తెలంగాణ తెలుగు: 400ల పేజీలతో తొలి డిక్షనరీ..

ఎన్కట ఎన్నడో ఇన్న మాటలు, వాడుకల లేకుంట వోయిన పదాలు.. సడెన్ ఎక్కడ్నన్న ఇంటే దిల్‌ బర్పూర్‌ అయితది. పాత సంగతులన్నీ యాదికొస్తయి. కాటగల్సినోనికి తొవ్వ దొరికనట్టయితది. అయితే, కొన్ని వేల పదాలల్ల మనకు యాదికున్నయ్‌, వాడుకలున్నయ్‌ పుడిసెడన్నే . కరెక్ట్‌ మీనిం గ్‌ తెల్వక చానా పదాలు మనోళ్లు వాడరు. ఈ పరేషానీ లేకుంట తెలుగు యూనివర్సిటీ తెలంగాణ పదాలతో ఇప్పుడు పెద్ద డిక్షనరీ తెచ్చింది.

తెలంగాణ తెలుగుకు డిక్షనరీ వచ్చింది. తెలంగాణ తెలుగుల ఉన్న వేలాది తేటతెనుగు పదాలతో నాలుగు వందల పేజీల తొలి పదకోశం అందుబాటులోకి తెచ్చింది తెలుగు విశ్వవిద్యాలయం. ఇందులో కనుమరుగైనవి. వినుమరుగైనవి. కాలగర్భంలో కల్సిపోతున్నదశలో ఉన్నవి వేల పదాలున్నాయి. తెలంగాణ పలుకుబడులు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. ఇన్నాళ్లు పాఠ్య పుస్తకాల్లో మనం మాట్లాడే భాషకు స్థానం లేదు. మనం నిత్యజీవితంలో వాడే పదాలు కూడా పుస్తకాల్లో, పత్రికల్లో రాలేదు. విస్మరణకు గురైన వేల పదాలు ఇందులో కోకొల్లలుగా ఉన్నాయి.  గతంలో వ్యక్తిగత స్థాయిలో కొంతమంది తెలంగాణ పదాలను ఏర్చి కూర్చి  పుస్తకాలుగా వెలువరించారు. అవి పూర్తి స్థాయిలో తెలంగాణ పదాలను పట్టుకోలేదు. తొలిసారిగా యూనివర్సిటీవారు గ్రామాల నుండి ప్రాచీన సాహిత్య గ్రంథాల నుండి పదాల సేకరణ చేశారు. అందులో వడపోతల తర్వాత తెలుగు యూనివర్సిటీ ప్రచురించిన ’తెలంగాణ పదకోశం’లో 30 వేల పదాలు తీసుకున్నారు.

తెలంగాణ భాషను, యాసను ప్రధాన స్రవంతిలో పదాల వాడుక ఎట్లా ఉండాలనేదానికి ఇది ఉపయోగపడుతుంది. భాషలోనూ చాలా మార్పులు వచ్చాయి. చాలా పదాలు కాలగర్భంలో కల్సిపోయాయి. అరవై యేండ్లకు పైబడిన వారితో మాట్లాడి, వారి నుండి తీసుకున్న పదాలే ఎక్కువగా ఉన్నాయి.  దక్కన్ పీఠ భూమి ప్రజల జీవన విధానమే కాదు వారి భాష, ఆచార వ్యవహారాలు మిగతా ప్రాంతాల కంటే భిన్నంగా ఉంటాయి. వందల యేండ్ల నుండి వివిధ సమూహాలు సహజీవనం చేస్తున్నాయి. కాబట్టి, పూర్వపు తెలుగు పదాలను ప్రాచీన సాహిత్య గ్రంథాల నుండి. మారిన భాష స్వరూప పదాలను ఆధునిక తెలంగాణ సాహిత్యం నుండి ప్రజల నుండి తీసుకున్నారు.

తెలంగాణ భాష అంటే మాండలికం అనే అభిప్రాయం చాలామందిలో ఉంది. పదకోశంకూడా అలాగే ఉంటుందని అనుకుంటారు. ధాతు పదాలతో దీన్ని తయారు చేశారు. మాండలికాలు ఉన్నప్పటికీ ధాతు పదాలతోనే పదకోశం తయారైంది. మన వాడుక మాటల్లో హిందీ, ఉర్దూ, కన్నడ, మరాఠీ, ఇంగ్లీషు, పార్శీ పదాలు చాలా ఉన్నాయి. తెలంగాణకు నలు దిక్కుల సరిహద్దు రాష్ట్రాల ప్రభావం ఉంది. రోజువారీ ముచ్చట్లలో, వ్యవసాయ. ఇతర వృత్తి సంబంధమైన విషయాల్లో ఇది ఎక్కువ

పండగలు, పబ్బాలు, గృహోపకరణాలు, సంస్కృతి, సంప్రదాయాలు, ఆహారం, అలవాట్లు, నిత్యజీవిత సంభాషణల్లో మనం వాడుక మర్చిపోయిన పదాలు సుమారు 15 నుండి 20 వేల వరకు కన్పిస్తాయి. ఒకప్పుడు వాడుకలో ఉండి,  కాలక్రమంలో వ్యవసాయ, ఇతర వృత్తి వ్యాపార లావాదేవీల్లో మార్పుల వల్ల తగ్గిపోయినవి  దాదాపు పది వేల పదాలు ఉన్నాయి. ప్రయాణ సాధనాలు. మానవ సంబంధాలు. అలవాట్లు. ఇలా అనేక అంశాలను వ్యక్తీకరించే పదాలు చేర్చారు. వాటన్నింటికీ అర్థ వివరణలు ఇచ్చారు.

పునరుక్తులు లేకుండా ధాతువు ఆధారంగా పదాల ఎంపిక జరిగింది. ఇందులో యాస పలు తీర్ల ఉంటుంది. కాబట్టి పలకడంలో తేడా ఉంటుంది. అందువల్ల ఒకటి రెండు పదాలనే ప్రామాణికంగా తీసుకున్నట్లు డిక్షనరీని బట్టి అర్థమవుతోంది. ఉదాహరణకు వచ్చిండ్రు, పోయిండ్రు, అచ్చిండ్లు, అచ్చిండ్లా వంటివి ఆయా ప్రాంతాల్లో ఉండే మాండలిక పదాలన్నింటికీ ‘వచ్చినారు’ అనే ప్రామాణిక పదంతో సమాధానమిచ్చే ప్రయత్నం చేసిందీ పదకోశం. ఇట్లా చాలా పదాల స్థిరీకరణ కన్పిస్తుంది. తెలంగాణ తెలుగును ఎట్లా రాయాలి. ఏయే వాటికి ఏయే పదాలు రాయాలనే విషయాల పట్ల కూడా స్పష్టతనిచ్చే ప్రయత్నం పదకోశంలో కన్పిస్తోంది.

గతంలో భద్రిరాజు కృష్ణమూర్తి, ప్రొఫెసర్​ తూమాటి దోణప్ప,  బూదరాజు రాధాకృష్ణ, కపిలవాయి లింగమూర్తి, పోరంకి దక్షిణామూర్తి, కాలువ మల్లయ్య, నలిమెలి భాస్కర్, ముదిగంటి సుజాతారెడ్డి, రవ్వా శ్రీహరి వంటివారు వ్యక్తిగతంగా తెలంగాణ భాషా పదాలు, మాండలికాలపై వృత్తి పద కోశాలు, ఇతర పదకోశాలు వెలువరించారు. వీరి గ్రంథాలు కూడా ఈ పదకోశం తేవడానికి దోహదం చేసినట్లు ముందుమాటలో పేర్కొన్నారు సంపాదకులు. వీరికి సాయపడిన వారందరి పేర్లూ చెప్పారు. ఈ పదాల సేకరణకు కోఆర్డినేటర్​గా ప్రొఫెసర్ రమేష్ భట్టు వ్యవహరించారు. ప్రొ.రవ్వాశ్రీహరి, వెంకన్న, సంగిశెట్టి శ్రీనివాస్ తదితరులు ఈ పదకోశం తేవడానికి కృషి చేశారు.

తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ తెలుగు ఎట్లా ఉండాలనే చర్చ మొదటినుండీ జరుగుతున్నదే. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసినవాటిలో ప్రధానమైనది భాషనే. వివిధ జిల్లాల్లో వివిధ తీర్ల పలికే  పదాలను, పలుకుబడులను, నుడికారాలను అన్నింటినీ ఏర్చి కూర్చి పదకోశం తీసుకొచ్చారు.

– గొర్ల బుచ్చన్న

మనం మరిచిన పదాలు

బుడకు: వెతుకు

బుడబుంగ: నీటిలో తేలే పక్షి

బుడపర్కలు: ఒకరకమైన చేపలు

అంగుప్త్ నిషా: వేలి ముద్ర

అంగుళి: బొటనవేలు

అంటు: మైలసుద్ది చేసుకొను

అంత గొడితే: అంత కూడితే,

మహా: మొత్తం మీద

అంబగాళ్లడు: పాకు

అంబటాల్ల: అంబలి తాగే సమయం, గొర్లు విడచుకొని మన్నె వెళ్లిపోయే సమయం, అంబటి పొద్దు

అంశ: దశ, భాగం

అంశమంతుడు: అదృష్టవంతుడు, దశావంతుడు

అగుడు: అత్యాశ, దిక్కులేని దశ, దిక్కులేనివాడు

అగుపడ్డది: కనిపించు 

అట్కర్తనం: కఠినత్వం

అట్టిగ: ఖాళీగా, ఉత్తగనే, ఊరకనే, వట్టిగా

ఇద్దం:  రెండు తూములు.

ఇరా: కోరిక

ఇరాం: విరామం, విశ్రాంతి

ఇరస: రెండు కుంచాలు

ఇరికి: దూరి

కడీ: రాతి దులాలు

కడక్కతాగు: ఏమీ మిగలకుండా చేయు

కడుపాత్రం: తిండిమీద యావ

కత్తెర జుంపాలు: క్రాపు

కన్నె దార: కన్యాదానం

కపిశ్కె: సముద్రపు చిప్ప, లట్టగువ్వ పెంకు, నత్తడిప్ప, కౌచిప్ప

కల్మి చెక్క: దాల్చిన చెక్క 

కూంత కూంత: కొంచెం కొంచెం

గొగ్గి: వంకర

జపజప: తొందర తొందరగా, దబదబ, జల్దిజల్దిగా

జబ్బ: భుజం

జన్కొద్దు: భయపడొద్దు

జంబు: నీటిలో పెరిగే ఒక గడ్డి జాతి మొక్క

టాటా మార్: దోపిడీ చేయు

టీవీటీవీగాడు: అపశకునం పక్షి 

తూటు: రంధ్రం, చిల్లి

తెరువు: దారి, బాట

తెర్లు: వేరువేరు దారులు

దొడ్డుగా: లావుగా, గట్టిగా

నాలుగు తవ్వలు: ఒక అడ్డెడు

నిగురాని: పర్యవేక్షణ, కాపలా

నింబోలి: వేపపండు రంగు

పంట్రకోల: చర్లకోల

బందె: కారాగారం

బురుగు: రహస్యం

మానుక: ధాన్యం కొలిచే పరికరం

మాన్: మనస్సు

మాపు: కొలత

మాలె: చిటుకు

రాట: కర్ర, గుంజ

రాకట: రాక

రయ్యత్: రైతు

వంపుల: జాలాడు

వడి సంచి: విత్తనాలు పోసుకొనే సంచి

శికే: కొప్పు

శిట్టెడు: కొలత ప్రమాణం

శిరానా: తలాపున

శుష్టి: ముట్టు, శెరువాకం, చెడగొట్టడం

సడ్డ: శ్రద్ద 

సుత్తులు: మెట్టు

హట్ట: అంగడి

హారం: దేవునికి సమర్పించే బలి

హరిపురి:  కబడ్డీ

 

