ఏఐ విప్లవంలో తెలంగాణ ముందంజ

  • 200 ఎకరాల్లో ఏఐ సిటీ అభివృద్ధి చేస్తం: మంత్రి శ్రీధర్​ బాబు
  • ‘ఏఐ తెలంగాణ’ లక్ష్యాల సాధనకు కంపెనీలతో 26 ఒప్పందాలు
  • ఇవి రాష్ట్రాన్ని దేశంలోనే బలమైన ఏఐ శక్తిగా మారుస్తయ్​
  • తప్పుడు సమాచారం, డీప్​ ఫేక్స్​ కట్టడికి చర్యలు తీసుకుంటామని వెల్లడి

హైదరాబాద్​, వెలుగు:ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్​ విప్లవంలో తెలంగాణ ముందంజలో ఉందని ఐటీ, ఇండస్ట్రీస్​ శాఖ మంత్రి శ్రీధర్​ బాబు అన్నారు. ఈ విప్లవంలో తెలంగాణ భాగమవడమే కాదు.. ముందుండి నడిపిస్తున్నదని ఆయన చెప్పారు. ఏఐ స్ట్రాటజీకి కేంద్ర బిందువైన హైదరాబాద్​లో 200 ఎకరాల్లో ఏఐ సిటీని అభివృద్ధి చేసేందుకు ఇటీవలే నిర్ణయించామని గుర్తుచేశారు. ఏఐ రీసెర్చ్​, అభివృద్ధికి ఈ ఏఐ సిటీ డెస్టినేషన్​గా ఉంటుందన్నారు. నూతన ఆవిష్కరణలకు ఏఐ సిటీ పుట్టినిల్లవుతుందని పేర్కొన్నారు. ప్రపంచానికి ఏఐలో తెలంగాణను చుక్కానిగా నిలిపేందుకు ఈ ఏఐ సిటీ దోహదపడుతుందన్నారు.

అత్యాధునిక కంప్యూటింగ్​ ఫెసిలిటీలు, విస్తృతమైన డేటా సెంటర్లు, సుస్థిరమైన కనెక్టివిటీ వంటి వాటిని ఏఐ సిటీ అందిస్తుందని పేర్కొన్నారు. ‘‘ఏఐ సిటీలో స్కూల్​ ఆఫ్​ ఎక్సలెన్స్​ ప్రారంభించేందుకు మేం ప్రణాళికలను సిద్ధం చేశాం. ఏఐ సిటీ నిర్మాణం పూర్తయ్యేలోపు శంషాబాద్​లో 2 లక్షల చదరపుటడుగుల విస్తీర్ణంతో అన్ని సౌకర్యాలతో కూడిన ఆఫీసు స్థలాలను ఏఐ కంపెనీలకు అందిస్తాం.  ఏఐ సిటీ నిర్మాణం జరుగుతున్నప్పుడే కంపెనీలు తమ కార్యకలాపాలను ప్రారంభించే అవకాశం ఉంటుంది” అని వివరించారు.

గురువారం ఏఐ గ్లోబల్​ సమిట్​లో మంత్రి శ్రీధర్​బాబు మాట్లాడుతూ..  ‘ఏఐ తెలంగాణ’ కింద పేర్కొన్న లక్ష్యాలను సాధించేందుకు ప్రైవేటు సంస్థలు, విద్యాసంస్థలు, టెక్​ కంపెనీలు, స్టార్టప్​లు, ఎన్​జీవోలతో కలిసి 26 ఎంవోయూలను రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్నదని వెల్లడించారు. ఇవి రాష్ట్రాన్ని దేశంలోనే బలమైన ఏఐ శక్తిగా మార్చేందుకు ఉపయోగపడతాయని చెప్పారు. కంప్యూటింగ్​ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​, ఎక్సలెన్స్​ సెంటర్లు, స్కిల్లింగ్​, ఇంపాక్ట్​ అసెస్​మెంట్​, స్టార్టప్​ ఇన్నోవేషన్​, జనరేటివ్​ ఏఐ, రీసెర్చ్​ అసిస్టెన్స్​, డేటా యానోటేషన్​ వంటి 7 విభాగాల్లో ఈ ఒప్పందాలను కుదుర్చుకున్నామని వివరించారు.

తప్పుడు సమాచారం, డీప్​ఫేక్స్​ కట్టడికి తగిన చర్యలను తీసుకుంటామన్నారు. కాగా.. 11.3 శాతం ఆర్థిక వృద్ధితో రాష్ట్ర జీఎస్డీపీ 176 బిలియన్​ డాలర్లకు పెరిగిందని, దానిని ట్రిలియన్​ డాలర్ల ఎకానమీగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి శ్రీధర్​బాబు తెలిపారు. 

ఏఐపై సర్కారు ముందు నుంచీ పట్టుదలతో ఉంది: జయేశ్​ రంజన్​

హైదరాబాద్​ సిటీని ఏఐ హబ్​గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందు నుంచీ పట్టుదలతో ఉందని ఐటీ, ఇండస్ట్రీస్​ శాఖ కార్యదర్శి జయేశ్​ రంజన్​ అన్నారు. శ్రీధర్​ బాబు మంత్రి అయ్యాక దీనిపై వరుస రివ్యూలు చేశారని, అందుకు తగ్గట్టు డిపార్ట్​మెంట్​ కసరత్తులు చేసిందని, సీఎం రేవంత్​ రెడ్డి అన్నింటినీ ప్రోత్సహించారని తెలిపారు.

కొద్ది నెలల కింద అమెరికా, దక్షిణ కొరియా పర్యటనల్లో భాగంగా సీఎం రేవంత్​ రెడ్డి తాము కలిసిన కంపెనీల ప్రతినిధులందరికీ ఏఐ గ్లోబల్​ సమిట్​ గురించి చెప్పారని ఆయన వివరించారు.