
- బార్కోడ్ లేదా క్యూఆర్ కోడ్తో పోస్ట్‌కార్డు సైజులో ఉండే చాన్స్
- మహిళల పేరు మీదే కార్డు ఇచ్చేందుకు ఏర్పాట్లు
- ఒకవైపు సీఎం, సివిల్ సప్లయిస్ మంత్రి ఫొటోలతో పాటు ప్రభుత్వ లోగో
- కుటుంబ సభ్యుల పేర్లు, డిటెయిల్స్, అడ్రస్, రేషన్ షాపు నంబర్, ఇతర వివరాలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కోటి రేషన్ కార్డులను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నది. ఇప్పుడు వస్తున్న రేషన్ దరఖాస్తులకు కొత్త కార్డులను ఇవ్వడమే కాకుండా.. మార్పులు, చేర్పులు అవుతున్న పాత కార్డుల స్థానంలోనూ కొత్తవి ఇవ్వాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. దీంతో వచ్చే నెలలో కొత్తవి, పాతవి కలిపి దాదాపు కోటి రేషన్ కార్డులను పంపిణీ చేసేలా ప్లాన్ చేస్తున్నది. గత పాత రేషన్ కార్డుకు కొంచెం తక్కువలో పోస్ట్ కార్డు సైజులో కొత్త రేషన్ కార్డు డిజైన్ఉండేలా చూస్తున్నది.
ముందుగా ఎన్నికల కోడ్ లేని ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నది. ఉమ్మడి ఏపీలో 2005లో రేషన్ కార్డుల డిజైన్ ఫైనల్ చేసి, కుటుంబ వివరాలతో కూడిన ఫొటో ముందు వైపు, కార్డు నంబర్, రేషన్ షాప్ నంబర్, ఇంటి అడ్రస్, ఇతర డిటెయిల్స్‌ను వెనకవైపు పొందుపర్చారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత కొన్ని కొత్త రేషన్ కార్డులను మంజూరు చేశారు. అయితే, కేంద్ర ప్రభుత్వం ఫుడ్ సెక్యూరిటీని తీసుకువచ్చింది.
రేషన్ కార్డులనే ఫుడ్ సెక్యురిటీ కార్డు (ఎఫ్ఎస్సీ)లుగా పిలుస్తున్నారు. కొత్త కార్డులు మంజూరు చేసినప్పటికీ.. ఆన్లైన్లో కుటుంబ సభ్యుల పేర్లు, ఆధార్ నెంబర్లు, రేషన్ షాప్‌ల వివరాలతోనే ఉంటున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 89.96 లక్షల రేషన్‌కార్డులు ఉన్నాయి. కొత్తగా ఇచ్చే కార్డులను కలుపుకొంటే.. ఇవి కోటికి చేరుతాయని అధికారులు అంటున్నారు. కొత్త రేషన్ కార్డులకు సంబంధించి పలు డిజైన్లను సీఎం రేవంత్ రెడ్డికి సివిల్ సప్లయిస్ అధికారులు ఇప్పటికే చూపించారు. రాష్ట్రంలో అనేక స్కీమ్‌లను మహిళల పేరు మీద ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. రేషన్ కార్డులు కూడా వారి పేరు మీదనే ఇవ్వాలని భావిస్తున్నది. దీంతో కొత్త రేషన్ కార్డులు.. హౌస్‌హోల్డ్ గా గృహిణి పేరుతోనే జారీ చేయనున్నారు. బార్ కోడ్తో రేషన్ కార్డులు ఇవ్వాలని ఆలోచిస్తున్నది.
రేషన్ షాపుల్లో బార్ కోడ్ మిషన్లు పెట్టడం ద్వారా.. నేరుగా ఆన్లైన్లో బార్ కోడ్ స్కాన్ చేసి, బయోమెట్రిక్తో నెలా నెలా బియ్యం పంపిణీ చేయాలని ప్లాన్ చేస్తున్నది. దీంతో పారదర్శకత ఉంటుందని భావిస్తున్నది. పోస్ట్ కార్డు సైజులో ఉంటే దానిపై సీఎం రేవంత్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫొటోలతోపాటు ప్రభుత్వ లోగో కూడా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. దీనిపై కుటుంబం మొత్తం గ్రూప్ ఫొటో ఉండాలా ? లేదా? అనేది దానిపై చర్చ జరిగింది.
అయితే ఎప్పటికప్పుడు రేషన్ కార్డుల్లో మార్పులు జరుగుతున్నందున.. ఫొటో లేకుండానే ఇచ్చే అవకాశం ఉంది. పైగా ఇప్పుడు ఫ్యామిలీ ఫొటో వేయాలంటే మళ్లీ అందరి నుంచి కుటుంబ ఫొటోలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియకు టైం పట్టనుండటంతో వెనక్కి తగ్గినట్టు తెలుస్తున్నది. కొత్త రేషన్ కార్డులో బార్ కోడ్ లేదా క్యూఆర్ కోడ్ ఉండనుంది. అడ్రస్‌తోపాటు కార్డు ఏ రేషన్ షాప్ పరిధిలో ఉందనే వివరాలు ఉండనున్నాయి.