విరివిగా వాడుతున్న పదాలు

గ్రామీణుల మాటలు కొన్నింటిని యధాతథంగా తీసుకున్నారు. ఇందులో ఎక్కువగా వృత్తులు, వివిధ వ్యక్తీకరణలకు సంబంధించినవి ఉన్నాయి. పెద్ద పెద్ద భావాలను వ్యక్తీకరించడానికి ఊళ్లల్లో చిన్న చిన్న పదాలను వాడుతారు. అంగడంగడి: గందరగోళం, అంగడిపెట్టుడు: ఇంట్లోని సామాను బయట వేయడం, అంగు: పద్దతి, వీలు, స్వాధీనం, అండ్ల: అందులో, అక్కడ, అంతట్నే: అంతలోనే, అంతదన్క: అంతవరకు, అంతన పొంతన: మర్యాద, అంతమాట: అనరాని మాట, అంతెర్కె: అంతా తెలుసు… ఇట్లా చాలా పదాలను తీసుకున్నారు. ఇవే రాబోయే రోజుల్లో పుస్తకాల్లోకి, మీడియాలోకి రాబోతున్నాయి. ద్వంద్వార్థాలు ధ్వనించే వాటిని మినహాయించి మిగిలిన పదాలను గ్రామాల్లో ప్రజలు మాట్లాడుకునే భాషలో నుండే తీసుకున్నారు.

తెలంగాణ ఆత్మను పట్టించే పదాలు

అంగి, అంగి లాగు, ఆవల్లకి, ఈగరానికి, ఈడ, కొరకాసు, కొరగాని, కిమ్మను, ధుశ్శేరు తీగ, దుసుముడి,  గంటనొప్పి, గంటీలు, హవులే, బట్టేబాజ్, బుడిగరాళ్లు, బగ్గ, బుడము, భీరిపోవు, బీడువడు, పుడ, పవోజీనం, పశనత్, పామ్ గాడి(సైకిల్), హవాయిజాతి (విమానం), హిమ్మతు, పాపోజులు (చెప్పులు), పాబంది, పసిద్ద,  పామరు (నీటి తడి), పాన్ గోబి (క్యాబేజీ), పానం (ఒళ్లు), పవుడ (పార), తపుకు, దిగుడు, సిబ్బి, గుమ్మి, గంప, కంప, టంకం (అతుకు), పెండకడి, జేబు, జేవరాత్… ఇలాంటి పదాలు కోకొల్లలు. దీంట్లో చాలా పదాల్ని ఇప్పటికీ వాడుతున్నారు.

పదాల సేకరణ ఇట్లా : తెలుగు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఎస్వీ.సత్యనారాయణ సంపాదకత్వంలో ఈ పదకోశం వెలువడింది.  దీని తయారీకోసం 30 మంది మూడేళ్లపాటు తిరిగి వీటిని సేకరించారు.  జిల్లాకు ఒకరి చొప్పున ఉమ్మడి పది జిల్లాల్లో క్షేత్ర స్థాయి పర్యటనలు చేశారు. వర్క్ షాపులు. వ్యక్తిగత సంభాషణలతో పదాలు తీసుకున్నారు. ఇట్లా లక్షా పది వేల పదాలు సేకరించారు. ఇందులో నుండి 30 వేల పదాలను కూర్చి పదకోశం తయారు చేశారు. పునరుక్తులు. ఆరోపణలను (ఒకే ధాతుపదం నుండి వివిధ పదాల పుట్టుక. ఉదా: చింత, చింత చెట్టు, చింత కొమ్మ, చింత ఆకు) తొలగించి ఒకే పదాన్ని తీసుకున్నారు.