ఇవాళ్టి నుంచి తెలంగాణలో జుడాల నిరవధిక సమ్మె

ఇవాళ్టి  నుంచి తెలంగాణలో జుడాల నిరవధిక సమ్మె
  • ఇప్పటికే ప్రభుత్వానికి సమ్మె నోటీసులు ఇచ్చామని జూడాల వెల్లడి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చనందున సోమవారం నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్తున్నట్టు జూనియర్ డాక్టర్లు ప్రకటించారు. ఎమర్జెన్సీ మినహా అన్ని విధులను బహిష్కరిస్తున్నామని వారు తెలిపారు. అవుట్‌ పేషెంట్ డ్యూటీలు, నాన్ ఎమర్జెన్సీ సర్జరీ విధులకు హాజరయ్యేది లేదని తేల్చి చెప్పారు. ఉన్నతాధికారులు, రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే సమ్మె నోటీసులు ఇచ్చామని పేర్కొన్నారు. ఈ మేరకు జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్, డాక్టర్ ఎస్‌‌ఎస్ హర్ష ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. 

స్టైపండ్ బకాయిలు విడుదల చేయాలని, ప్రతి నెలా స్టైపండ్ చెల్లించేలా గ్రీన్ చానల్ ఏర్పాటు చేయాలని, సీనియర్ రెసిడెంట్స్‌‌కు ఇచ్చే గౌరవ వేతనం పెంచాలని, ఉస్మానియా హాస్పిటల్‌‌కు కొత్త బిల్డింగ్ నిర్మించాలని జుడాలు కోరారు. ఎంబీబీఎస్‌‌, పీజీ సీట్ల భర్తీలో ఏపీ స్టూడెంట్లకు ఉన్న కోటాను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీలు, హాస్పిటళ్లు, హాస్టళ్లలో వసతులు కల్పించాలని, హాస్పిటళ్లలో డాక్టర్లపై దాడులు జరగకుండా పోలీస్ అవుట్ పోస్టులు ఏర్పాటు చేయాలని జూనియర్​ డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు.