రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 3,12,522.. పర్ క్యాపిటా ఇన్కమ్లో పెద్ద రాష్ట్రాల్లో మనమే టాప్

రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 3,12,522.. పర్ క్యాపిటా ఇన్కమ్లో పెద్ద రాష్ట్రాల్లో మనమే టాప్
  • జీఎస్ జీడీపీలో 7వ స్థానం
  • రాష్ట్రంలో తలసరిలో టాప్ ​రంగారెడ్డి జిల్లా
  • మెజార్టీ ఉపాధి రంగం వ్యవసాయమే
  • 51 శాతం మందికి అగ్రి, అనుబంధ రంగాల్లోనే పని 
  • తెలంగాణ స్టాటిస్టికల్ అబ్​స్ట్రాక్ట్​ నివేదికలో వెల్లడి

హైదరాబాద్, వెలుగు: తలసరి ఆదాయంలో దేశంలోని పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ  టాప్ లో నిలిచింది.  తెలంగాణ లో పర్​క్యాపిటా ఇన్​కమ్​ రూ.3,12,522గా ఉన్నది. 2014-15 నుంచి 2023-24 వరకు యావరేజ్ యాన్యూవల్ గ్రోత్ రేట్ (ఏఏజీఆర్) చూస్తే 14 శాతంతో జాతీయ తలసరి ఆదాయంతో పోల్చినప్పుడు 8.7% వృద్ధి రేటును సాధించింది. ప్రస్తుతం 12.4 శాతంతో, జాతీయ తలసరి ఆదాయంలో 9 శాతం వృద్ధి రేటును సాధించి పర్ క్యాపిటాలో టాప్​లో కొనసాగుతున్నది. 2023-24 జీఎస్ జీడీపీలో 7వ స్థానంలో ఉన్నది. సోమవారం ప్లానింగ్ డిపార్ట్​మెంట్​ ఆధ్వర్యంలో రూపొందించిన తెలంగాణ స్టాటిస్టికల్ అబ్​స్ట్రాక్ట్​ (అట్లాస్) 2023-24 పుస్తకాన్ని సెక్రెటేరియెట్​లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క  ఆవిష్కరించారు.

రాష్ట్రంలో మెజార్టీ శాతం మందికి వ్యవసాయమే జీవనాధారంగా ఉంది.  1.5 కోట్ల మంది వివిధ రంగాల్లో ఉపాధి పొందుతుండగా.. వారిలో 51శాతం మందికి వ్యవసాయం, అనుబంధ రంగాలతోపాటు మైనింగ్  ఉపాధిని అందిస్తున్నది.  ఇందులో  ఉపాధి కల్పనలో.. తయారీ రంగం 12 శాతంతో రెండో స్థానంలో ఉంది. రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో ఐటీ, రియల్ఎస్టేట్, సేవల రంగాలు 24.4శాతంతో కీలక పాత్ర పోషిస్తున్నాయి. 

తలసరిలో రంగారెడ్డి ఫస్ట్​
రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లా రూ.9,54,949 తలసరి ఆదాయంతో టాప్​లో ఉంది.  గత రెండేండ్లలో వార్షిక వృద్ధి రేటు తగ్గింది. 2021–22లో వృద్ధి రేటు 19.19 శాతం ఉంటే, 2022–23లో 16.70 శాతంగా ఉంది.   ఈ ఏడాది జాతీయ వృద్ధి రేటు 10.4 శాతం కాగా.. తెలంగాణ వృద్ధి రేటు 12.6 శాతంగా నమోదైంది. 2023–24లో రాష్ట్రంలో 9,76,073 వెహికల్స్​ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.వివిధ రంగాల్లో ఏడాదికి కోటి 37 లక్షల 19 వేల 879 మందికి 183 రోజుల కంటే ఎక్కువ రోజులు పని లభిస్తున్నట్టు నివేదిక చెప్పింది.

ఇక రాష్ట్రంలో ఎస్సీలు 54 లక్షల 8 వేల 800 ఉన్నట్లు నివేదిక పేర్కొన్నది. ఇందులో జిల్లాలవారీగా  చూస్తే 24.7శాతంతో మంచిర్యాల మొదటిస్థానంలో ఉన్నది. ఆ తర్వాత రెండోస్థానంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా నిలిచింది. రాష్ట్రంలో ఎస్టీల జనాభా 31,77,940 కాగా.. వీరిలో మెజార్టీ శాతం ఆదిలాబాద్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఉన్నారు.

2023–24లో పప్పుధాన్యాల మొత్తం ఉత్పత్తి 3.61 లక్షలు టన్నులు ఉండగా, ఆదిలాబాద్, కామారెడ్డి జిల్లాలు అత్యధికంగా 19.81%, 14.04%తో రాష్ట్ర ఉత్పత్తులకు సమానంగా ఉన్నాయి. ఆహార ధాన్యాల మొత్తం ఉత్పత్తుల్లో ( తృణధాన్యాలు, మిల్లెట్స్)లో 2023-–24లో 207.93 లక్షల టన్నులు ఉండగా, నిజామాబాద్, నల్గొండ జిల్లాల్లో అత్యధికంగా 7.96 శాతం, 6.55 శాతం వృద్ధి ఈ రెండు జిల్లాల్లో నమోదైంది.