71 ఏళ్ల కిందట్నే సర్వే!: హైదరాబాదీనా కాదా?

నేషనల్​ రిజిస్టర్​ ఆఫ్​ సిటిజన్స్ (ఎన్​ఆర్​సీ) తరహా సర్వేని హైదరాబాద్​లో కూడా చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్​రెడ్డి, గోషామహల్​ ఎమ్మెల్యే రాజాసింగ్ తదితర బీజేపీ లీడర్లు అప్పుడప్పుడు అంటున్నారు. అయితే ఇలాంటి ఓ ప్రక్రియను భాగ్య నగరంలో 71 ఏళ్ల క్రితమే చేపట్టినట్లు హిస్టారియన్లు గుర్తు చేస్తున్నారు. హైదరాబాద్​ సంస్థానాన్ని ఇండియన్​ యూనియన్​లో కలిపేసిన కొన్నాళ్లకే ఇది జరిగిందని చెబుతున్నారు.

తెలంగాణ విమోచన దినం (సెప్టెంబర్​ 17) నేపథ్యంలో ఆ వివరాలు..

బంగ్లాదేశ్ నుంచి ఇండియాకి దొంగదారిలో వచ్చి అస్సాంలో సెటిలైనవాళ్లను గుర్తించి, వెనక్కి పంపటానికి కేంద్రం నేషనల్​ రిజిస్టర్​ ఆఫ్​ సిటిజన్స్ ​(ఎన్ఆర్‌‌సీ)ని ఈమధ్యే పూర్తి చేసింది. ఇలాంటి నమోదు ప్రక్రియను తెలంగాణ రాజధాని హైదరాబాద్​లోనూ నిర్వహించాల్సిన అవసరముందని బీజేపీ రాష్ట్ర నేతలు కొందరు తరచూ అభిప్రాయపడుతున్నారు. డాక్యుమెంట్లు, పర్మిషన్​ లేకుండా సిటీలో ఉంటున్న విదేశీయులను గుర్తించి  వెళ్లగొట్టాలని సెంట్రల్​ గవర్నమెంట్​ను కోరతామంటున్నారు.

అయితే భాగ్య నగరంలో ఇలాంటి ప్రయత్నం ఇప్పుడే కాదు, ఎప్పుడో 71 ఏళ్ల కిందటే జరిగినట్లు రికార్డులు చెబుతున్నాయి. హైదరాబాద్​ సంస్థానాన్ని ఇండియాలో కలిపిన కొద్ది రోజులకే దీన్ని చేపట్టారు. ఇండియాకి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వస్తే, హైదరాబాద్​కి​ ఏడాది లేటుగా 1948 సెప్టెంబర్​ 17న వచ్చింది. హైదరాబాద్ ఇటు ఇండియాలో గానీ, అటు పాకిస్థాన్​లో గానీ కలవకుండా స్వతంత్రంగా ఉంటుందని నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఏకపక్షంగా ప్రకటించాడు. కానీ, ప్రజలు ఇండియాలోనే ఉంటామని తేల్చిచెప్పారు.

అప్పట్లో సంస్థానంలోని తెలంగాణ ప్రాంతంలో నిజాం నిరంకుశ పాలన సాగేది. దీనిపై చర్య తీసుకోక తప్పదని నాటి కేంద్ర హోం శాఖ మంత్రి సర్దార్ వల్లభాయి పటేల్ నిర్ణయించారు. నిజాం సహకరించకపోవటంతో 1948 సెప్టెంబర్​ 13న ఆర్మీ ‘ఆపరేషన్ పోలో’ పేరిట హైదరాబాద్​ను ముట్టడించింది.  దీన్నే ‘పోలీస్ యాక్షన్’ అని కూడా అంటారు. నాలుగు రోజులకి నిజాం నవాబు లొంగిపోవటంతో సంస్థానానికి ఫ్రీడం వచ్చింది. హైదరాబాద్​ రాష్ట్రం ఏర్పడింది. అందుకే సెప్టెంబరు 17న ‘తెలంగాణ విమోచన దినోత్సవం’గా జరుపుకోవడం ఆనవాయితీ అయింది.

