- మహారాష్ట్ర ఎన్నికల్లో రాహుల్, రేవంత్ పచ్చి అబద్ధాలు
- అమలు చేయని హామీలను చేసినట్లు ప్రచారం
- కొనుగోలు కేంద్రాలకు వడ్లు వచ్చినా ఎందుకు కొంటలే?
- మూసీ పేరుతో పేదల ఇండ్లు కూలుస్తున్నరని ఫైర్
- యాదాద్రి జిల్లాలో వడ్ల కొనుగోలు కేంద్రాల పరిశీలన
పోచంపల్లి, వెలుగు: కాంగ్రెస్ పార్టీ రైతు డిక్లరేషన్‌లోని హామీలు బోగస్అని తేలిపోయాయని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. 11 నెలలు అయినా అందులోని ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదని దుయ్యబట్టారు. రైతులకు రుణమాఫీ చేసినా అది కూడా అరకోరనే చేశారని, బోనస్ కు దిక్కేలేదని వ్యాఖ్యానించారు. శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం గౌస్ కొండ, రేవనపల్లి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను కిషన్‌రెడ్డి పరిశీలించారు. పలువురు రైతులతో మాట్లాడి కొనుగోలు తీరును అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండు నెలల నుంచి కొనుగోలు కేంద్రాలకు రైతులు వడ్లను తీసుకొచ్చి ఎదురుచూస్తున్నారని అన్నారు. కొనుగోళ్లను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. ‘‘ఎన్నికల ముందు అన్ని రకాల వడ్లకు రూ. 500 బోనస్ ఇస్తామని కాంగ్రెస్ నేతలు చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సన్న వడ్లకే ఇస్తామంటూ రైతులను మోసం చేశారు. రాష్ట్రంలో అత్యధికంగా పండించేది దొడ్డు వడ్లే. రాష్ట్రం లో 64 లక్షల మంది రైతులు రుణాలు తీసుకుంటే ,17 లక్షల రైతులకే మాఫీ చేసి చేతులు దులుపుకున్నారు. మహిళలకు ఇస్తామన్న నెలకు రూ. 2,500, కళ్యాణ లక్ష్మికి తోపాటు తులం బంగారం, యువకులకు నిరుద్యోగ భృతి, వృద్ధులకు రూ. 4 వేల పెన్షన్లు ఏమయ్యాయి?” అని ప్రశ్నించారు.
బోటింగ్ చేశారే తప్పకల్లాల దగ్గరికి ఎందుకు పోలే?
హామీల అమలులో తెలంగాణ ప్రజలను రేవంత్‌రెడ్డి, రాహుల్ గాంధీ మోసం చేశారని కిషన్‌రెడ్డి మండిపడ్డారు. ‘‘ఇక్కడ హామీలు అమలు చేయకుండా.. చేసినట్లుగా మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో పచ్చి అబద్ధాలు చెప్తున్నారు. మూసీ ప్రక్షాళన కోసం పర్యటించిన సీఎం రేవంత్‌రెడ్డి.. మూసీలో బోటింగ్ చేశారే తప్ప కనీసం కల్లాల్లో ఉన్న రైతులను కల్వకుండావెళ్లిపోవడం విడ్డూరం” అని ఆయన వ్యాఖ్యానించారు.
‘‘మూసి ప్రక్షాళనకు రూ. లక్షా యాభై వేల కోట్లు ఎప్పుడు వస్తాయో తెల్వదు? ఏ నీటితో మూసిని నింపుతారో తెల్వదు? అది ఎప్పటికీ పూర్తవుతుంతో తెల్వదు? మూసీకి ఇరువైపులా ఉన్న పేదల ఇండ్లను మాత్రం మూసీ ప్రక్షాళన పేరుతో కూలగొడ్తున్నరు” అని మండిపడ్డారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో గత బీఆర్ ఎస్ ప్రభుత్వం లాగానే ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని, ప్రభుత్వానికి బాధ్యత లేదని అన్నారు. ‘‘గతంలో ధాన్యం కొనుగోళ్ల విషయంలో సన్న వడ్లు, దొడ్డు వడ్లు అని ఢిల్లీలో కేసీఆర్ ధర్నా చేసిండు. కానీ ఆయన ఎందుకు ధర్నా చేసిండో ఇప్పటికీ కేసీఆర్‌కే తెల్వదు” అని విమర్శించారు.
రాహుల్ గాంధీకి దమ్ము, ధైర్యం ఉంటే, రాజకీయ లక్షణాలు ఉంటే, రైతులపై చిత్తశుద్ధి ఉంటే కల్లాల వద్ద ఉన్న రైతుల దగ్గరికి రావాలని డిమాండ్ చేశాడు. సీఎం హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి మాట్లాడే భాష మార్చుకోవాలని ఆయన అన్నారు. కాగా, ధాన్యం కొనుగోళ్లలో అలసత్వంపై రైతుల ముందే జిల్లా కలెక్టర్ కు కిషన్‌రెడ్డి ఫోన్ చేయగా స్విచ్చాఫ్ వచ్చింది. వెంటనే జాయింట్ కలెక్టర్ వీరారెడ్డి తో కిషన్ రెడ్డి ఫోన్లో మాట్లాడి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రమంత్రి వస్తున్నారన్న సమాచారం ఇచ్చినా అధికారులు ఎందుకు ఇక్కడికి రాలేదని ప్రశ్నించారు. వడ్ల కొనుగోళ్లను వేగవంతం చేయాలని ఆదేశించారు. కిషన్‌రెడ్డి వెంట నాయకులు బూర నర్సయ్య గౌడ్ , గూడూరు నారాయణ రెడ్డి, కాచం వెంకటేశ్వర్లు ఉన్నారు.