తెలంగాణ శాసనసభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినాయి. గత పది సంవత్సరాలలో జరిగిన అనేక నిర్బంధాలు, సహజ వనరుల దోపిడీ, మితిమీరిన అవినీతి, బంధుప్రీతి, ప్రజలను అనేక రకాలుగా వేధింపులకు గురిచేసిందనేది నిర్వివాదమైన అంశం. తిరిగి మూడవసారి కూడా ఇదే ప్రభుత్వం రాకూడదని కృతనిశ్చయంతో లక్షలమంది ప్రజాస్వామ్యవాదులు గత మూడు, నాలుగు నెలల నుంచి రోడ్లకెక్కారు. గత పదేండ్ల నుంచి ప్రజలు ఎదుర్కొన్న అణచివేత, అప్రజాస్వామిక చర్యలు, సహజ వనరుల దోపిడీ, ప్రభుత్వ ఖజానా లూటీ, కొంతమంది ప్రభుత్వ అధికారులలో నెలకొన్న అవినీతిని ముఖ్యంగా పేద ప్రజలు భరించలేకపోయారు.
ప్రజలలో స్పష్టంగా ఆగ్రహావేశాలు కనిపించాయి. రెండవది ఎన్నికలలో మద్యం, డబ్బులతో మరోసారి మోసపోతే పేద ప్రజలకు ఇక దిక్కు లేదని భయం కూడా సాధారణ ఓటర్లను వెంటాడింది. రెండు పర్యాయాలు మోసానికి గురి అయిన ప్రజలు మార్పు కావాలని గత ఆరు నెలల నుంచి అనేక వేదికల ద్వారా మీడియా ద్వారా, అభిప్రాయాన్ని వెలిబుచ్చుతూనే ఉన్నారు.
గత 50 సంవత్సరాల ప్రజాస్వామ్య మనుగడను అనేక శాసనసభ, పార్లమెంటు ఎన్నికలను గమనించిన నాకు.. ఈ మార్పు కావాలని కోరుకునే ప్రజలు తండోపతండాలుగా ఎదురైనారు. గత సంవత్సరం నుంచి తెలంగాణలో అనేకమంది సభలు, సమావేశాలు, చర్చలు నిర్వహించి గత పది సంవత్సరాల పాలనలో జరిగిన విధ్వంసం, దోపిడీ, అవినీతి ప్రజలకు తెలియజేసి మరింత చైతన్యవంతం చేయడం జరిగింది.
ప్రముఖంగా ప్రొఫెసర్ హరగోపాల్, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఆకునూరి మురళి, జస్టిస్ చంద్రకుమార్ లాంటి సీనియర్లు ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి తెలంగాణను రక్షించుకోవాలి. మన సహజ వనరులను కాపాడుకోవాలి. డబ్బుకు, మద్యానికి లోను కాకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని అనేక సభలు నిర్వహించి వివిధ జిల్లాల్లో ఉన్న యువతీ, యువకులకు, నిరుద్యోగులకు, ఉద్యోగులకు పెన్షనర్లకు హితవు పలికినారు.
సమైక్యంగా పోరాడిన కాంగ్రెస్
కాంగ్రెస్ హై కమాండ్ కూడా ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని అభ్యర్థులను ఎంపిక చేశారు. మేనిఫెస్టో తయారు చేయడంలోనూ, ఎన్నికల నిర్వహణ లో తీసుకోవలసిన జాగ్రత్తలు, పూర్వపు రెండు పర్యాయాల కంటే ఎంతో మెరుగైన చర్యలు తీసుకున్నారని ప్రజలు, మేధావులు దాదాపు అంగీకరించారు.నిరుద్యోగులు, విద్యావంతులు, విశ్రాంత ఉద్యోగులు కాంగ్రెస్ గెలవాలని శ్రమించారు.
ప్రజలు కోరుకున్న మార్పు రావాలని ఆకాంక్షించారు. మార్పు కోసం అరమరిక లేకుండా కృషి చేశారు. గురువారం అన్ని ఎగ్జిట్ పోల్స్ దాదాపు కాంగ్రెస్ ముందంజలో ఉందని జోస్యం చెప్పాయి. పాలక పక్ష ఎమ్మెల్యేలు, కుటుంబ పాలనపై ఉన్న విరక్తి, ఆగ్రహం, భయం మొదలగు అంశాలను రంగరించి ప్రజలు మాత్రం ఖచ్చితమైన తీర్పునివ్వబోతున్నారు.
అవసరమైతే మజ్లిస్ ప్రజా ప్రభుత్వానికి మద్దతివ్వాలె
హంగ్ అసెంబ్లీ వస్తుందని కొన్ని రాజకీయ పక్షాలు ఆకాంక్షిస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం చెప్పిన జోస్యం కంటే కాంగ్రెస్‌కు 75 నుంచి 85 సీట్లు రావచ్చని మరో అంచనా కూడా ఉంది. ఒకవేళ ప్రభుత్వం ఏర్పాటుకు ఒకటి రెండు తక్కువ పడ్డప్పటికీ ఎంఐఎం తన గురుతర బాధ్యతను గుర్తించి మళ్లీ దొరల కాపలా కాయడానికి పూనుకోకూడదని కూడా ప్రజలు భావిస్తున్నారు. ఎంఐఎం మాత్రమే దొరవారి వెంట ఉండి మైనారిటీ ప్రజలను దూరం చేసుకుంటే అది క్షమించరాని నేరమే అవుతుంది. ప్రజల తీర్పును అంగీకరించి ఎంఐఎం బేషరతుగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుకవలసిన అవసరం ఏర్పడిందని గుర్తుంచుకోవాలి. హంగ్ రాకపోవచ్చు.
