తెలంగాణ కిచెన్: పొద్దున లేవగానే వేడివేడిగా టీ లేదా కాఫీ తాగే బదులు ఈ పాలు తాగితే..

తెలంగాణ కిచెన్: పొద్దున లేవగానే వేడివేడిగా టీ లేదా కాఫీ తాగే బదులు ఈ పాలు తాగితే..

చలి మొదలైపోయింది. పొద్దున లేవగానే వేడి వేడిగా టీ లేదా కాఫీ తాగాలనిపిస్తుంటుంది చాలామందికి. అయితే, వాటి బదులు ఈ పాలు తాగితే హెల్త్​కి కూడా మంచిది. ఎవరికి నచ్చిన ఫ్లేవర్​లో వాళ్లు ఇలా వెరైటీగా తయారుచేసుకుని పాలను గటగటా తాగేయొచ్చు. ఈ నెల నేషనల్ మిల్క్ డే (నవంబర్ 26) సందర్భంగా వీటిని తప్పకుండా ట్రై చేయండి. 

మఖానా మిల్క్

కావాల్సినవి : మఖానా - పావు కప్పు, నెయ్యి - పావు టీస్పూన్, బాదం, వాల్ నట్స్ - ఒక్కోటి రెండు టేబుల్ స్పూన్లు, ఎండుద్రాక్ష - పది, కర్జూరలు - నాలుగు,  కస్టర్డ్ పౌడర్ - రెండు టీస్పూన్లు, పసుపు - చిటికెడు, చక్కెర - రెండు టీస్పూన్లు,  మిరియాల పొడి, యాలకుల పొడి - ఒక్కోటి అర టీస్పూన్ చొప్పున

తయారీ : పాన్​లో మఖానా వేసి నూనెలేకుండా వేగించి పక్కన పెట్టాలి. తర్వాత నెయ్యి వేడి చేసి అందులో బాదం, వాల్​నట్స్, పిస్తా, జీడిపప్పు పలుకులు వేసి వేగించాలి. అవన్నీ వేగాక ఎండుద్రాక్ష, కర్జూర తరుగు వేసి, అందులో పాలు కూడా పోసి కలపాలి. 

చిన్న గిన్నెలో కస్టర్డ్ పౌడర్ వేసి, పాలు పోసి కలపాలి. పాలు బాగా మరిగాక, కస్టర్డ్ పౌడర్ కలిపిన పాలు కూడా పోసి కలపాలి. మరికాసేపు మరిగాక, పసుపు, మిరియాల పొడి, యాలకుల పొడి, చక్కెర వేసి కలపాలి. మఖానా ఉడికాక గ్లాసులోకి తీసుకోవాలి. అంతే.. వేడి వేడి మఖానా మిల్క్ రెడీ.

మసాలా మిల్క్

కావాల్సినవి : పాలు - ఒక లీటర్ మసాలా మిల్క్ పౌడర్ - నాలుగు టేబుల్ స్పూన్లు చక్కెర - సరిపడా మసాలా మిల్క్ పౌడర్​ కోసం బాదం, జీడిపప్పు - ఒక్కోటి అరకప్పు చొప్పున పిస్తా పప్పు - పావు కప్పు యాలకులు - ఇరవైఐదు మిరియాల పొడి - అర టీస్పూన్ శొంఠి పొడి, పసుపు - ఒక్కో టీస్పూన్ జాజికాయ పొడి - కొంచెంకుంకుమ పువ్వు - అర గ్రాము

తయారీ : పాన్​లో బాదం, పిస్తా, జీడిపప్పులు వేసి వేగించాలి. వాటిని ఒక ప్లేట్​లోకి తీసి చల్లారబెట్టాలి. తర్వాత వాటిన్నింటినీ మిక్సీజార్​లో వేయాలి. వాటితోపాటు శొంఠి పొడి, మిరియాల పొడి, యాలకుల గింజలు, జాజికాయ పొడి, కుంకుమ పువ్వు, పసుపు వేసి పలుకులుగా గ్రైండ్ చేయాలి. ఆ పొడిని గ్లాస్​జార్​లో పెట్టి ఫ్రిజ్​లో పెడితే ఎప్పుడు వాడినా ఫ్రెష్​ ఫీల్ ఇస్తుంది.

గిన్నెలో పాలు పోసి బాగా మరిగించాలి. ఆ తర్వాత అందులో రెడీ చేసుకున్న మసాలా పొడి వేసి కలపాలి. పదినిమిషాల పాటు ఆ మిశ్రమాన్ని కాగబెట్టాలి. తర్వాత అందులో చక్కెర వేసి కలపాలి. ఘుమఘుమలాడే మసాలా టీ ఈ వింటర్​కి పర్ఫెక్ట్​ డ్రింక్​. 

హాట్ చాకొలెట్

కావాల్సినవి : పాలు - పావు లీటర్ కాఫీ పొడి - పావు టీస్పూన్ కొకొవా పౌడర్ - ఒక టేబుల్ స్పూన్ చక్కెర - రెండు టీస్పూన్లు కార్న్​ఫ్లోర్ - ఒకటిన్నర టీస్పూన్
డార్క్ చాకొలెట్ - పావు కప్పు నీళ్లు - సరిపడా

తయారీ : ఒక పాన్​లో పాలు పోసి కాగబెట్టాలి. అవి మరిగాక అందులో కాఫీ పొడి, కొకొవా పౌడర్, చక్కెర వేసి కలపాలి. చిన్న గిన్నెలో కార్న్​ ఫ్లోర్ వేసి, నీళ్లు పోసి కలపాలి. ఆ నీటిని కూడా పాల మిశ్రమంలో పోయాలి. 

పాలు మరిగేటప్పుడు డార్క్ చాకొలెట్ కూడా వేసి కలపాలి. మరికాసేపు మరిగిస్తే సరి. ఎంతో ఈజీగా, సింపుల్​గా, టేస్టీగా హాట్​ చాకొలెట్ రెడీ. 

ఖజూర్ మిల్క్

కావాల్సినవి : ఎండు కర్జూరలు - ఏడు డ్రై అంజీర్ - ఒకటి పాలు - రెండు కప్పులు యాలకులు - మూడు దాల్చిన చెక్క - చిన్న ముక్క

తయారీ : ఒక గిన్నెలో ఎండు కర్జూరలు, డ్రై అంజీర్ వేసి నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టాలి. తర్వాత కర్జూరల్లోని గింజలు తీసేసి, నానబెట్టిన నీటితోపాటే కర్జూరలు, అంజీర్​ని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఒక గిన్నెలో పాలు పోసి కాగబెట్టాలి. అందులో కర్జూర పేస్ట్, యాలకులు, దాల్చిన చెక్క వేసి కలపాలి. ఆ తర్వాత మిశ్రమం దగ్గరపడేవరకు మరిగించాలి. అంతే.. ఈ చలిలో వెచ్చగా పవర్​ఫుల్ మిల్క్​ తాగేయొచ్చు.