హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో తమ జాతిలో మంత్రులు, ఎమ్మెల్యేలుగా ఉన్నా ఎస్సీ మంత్రి.. ఎస్సీ ఎమ్మెల్యే అంటూ ముద్ర వేస్తున్నారని మాజీ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఎస్సీవర్గీకరణ రిపోర్టును మంగళవారం మండలిలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీలు మాట్లాడారు. 30 ఏండ్లుగా ఎస్సీ వర్గీకరణ అంశంపై వేసిన కమిషన్లన్నీ దానికి మద్దతుగానే ఇచ్చాయని, ఇది చేసే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, పార్లమెంట్లోనే చట్టసవరణ చేయాల్సి ఉందన్నారు.
దళితులను నిలబెట్టింది కాంగ్రెస్సే: వేముల వీరేశం
అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్లను సజీవంగా తమ పల్లెలకు చేర్చి, తమను సజీవంగా నిలబెట్టింది కాంగ్రెస్సేనని ఎమ్మెల్యే వేముల వీరేశం చెప్పారు. గత బీఆర్ఎస్ సర్కారు 2014లో అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోతానని తీసుకుపోలేదని, దళితుడిని సీఎం చేస్తానని చేయలేదని, దళిత ద్రోహి బీఆర్ఎస్ పార్టీ అని విమర్శించారు.
అనేక అవమానాలుఅనుభవించినం: అడ్లూరి
ఎన్నో అవమానాలు అనుభవించి, తాము ఈ స్థాయికి వచ్చామని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. సుప్రీంకోర్టులో వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వచ్చిన అరగంటలోనే సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటన చేసినట్టు గుర్తుచేశారు.
మాదిగల పోరాటం గొప్పది: మందుల సామేల్
వర్గీకరణ ఉద్యమంలో తెలంగాణలోని మాదిగల పోరాటం గొప్పదని ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని తూచ తప్పకుండా సీఎం
రేవంత్ రెడ్డి అమలు చేస్తున్నారని చెప్పారు.
మాల, మాదిగలువేరుకారు: యాదయ్య
మాల, మాదిగలు వేరు కాదని, ఎస్సీ రిజర్వేషన్లను 20 శాతం పెంచేందుకు కృషి చేద్దామని ఎమ్మెల్యే యాదయ్య అన్నారు. ఇది మాదిగల జీవితాల్లో వెలుగులు నింపే రోజు అని చెప్పారు.