కానీ, ఒకవేళ వస్తే ప్రస్తుత పరిస్థితులలో భారతీయ జనతా పార్టీ తనకు లభించిన సీట్లతో దొరల ప్రభుత్వాన్ని కాపాడడానికి ఒకవేళ పరోక్షంగా, ప్రత్యక్షంగా సహకరిస్తే మరో చారిత్రక తప్పిదమే అవుతుందని ప్రజలు భావిస్తున్నారు. ఇంకా ముఖ్యంగా చంద్రశేఖర రావును ఓడించడానికే నేను ఆ పార్టీ నుంచి బయటికి వచ్చి భారతీయ జనతా పార్టీలో చేరానని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అనేకసార్లు ప్రకటించడం జరిగింది. పరోక్షంగా బీజేపీ బ్రష్టు పట్టిన బీఆర్ఎస్ను బలపరిస్తే రాజేందర్ వ్యక్తిత్వానికి విఘాతం కలుగుతుంది. ఆ పరిస్థితి రాజేందర్‌కు కూడా మింగుడు పడని పరిస్థితి ఎదురవుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు మార్పు కోరుకున్న దశలో ఎంఐఎం కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, ప్రజల మనోభావాలకు విరుద్ధంగా నిర్ణయం తీసుకుంటే అవి మరొక చారిత్రక తప్పు చేసినవవుతాయి.
ప్రజాప్రభుత్వం రావాలె
ప్రజల మనోభావాలను అర్థం చేసుకొని, ప్రజాస్వామ్యాన్ని రక్షించే దిశలో సామాజిక న్యాయాన్ని అందించే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సహకరించవలసిన బాధ్యత అన్ని పార్టీలపైన ఉంది. బీఆర్ఎస్ పాలన వద్దంటూ ప్రజలు తీర్పు ఇచ్చినా, తిరిగి అదే పార్టీకి ఏ పార్టీ అయినా మద్దతు ప్రకటిస్తే అది ప్రజాతీర్పుకు అన్యాయం చేయడమే అవుతుంది. మొత్తం మీద డిసెంబర్ 3 నాడు ప్రజాతీర్పు చాలా స్పష్టంగా ఉండబోతున్నదని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ చెపుతున్నాయి. అయినా కూడా, ప్రస్తుత అధికార పార్టీ రేపు ఫిరాయింపులకు, అరాచక రాజకీయాలకు దిగితే మాత్రం అన్ని పార్టీలూ అడ్డుకోవాలె. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలె, అది ప్రజాప్రభుత్వానికి బాటలు వేయాలనేదే బుద్ధి జీవుల ఆకాంక్ష. మార్పు తీర్పే తెలంగాణకు రక్షగా మారాలని కోరుకుందాం.
ఫిరాయింపులు, అనైక్యతను ప్రజలు క్షమించరు
కాంగ్రెస్‌లో అనేకమంది ముఖ్యమంత్రులు ఉన్నారు, రాష్ట్రాన్ని ఆగం చేస్తారు, మీరు జాగ్రత్త పడండి అని కల్వకుంట్ల చంద్రశేఖరరావు మొన్నటి దాకా చిలుక పలుకులు పలికారు. తెలంగాణ ప్రజలు కూడా ఈ తప్పుడు ప్రచారాన్ని పక్కకు పెట్టారు. అయినప్పటికీ చంద్రశేఖర రావు చెప్పిన విధంగా కాంగ్రెస్ నాయకులు కొట్లాడడం జరగకూడదని ఎన్నికైన ఎమ్మెల్యేలు హై కమాండ్ ఆదేశం మేరకే నడుచుకోవాలని మేధావులు, ఉద్యమకారులు, నిరుద్యోగులు, ప్రజలు, రైతులు కోరుకుంటున్నారు.
ఈసారి ఎవరైనా పార్టీలు ఫిరాయించే ఆలోచన ఉంటే కూడా ప్రజలు క్షమించరని, నేరంగా పరిగణిస్తారని వేరే చెప్పనవసరం లేదు. తెలంగాణ ఇచ్చిన పార్టీకి ఓటు వేద్దామని రెండుసార్లు అవకాశమిస్తే మోసగించబడ్డామని, ఆకాంక్షలు నెరవేరలేదని మార్పు వైపు ప్రజలు మొగ్గు చూపారు. ప్రజల ఆలోచనలకు భిన్నంగా ఎన్నికైన నాయకులు ప్రవర్తిస్తే కూడా ప్రజలు ఉపేక్షించరనే విషయం గమనించాలి.
కూరపాటి వెంకట్ నారాయణ, రిటైర్డ్ ప్రొఫెసర్