
- ఎస్సీ వర్గీకరణకు చట్ట బద్ధత
- భవిష్యత్తులో సమస్యలు రాకుండా జీవోలు తెస్తం
- తెలంగాణ సోషల్ జస్టిస్ డేగా ఫిబ్రవరి 4
- అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన
- ఎస్సీల్లో 59 ఉప కులాలను ఏకసభ్య కమిషన్ గుర్తించింది
- వీళ్లను మూడు గ్రూపులు చేసి.. 15% రిజర్వేషన్లను పంచింది
- గ్రూప్ 1లోని కులాలకు ఒక్క శాతం, గ్రూప్ 2లోని వాటికి 9%, గ్రూప్ 3లోని కులాలకు 5% రిజర్వేషన్లు కేటాయించిందని వెల్లడి
- క్రీమీలేయర్ విధానాన్ని కమిషన్ సిఫార్సు చేసినా కేబినెట్ఆమోదించలేదన్న ముఖ్యమంత్రి
హైదరాబాద్, వెలుగు: ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పిస్తామని సీఎం రేవంత్ తెలిపారు. ఇందుకోసం త్వరలోనే జీవోలు తీసుకొస్తామని వెల్లడించారు. భవిష్యత్తులో సమస్యలు, ఇబ్బందులు రాకుండా శాశ్వత పరిష్కారం చూపుతా మన్నారు. మంగళవారం అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణపై జరిగిన చర్చలో సీఎం మాట్లాడారు. ‘‘ఎస్సీ వర్గీకరణ పోరాటంలో అసువులుబాసిన వారికి నివాళి అర్పిస్తున్నాను. వారి ఆశయాలను ప్రజా ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తున్నది.
ఆ కుటుంబాల త్యాగం వృథా కాదు. వారి మరణం వృథా కాకుండా.. వారు ఏ విధానం కోసం కొట్లాడారో, ఆ విధానాన్ని అమలు చేస్తున్నాం. రాష్ట్ర పెద్దగా, సీఎంగా వారి కుటుంబాలకు అండగా ఉంటాను. ఇక ఎస్సీ వర్గీకరణ కోసం ఎవరూ ప్రాణత్యాగం చేయాల్సిన అవసరం లేదు. కులగణన, ఎస్సీ వర్గీకరణ ఇతర రాష్ట్రాల్లోనూ అమలు చేసేందుకు సహకారం అందిస్తాం” అని సీఎం తెలిపారు.
జఠిలమైన సమస్యకు పరిష్కారం..
బడుగు బలహీన వర్గాలు, మైనార్టీలు, మాల, మాదిగలు తమకు రిజర్వేషన్లలో న్యాయంగా దక్కాల్సిన వాటా కోసం కొన్ని దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నారని సీఎం రేవంత్ తెలిపారు.అందుకే తాము అధికారంలోకి రాగానే ఈ సమస్యలకు పరిష్కారం చూపాలనే పట్టుదలతో కులగణన, ఎస్సీ వర్గీకరణకు నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ‘‘ఫిబ్రవరి 4కు తెలంగాణలో అత్యంత ప్రాధాన్యం ఉంది. 2024 ఫిబ్రవరి 4న ఎస్సీ వర్గీకరణ చేయాలని కేబినెట్లో నిర్ణయం తీసుకున్నాం. సరిగ్గా ఏడాది తిరిగేసరికి అదే ఫిబ్రవరి 4, 2025లో ఎస్సీ వర్గీకరణ నివేదికను కేబినెట్ ఆమోదించింది. అందుకే ఫిబ్రవరి 4ను తెలంగాణ సోషల్ జస్టిస్ డేగా జరుపుకుందాం’’ అని పేర్కొన్నారు.
‘‘ఇంత గొప్పకార్యక్రమాన్ని ఆచరణలో పెట్టేందుకు మంత్రివర్గ సహచరులు, ఉపసంఘం, ఉన్నతాధికారులు ఎంతో శ్రమించారు. కట్టుదిట్టమైన ప్రణాళికతో ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించే కార్యక్రమం తీసుకొచ్చినందుకు అభినందనలు. కులగణన, ఎస్సీ వర్గీకరణ విషయంలో ప్రభుత్వానికి మద్దతు తెలిపిన సభ్యులకు ప్రభుత్వం తరఫున, ఆయా సామాజిక వర్గాల తరఫున కృతజ్ఞతలు. సభ్యులందరూ విజ్ఞత ప్రదర్శించి ఒక జఠిలమైన సమస్యకు పరిష్కారం చూపించారు” అని కొనియాడారు.
నా రాజకీయ జీవితంలో సంతృప్తిని ఇచ్చిన రోజు ఇదే..
