కౌశిక్ ​క్షమాపణ చెప్పాలి: తెలంగాణ కమ్మ రాజకీయ ఐక్య వేదిక

  • ఆంధ్రా సెటిలర్లు కామెంట్​ను ఉపసంహరించుకోవాలి
  •  రాజకీయలబ్ధి కోసం ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టిస్తారా? 
  • వ్యక్తిగత రాజకీయ విభేదాలను మాపై రుద్దుతారా?
  • ఇది కౌశిక్ వ్యక్తిగతమా? లేక బీఆర్ఎస్​ స్టాండా? అని ప్రశ్న

ఖైరతాబాద్, వెలుగు: బీఆర్ఎస్​ఎమ్మెల్యే కౌశిక్​రెడ్డి ఇటీవల చేసిన ‘ఆంధ్రా సెటిలర్లు’ అనే కామెంట్​ను వెంటనే ఉపసంహరించుకోవాలని, ఆయన క్షమాపణ చెప్పాలని తెలంగాణ కమ్మ రాజకీయ ఐక్య వేదిక  అధ్యక్షుడు ప్రొఫెసర్​ గోపాలం విద్యాసాగర్ డిమాండ్​ చేశారు.

 ప్రజా ప్రతినిధుల మధ్య తలెత్తిన విభేదాల్లో ఎలాంటి సంబంధంలేని వారిని మధ్యలోకి లాగడం మంచిది కాదని సూచించారు. శనివారం హైదరాబాద్​ ప్రెస్​క్లబ్​లో నిర్వహించిన మీడియా సమావేశంలో అసోసియేషన్​ ఉపాధ్యక్షుడు అన్నె సత్యనారాయణ, కార్యదర్శి వెలగపూడి సత్యనారాయణ చౌదరితో కలిసి విద్యాసాగర్​మాట్లాడారు.

 ఒకే పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, పాడి కౌశిక్​ రెడ్డి మధ్య తలెత్తిన ఘర్షణలోకి.. ఐకమత్యంతో తెలంగాణలో నివసిస్తున్న వారిని ఎందుకు లాగాల్సి వచ్చిందని ప్రశ్నించారు. 

సెటిలర్స్​అనే పదాన్ని తీవ్రంగా నిరసిస్తున్నం

వ్యక్తిగత రాజకీయ విభేదాలను తమపై రుద్దడం దురదృష్టకరమని,సెటిలర్స్​అనే పదాన్ని తాము తీవ్రంగా నిరసిస్తున్నామని విద్యాసాగర్​ అన్నారు. ‘‘తెలంగాణలో బతుకుతున్న ప్రజలంతా అన్నదమ్ముల్లా కలిసి ఉంటున్నాం.

రాజకీయ లబ్ధికోసం సెంటిలర్స్​అంటూ రెచ్చగొట్టడం మంచిది కాదు. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములవుతున్నవారిని అభినందించాల్సింది పోయి.. విమర్శించడం దారుణం. 

హైదరాబాద్​లో కోటి పది లక్షల జనాభా ఉంటే వారి (కౌశిక్​రెడ్డి) భావన ప్రకారం అందులో80 లక్షల మంది సెటిలర్సే. కానీ మా భావన ప్రకారం వాళ్లందరూ తెలంగాణ బిడ్డలే. తెలంగాణలో నివసిస్తున్నారు. ఇక్కడ స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు.

 తెలంగాణ కోసం పాటుపడుతున్నారు.  వారందరి మనోభావాలను కౌశిక్​రెడ్డి దెబ్బతీశారు” అని పేర్కొన్నారు.  రాజకీయ స్వార్థంకోసం ప్రజల మధ్య వైషమ్యాలు, ప్రాంతీయ విభేదాలు సృష్టిస్తారా? అని మండిపడ్డారు. 

ఈ దేశంలో పుట్టినవారందరికీ ఎక్కడైనా జీవించే హక్కు ఉన్నదని, హైదరాబాద్​లో ఎన్నో రాష్ట్రాల వారు నివసిస్తున్నారని తెలిపారు. అలాంటప్పుడు ఆంధ్రా సెటిలర్ అని ఎలా అంటారంటూ కౌశిక్​రెడ్డిపై మండిపడ్డారు.

 ఈ వ్యాఖ్యలు కౌశిక్​వ్యక్తిగతమా? లేక బీఆర్ఎస్​పార్టీ అభిప్రాయమా? అనేది స్పష్టం చేయాలని డిమాండ్​ చేశారు. సమావేశంలో రవీంద్రబాబు, వెంకటేశ్వర్లు, బి.మధుసూదన్,​తదితరులు పాల్గొన్నారు.