మంత్రి జగదీష్ రెడ్డితో ఎలాంటి విబేధాల్లేవు : గుత్తా సుఖేందర్ రెడ్డి

ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన మంత్రి జగదీష్ రెడ్డికి, తనకు ఎటువంటి భేదాభిప్రాయాలు లేవన్నారు తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. జిల్లా అధికారిక కార్యక్రమాల్లో తాను ఎన్నడూ జోక్యం చేసుకోనన్నారు. ఎవరైనా తన వద్దకు వచ్చినా.. నిబంధనల ప్రకారమే వెళ్లాలని చెబుతానన్నారు. అధికారికంగా, రాజకీయంగా ఏం జరిగినా సీఎం కేసీఆర్ దృష్టిలో ఉంటుందని చెప్పారు. తన కుమారుడు అమిత్ కు టికెట్ ఇచ్చే విషయంలో బీఆర్ఎస్ పార్టీదే తుది నిర్ణయమన్నారు. అధిష్టానం అవకాశం ఇస్తేనే అమిత్ పోటీ చేస్తారని చెప్పారు. టికెట్ కోసం పైరవీలు, పాకులాడాడం చేయమన్నారు. నల్గొండ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ కామెంట్స్ చేశారు గుత్తా సుఖేందర్ రెడ్డి.

రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమన్నారు గుత్తా సుఖేందర్ రెడ్డి. కొంతమంది విజ్ఞత లేకుండా మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. నోటికి అడ్డూ అదుపు లేకుండా కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను భాషా ప్రయోగం విషయంలో హుందాగా మాట్లాడుతానని, బురదలో రాయి వేసే అలవాటు తనకు లేదన్నారు. సొంత పార్టీలో అవిశ్వాసాలు మంచి సంప్రదాయం కాదని చెప్పారు. 

వామపక్షాలతో బీఆర్ఎస్ పొత్తులు ఖరారు అయ్యాకే ఉమ్మడి నల్గొండ జిల్లాలో అభ్యర్థుల మార్పుపై క్లారిటీ వస్తుందని చెప్పారు గుత్తా సుఖేందర్ రెడ్డి. బీఆర్ఎస్ తో వామపక్షాలు పొత్తుకు సుముఖంగా ఉన్నాయన్నారు. కృష్ణా జలాల పంపిణీ విషయంలో కేంద్ర ప్రభుత్వం తాత్సారం చేస్తోందన్నారు. ఎక్కడ పని చేసినా రాజకీయ నాయకులకు, ప్రజా ప్రతినిధులకు ఆత్మవిమర్శ అనేది ఉండాలన్నారు. ‘‘నేను చేసేదే కరెక్ట్.. నాకు ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు’’ అనుకుంటే బొక్క బోర్లా పడటం ఖాయమని వ్యాఖ్యానించారు. తాము చేసే పనులను జనం మెచ్చుతున్నారా..? ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు..? అనేది ప్రజాప్రతినిధులు ఆలోచించుకోవాలని సూచించారు.