తన రాజకీయ జీవితంలో ఇదే సంతృప్తినిచ్చిన రోజు అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ‘‘మూడు దశాబ్దాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం జరుగుతున్నది. ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తున్నందుకు నాకు సంతృప్తిగా ఉంది. ఎంతోమంది ముఖ్యమంత్రులకు రాని అవకాశం నాకు వచ్చింది. సుప్రీంకోర్టు తీర్పు మేరకు వర్గీకరణకు శాశ్వత పరిష్కారం తీసుకురావాలని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నేను 20 ఏండ్లుగా రాజకీయాల్లో ఉన్నా.. నా రాజకీయ జీవితంలో ఆత్మ సంతృప్తిని కలిగించిన రోజు ఇదే. నా రాజకీయ జీవితంలో నాకోసం ఒక పేజీ రాసుకోవాల్సి వస్తే.. ఫిబ్రవరి 4ను పొందుపరుస్తా. చరిత్రపుటల్లో ఇది శాశ్వతంగా నిలిచిపోతుంది.
అతి తక్కువ సమయంలో సంక్లిష్టమైన సమస్యకు పరిష్కారం చూపేందుకు కృషి చేసిన అందరికీ అభినందనలు. ఆనాడు ఎస్సీ వర్గీకరణ కోసం సండ్ర వెంకటవీరయ్య, సంపత్ కుమార్‌తో కలిసి నేను వాయిదా తీర్మానం అందిస్తే.. నన్ను సభ నుంచి బయటకు పంపించారు. కానీ ఇప్పుడు సభా నాయకుడిగా ఎస్సీ వర్గీకరణ అమలు కోసం సభలో నిర్ణయం తీసుకుంటున్నా. ఇది అంబేద్కర్ అందించిన రాజ్యాంగం వల్లే సాధ్యమైంది. చివరి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందించాలన్న అంబేద్కర్ ఆశయానికి అనుగుణంగా మా ప్రభుత్వం పనిచేస్తున్నది” అని సీఎం అన్నారు.
జాగ్రత్తగా ముందుకు వెళ్లేందుకే కమిటీ..
ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అధ్యయనం చేయడం, తీర్పుతో ముడిపడి ఉన్న అంశాలను జాగ్రత్తగా పరిశీలించి ముందుకు వెళ్లే మార్గాలను సూచించడంతో పాటు అవసరమైన సిఫార్సులు చేయడానికే కమిటీ వేశామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ‘‘2024 సెప్టెంబర్ 12న మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీలో మంత్రులు దామోదరరాజనర్సింహ, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, మల్లు రవి ఉన్నారు.
ఎస్సీ వర్గీకరణపై అధ్యయనం చేయడానికి ఈ కమిటీని పంజాబ్, హర్యానా, తమిళనాడుకు పంపించాం. అడ్వొకేట్జనరల్, న్యాయ శాఖ కార్యదర్శి నుంచి సలహాలు స్వీకరించి విస్తృత సమావేశాల తర్వాత ఏకసభ్య కమిషన్వేయాలని కమిటీ సిఫార్సు చేసింది. దీంతో 2024 అక్టోబర్11న ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేశాం” అని సీఎం వివరించారు.
మూడు గ్రూపులుగా ఎస్సీల వర్గీకరణ..
ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ చేసిన సిఫార్సులను అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ‘‘ఎస్సీల్లో మెుత్తం 59 ఉప కులాలను ఏకసభ్య కమిషన్ గుర్తించింది. వారిని మూడు గ్రూపులుగా వర్గీకరించాలని సిఫార్సు చేసింది. గ్రూప్‌వన్‌లో సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా అత్యంత వెనుకబడిన 15 ఉప కులాలు ఉన్నాయి. వీళ్ల జనాభా 3.288 శాతం. వీళ్లకు ఒక్క శాతం రిజర్వేషన్ ఇవ్వాలని కమిషన్ సిఫార్సు చేసింది. గ్రూప్2లో మధ్యస్థంగా లబ్ధి పొందిన18 ఉప కులాలను చేర్చింది. వీరు 62.74 శాతంగా ఉన్నారు. వీరికి 9 శాతం రిజర్వేషన్సూచించింది.
ఇక గ్రూప్3లో మెరుగైన ప్రయోజనం పొందిన 26 ఉప కులాలను చేర్చింది. వీరు 33.96 శాతం ఉన్నారు. వీరికి 5 శాతం రిజర్వేషన్ సిఫార్సు చేసింది. ఇలా మొత్తం15 శాతం రిజర్వేషన్లను మూడు గ్రూపులకు కమిషన్ పంచింది. ఏదైనా పరిస్థితుల్లో గ్రూప్-1లోని క్యాండిడేట్లు లేక భర్తీ చేయలేని ఉద్యోగాలను, గ్రూప్2 లోంచి, అక్కడా లేకపోతే గ్రూప్3 లోంచి భర్తీ చేయాలని.. మూడు గ్రూపుల్లోనూ అర్హత కలిగినవారు లేకపోతే మాత్రమే క్యారీ ఫార్వార్డ్చేయాలని కమిషన్సిఫార్సు చేసింది. ఏకసభ్య కమిషన్నాలుగు సిఫార్సులు చేస్తే మూడు సిఫార్సులను కేబినెట్ఆమోదించింది. నాలుగో సిఫారసు అయిన క్రీమీలేయర్విధానాన్ని మంత్రివర్గ ఉపసంఘం సూచన మేరకు కేబినెట్ఉపసంహరించింది” అని వివరించారు.