సంతానం లేని వారికి గుడ్ న్యూస్.. గాంధీలో ఐవీఎఫ్‌‌ సేవలు

సంతానం లేని వారికి గుడ్ న్యూస్.. గాంధీలో ఐవీఎఫ్‌‌ సేవలు
  • తొలిసారి ప్రభుత్వ దవాఖానలో అందుబాటులోకి..
  • ప్రారంభించిన మంత్రులు దామోదర, పొన్నం
  • మెడికోల హాస్టల్ బిల్డింగ్​ల నిర్మాణానికి శంకుస్థాపన
  • 15 రోజుల్లో పేట్లబుర్జు హాస్పిటల్​లో ఐవీఎఫ్​ సేవలు: దామోదర
  • రాష్ట్రవ్యాప్తంగా ఫెర్టిలిటీ సెంటర్లు విస్తరిస్తాం
  • గత సర్కారు హయాంలో పేపర్ల మీదే ఫెర్టిలిటీ సెంటర్లు 
  • తాము ప్రకటించిన నెలలోపే ఓపెన్​ చేశామని వెల్లడి

హైదరాబాద్/పద్మారావునగర్, వెలుగు: రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానలో తొలిసారి  ఐవీఎఫ్ (ఇన్​విట్రో ఫెర్టిలైజేషన్) సేవలు అందుబాటులోకి వచ్చాయి. గాంధీ హాస్పిటల్‌‌‌‌ ఎంసీహెచ్ బిల్డింగ్‌‌‌‌లోని ఐదో ఫ్లోర్‌‌‌‌‌‌‌‌లో ఉన్న ఫెర్టిలిటీ సెంటర్‌‌‌‌‌‌‌‌లో ఈ కృత్రిమ గర్భధారణ సేవలను వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మంగళవారం ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు. ఐవీఎఫ్ చేసే విధానాన్ని మంత్రులకు డాక్టర్లు వివరించారు. అనంతరం గాంధీ మెడికల్ కాలేజీ విద్యార్థుల కోసం కొత్త హాస్టల్ బిల్డింగుల నిర్మాణానికి మంత్రులు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ..  సంతానలేమి సమస్య వల్ల ఎంతో మంది దంపతులు ఇబ్బంది పడుతున్నారని, అలాంటి వారికి గాంధీలో పూర్తి ఉచితంగా ఐవీఎఫ్ సేవలు అందిస్తామని చెప్పారు. గత ప్రభుత్వం పేపర్ల మీద ఫెర్టిలిటీ సెంటర్లను ప్రకటించి, ఆచరణలో నిర్లక్ష్యం చేసిందని అన్నారు. ఐవీఎఫ్ సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని 2017లో చెప్పి, 2023లో అధికారం కోల్పోయేవరకు కూడా  అందుబాటులోకి తీసుకు రాలేదని మంత్రి గుర్తు చేశారు. 

ఈ విషయంలో తమ ప్రభుత్వం కమిట్‌‌‌‌మెంట్‌‌‌‌తో ఉన్నదని, అందుకే ప్రకటించిన నెల రోజుల్లోనే ఐవీఎఫ్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు.  ఎంబ్రియాలజిస్ట్ సహా అవసరమైన స్టాఫ్‌‌‌‌ను నియమించామని, ఎక్విప్‌‌‌‌మెంట్, రీఏజెంట్స్, మెడిసిన్ కొనుగోలు కోసం నిధులు కేటాయించామని చెప్పారు. ఆధునిక జీవన విధానంతో ఎంతో మంది ఇన్‌‌‌‌ఫెర్టిలిటీ సమస్య బారిన పడుతున్నారని, చికిత్స కోసం ప్రైవేటు హాస్పిటళ్లకు వెళ్లి లక్షలు ఖర్చు చేసుకుంటున్నారని మంత్రి తెలిపారు. మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో ఒక్క గాంధీకే ఫెర్టిలిటీ సేవలను పరిమితం చేయకుండా, రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని నిర్ణయించామని తెలిపారు. మరో 15 రోజుల్లోనే పేట్లబుర్జు దవాఖానలో ఐవీఎఫ్ సేవలను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం వంటి ఉమ్మడి జిల్లా కేంద్రాల్లోనూ ఫెర్టిలిటీ సెంటర్లను, ఐవీఎఫ్ సేవలను విస్తరిస్తామని చెప్పారు. లక్షలు ఖర్చయ్యే చికిత్సను, పూర్తిగా ఉచితంగా అందజేస్తామన్నారు. ఐవీఎఫ్‌‌‌‌ను ఆరోగ్య శ్రీ కింద చేర్చామని, తద్వారా మెడిసిన్స్ ను కూడా ఉచితంగా అందజేస్తామని మంత్రి తెలిపారు.

