
- టెక్నాలజీ వినియోగంలోమనమే టాప్
- టీజీ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు డైరెక్టర్ వివి.శ్రీనివాసరావు వెల్లడి
- జైళ్ల శాఖ సిబ్బందికి అత్యాధునిక ఎలక్ట్రానిక్స్ గ్యాడ్జెట్ల అందజేత
మలక్ పేట, వెలుగు: దేశంలోని జైళ్ల శాఖలో తెలంగాణ రోల్ మోడల్‌గా ఉందని రాష్ట్ర పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు డైరెక్టర్ వివి శ్రీనివాసరావు అన్నారు. జైళ్ల శాఖలో సంస్కరణలు చేపట్టడం, అత్యాధునిక సాంకేతికతను వినియోగించుకోవడంలో తెలంగాణ ముందుందని చెప్పారు. చంచల్‌గూడ జైలు ఆవరణలోని సికా ఆడిటోరియంలో జైళ్ల శాఖ సిబ్బందికి శుక్రవారం అత్యాధునిక ఎలక్ట్రానిక్స్ గ్యాడ్జెట్లను అందజేశారు. ఖైదీల పర్యవేక్షణ, సెక్యూరిటీ కోసం సీసీ కెమెరాలు, డేటా డిజిటలైజేషన్ కోసం కంప్యూటర్లు తదితర పరికరాలను ఇచ్చారు.
కార్యక్రమానికి జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రాతో కలిసి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. జ్యుడిషియల్, జైలు, పోలీసు, ఫోరెన్సిక్ శాఖలు సమన్వయంతో పని చేస్తే నేరాలను అదుపు చేయవచ్చని తెలిపారు. అత్యాధునిక సాంకేతికతతో జైళ్లలో విప్లవాత్మక మార్పులు వచ్చాయన్నారు. జైళ్ల శాఖలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని, అందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని జైళ్లకు గ్యాడ్జెట్లను అందజేస్తున్నట్లు సౌమ్య మిశ్రా తెలిపారు. కార్యక్రమంలో జైళ్ల శాఖ ఐజీలు శ్రీనివాస్, రాజేశ్, డీఐజీ సంపత్, వివిధ జిల్లాల నుంచి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.