నిరుద్యోగులు, ఉద్యోగార్థులు ఇక రెజ్యూమ్ పట్టుకొని ప్రతి కంపెనీకి తిరగాల్సిన పనిలేదు. సులభంగా జాబ్‌లు పొందేందుకు రాష్ర్ట ప్రభుత్వం డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్ఆఫ్ తెలంగాణ (డీఈఈటీ–డీట్) యాప్, వెబ్‌సైట్‌ను ఆవిష్కరించింది. దీని ద్వారా టెన్త్, ఆపైన విద్యార్హత కలిగిన వారికి అన్ని రకాల ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తూ కోరుకున్న జాబ్స్ పొందేందుకు సహకరిస్తారు. ఇందుకు మీరు చేయాల్సింది యాప్ / వెబ్సైట్లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవడమే.
డీట్ యాప్‌లో సర్వీస్ పూర్తి ఉచితం. ప్లే స్టోర్ నుంచి మొబైల్ యాప్ ను డౌన్లోడ్ చేసుకొని అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. పేరు, ఈమెయిల్, కాంటాక్ట్ నంబర్‌తో పాటు క్వాలిఫికేషన్స్, స్కిల్స్, వర్క్ ఎక్స్పీరియన్స్ వంటి వివరాలు నమోదు చేసి మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలి. అభ్యర్థి సమాచారం రిక్రూటర్లకు కన్పించదు కానీ నిర్వహకులు సార్ట్అవుట్ చేసి ఎలిజిబిలిటీ ఉన్న కంపెనీలకు మీ డేటా పంపుతారు. ప్రస్తుతం ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే యాప్ అందుబాటులో ఉంది.
ఎలా పని చేస్తుంది?
ఆఫ్‌లైన్‌లో ఎంప్లాయ్మెంట్ ఎక్సేంజ్ తరహాలో ఇది పనిచేస్తుంది. అభ్యర్థి క్వాలిఫికేషన్స్, స్కిల్స్, ఎక్స్పీరియన్స్, అదర్ యాక్టివిటీస్ వంటి పూర్తి సమాచారం ఈ యాప్/వెబ్సైట్లో నమోదు చేస్తే చాలు. మీకు సూటయ్యే జాబులు వాళ్లే వెతికి పెడతారు. అభ్యర్థుల అప్లికేషన్లు పరిశీలించి అవసరమైన కంపెనీలకు పంపితే ఆయా కంపెనీలు ఇంటర్వ్యూలు, టెస్ట్‌లు నిర్వహించి నేరుగా అభ్యర్థులను రిక్రూట్ చేసుకుంటాయి. ఇందులో దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 45 వేల కంపెనీల వివరాలు, 42 వేల జాబ్‌ల సమాచారం నమోదు చేశారు. వీటికి సంబంధించిన అలర్ట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ కే వస్తాయి.
వెబ్సైట్: www.tsdeet.com.