గిగ్ వర్కర్ల యాక్ట్ అభ్యంతరాల స్వీకరణకు గడువు పెంపు

 గిగ్ వర్కర్ల యాక్ట్ అభ్యంతరాల స్వీకరణకు గడువు పెంపు
  • మూడు వారాలు పొడిగించిన కార్మిక శాఖ

హైదరాబాద్, వెలుగు: గిగ్, ప్లాట్ ఫామ్ వర్కర్ల భద్రతకై రాష్ర్ట ప్రభుత్వం తీసుకురానున్న డ్రాఫ్ట్ బిల్ పై అభ్యంతరాలు, సలహాలు, సూచనల స్వీకరణ గడువును కార్మిక శాఖ పొడిగించింది. మరో మూడు వారాల పాటు (మే 18 వరకు) అభ్యంతరాల స్వీకరణ గడువును  పొడిగిస్తున్నట్లు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. నిజానికి ఈ డ్రాఫ్ట్ బిల్ పై అభ్యంతరాల స్వీకరణ గడువు ఈ నెల 28తోనే ముగిసింది. ఇప్పటి వరకు 50కి పైగా అభ్యంతరాలు వచ్చాయి. 

కాగా..ఈ అభ్యంతరాలను కార్మిక శాఖ అధికారుల కమిటీ   అధ్యయనం చేసి ప్రభుత్వానికి రిపోర్ట్ అందచేయనుంది. ఈ బిల్ ను కార్మిక శాఖ.. వెబ్ సైట్ లో www.labour.telangana.gov.in  అందుబాటులో ఉంచింది. అభ్యంతరాల స్వీకరణను ఆన్ లైన్ లో అయితే tg.gig.labour@gmail.com మెయిల్ ఐడీకి, ఆఫ్ లైన్ లో అయితే  “సజెషన్స్ ఆన్ గిగ్ వర్కర్స్ బిల్ ”అని కవర్ పేజీ మీద రాసి ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని టాస్క్ భవన్ లోని లేబర్ కమిషనర్ కార్యాలయానికి పంపాలని కార్మిక శాఖ సూచించింది. 

వచ్చిన అభ్యంతరాల్లో గిగ్ వర్కర్లకు కంపెనీలు ఇచ్చే వేతనంపై గైడ్ లైన్స్ లేవని, ఈ అంశాన్ని చేర్చాలని పలువురు కార్మిక శాఖను కోరారు. అదే విధంగా పబ్లిక్ తో పాటు గిగ్ వర్కర్ల సమస్యలను కార్మిక శాఖ దృష్టికి తీసుకువచ్చేందుకు, వాటిని పరిష్కరించేందుకు టైమ్ ను స్పష్టం చేయాలని ఎక్కువ వినతులు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా ఓలా, ఉబర్, ర్యాపిడో కంపెనీలు వర్కర్లకు జీతాలు సరిగా ఇవ్వటం లేదన్న ఫిర్యాదులు వచ్చినట్లు తెలుస్తోంది.