైదరాబాద్, వెలుగు: తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 24న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద నిరసన తెలియజేస్తూ కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్ణయించింది. గురువారం చిక్కడపల్లిలోని త్యాగరాయ గాన సభలో ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య అధ్యక్షతన రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది.
సమావేశం ఆమోదించిన తీర్మానాలను ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య, ప్రధాన కార్యదర్శి బి.బసవ పున్నయ్య మీడియాకు విడుదల చేశారు. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు, అక్రెడిటేషన్ కార్డులు, హెల్త్ కార్డులు ఇవ్వాలని, పెన్షన్ స్కీం ప్రారంభించాలని, దాడుల నివారణకు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయాలని, జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టం చేయాలని డిమాండ్ చేశారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో తీవ్ర నిర్లక్ష్యం చేసిందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా ఇంత వరకు ఏ ఒక్క సమస్యనూ పరిష్కరించలేదని సోమయ్య, బసవ పున్నయ అన్నారు. అధికారంలోకి రాగానే ఇండ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చి.. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పును సాకుగా చూపి ఇండ్ల స్థలాలు ఇవ్వకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నదని మండిపడ్డారు.