రూ.80 కోట్లతో హాస్టల్ భవనాలు

గాంధీ మెడికల్ కాలేజీలో చదువుతున్న అమ్మాయిల హాస్టల్ కోసం 7 అంతస్తుల బిల్డింగ్, బాయ్స్ హాస్టల్ కోసం 3 అంతస్తుల బిల్డింగ్, సీనియర్ రెసిడెంట్స్ హాస్టల్ కోసం 6 ఫ్లోర్ల బిల్డింగ్‌‌‌‌ నిర్మిస్తున్నామని మంత్రి దామోదర తెలిపారు. ఇందుకోసం రూ.80 కోట్లు కేటాయించామని చెప్పారు. ఇప్పటికే సుమారు రూ.120 కోట్లతో ఉస్మానియా మెడికల్ కాలేజీలో హాస్టల్ బిల్డింగ్స్‌‌‌‌ నిర్మిస్తున్నామని మంత్రి గుర్తు చేశారు. హాస్టల్ బిల్డింగుల సమస్యను జూనియర్ డాక్టర్లు తమ దృష్టికి తీసుకొచ్చిన రెండ్రోజుల్లోనే సుమారు రూ.200 కోట్లు కేటాయించామని చెప్పారు. పదేండ్లుగా పెండింగ్‌‌‌‌లో ఉన్న ఉస్మానియా హాస్పిటల్ కొత్త బిల్డింగ్‌‌‌‌కు కూడా త్వరలోనే శంకుస్థాపన చేస్తామని వెల్లడించారు. రోడ్డు యాక్సిడెంట్లు, ఇతర ఎమర్జెన్సీ ఘటనల్లో బాధితుల ప్రాణాలు కాపాడేందుకు 74  ట్రామాకేర్ సెంటర్లను ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. గోషామహల్‌‌‌‌లో సుమారు 32 ఎకరాల విస్తీర్ణంలో కొత్త హాస్పిటల్‌‌‌‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. క్యాన్సర్ పేషెంట్లను ఆదుకోవడానికి 6 రీజినల్ క్యాన్సర్​ సెంటర్లను ఏర్పాటు చేయబోతున్నట్టు మంత్రి వెల్లడించారు. 

విద్య, వైద్యానికి ప్రాధాన్యం: మంత్రి పొన్నం

విద్య, వైద్యానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రైవేట్​లో లక్షలు ఖర్చయ్యే ఐవీఎఫ్ సేవలను  ప్రభుత్వ దవాఖాన్లలో ఉచితంగా అందుబాటులోకి తీసుకురావడం మంచి పరిణామం అని పేర్కొన్నారు. ఈ సేవలను ప్రజలు ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రియాజ్,  హెల్త్​ సెక్రటరీ క్రిస్టినా జడ్​ చొంగ్తూ, ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ కర్ణన్, టీఎస్‌‌‌‌ఎంఎస్‌‌‌‌ఐడీసీ ఎండీ హేమంత్‌‌‌‌, డీఎంఈ వాణి, గాంధీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్​ డాక్టర్​ కే. ఇందిర, సూపరింటెండెంట్​ ప్రొఫెసర్​ రాజకుమారి, తదితరులు పాల్గొన్నారు.