ఈ ఆలోచన ఇప్పటిది కాదు

ఈ నేపథ్యంలో 71 ఏళ్ల క్రితం చేపట్టిన ఎన్​ఆర్​సీ లాంటి ఒక డ్రైవ్​ గురించి తెలుసుకోవాలి. ఆ రోజుల్లో సిటీలో వేల సంఖ్యలో విదేశీయులు అనుమతి లేకుండా నివసించేవారు. తరతరాలుగా జరుగుతున్న ఈ తతంగానికి తెర దించాలని హైదరాబాద్​ స్టేట్​ ప్రభుత్వం తీర్మానించింది. వాళ్లందరినీ ఐడెంటిఫై చేసి, సొంత దేశాలకు తరలించటానికి రంగం సిద్ధం చేసింది. ఈలోగా సరైన పత్రాలు లేనివారిని కొన్ని రోజులు డిటెన్షన్​ క్యాంపుల్లో ఉంచింది.

చివరికి చాలా కొద్దిమందిని మాత్రమే వాళ్ల వాళ్ల సొంత దేశాలకు పంపించగలిగింది. దీనికి సౌదీ అరేబియా ఒప్పుకోలేదు. ఆయా వ్యక్తులు తమ సిటిజన్లు కాదని, వాళ్లను దేశంలోకి రానిచ్చేది లేదని అడ్డం తిరిగింది. అయితే ఆ రోజుల్లో ఎన్​ఆర్​సీ అనే పదాన్ని వాడలేదు. అప్పట్లో పౌరసత్వం అనే కాన్సెప్ట్​ లేదు. సిటిజన్​షిప్​ యాక్ట్​ 1955లో గానీ అమల్లోకి రాలేదు. ఎన్​ఆర్​సీ అనే ప్రస్తావన లేకపోయినా ఇల్లీగల్​ ఇండియన్స్​ వడపోత మొత్తం దాదాపుగా ఆ పద్ధతిలోనే సాగింది.

సిటిజన్​షిప్​ను నిరూపించుకునే పత్రాలు లేనివారిని అరెస్ట్​ చేయటం; ఆడవాళ్లను, పిల్లల్ని వేర్వేరుగా ఆర్మ్​డ్​ గార్డుల పహారాలోని క్యాంపుల్లో ఉంచటం వంటివన్నీ ఇప్పట్లాగే జరిగేవి. ఆ రోజుల్లో ఇంటర్నేషనల్​ లా ప్రకారం నేషనాలిటికి సంబంధించి మహిళలకు, చిన్నారులకు ప్రత్యేక హక్కులు లేవు. ఒకవేళ తండ్రులను, భర్తలను నాన్​–ఇండియన్స్​​గా ప్రకటిస్తే.. పిల్లలు, భార్యలనుకూడా, హైదరాబాద్​లోనే వాళ్లు పుట్టి పెరిగినాగానీ, వేరే దేశస్తులుగానే ముద్ర వేసేవాళ్లు.

పోలీస్​ యాక్షన్​ కన్నా ముందే..

పోలీస్​ యాక్షన్​ కన్నా దశాబ్దాల ముందే హైదరాబాద్​కి వచ్చి స్థిరపడ్డ అరబ్​లను, అఫ్ఘాన్​లను కూడా పరాయి దేశ ప్రజలుగానే పరిగణనలోకి తీసుకున్నారు. ఇలా 6,225 మంది లెక్క తేల్చి డిటెన్షన్​ క్యాంపుల్లోకి నెట్టారు. పైగా వాళ్లపై ‘పాకిస్థానీయులు’ అనే స్టాంప్​ వేశారు. వాస్తవానికి వాళ్లలో చాలా మంది బ్రిటిష్​ ఇండియాలోనే పుట్టి పెరిగినట్లు తర్వాత గుర్తించారు. హైదరాబాద్​ను ఇండియాలో కలిపాక, పాలనా పగ్గాలను​ మిలటరీ–అడ్మినిస్ట్రేటర్​ జేఎన్​ చౌధురీకి అప్పగించారు. ఆయన సలహాలు, సూచనల మేరకే ఈ పనులన్నీ జరిగేవి.

హైదరాబాద్​ను​ ఇండియాలో విలీనం చేశాక నిజాం సంస్థానంలోని ప్రజలు ఆటోమేటిగ్గా ఇండియన్​ సిటిజన్లుగా మారలేదు. సిటిజన్​షిప్​ యాక్ట్​–1955 వచ్చాకే సంస్థానంలోని ప్రజలు లీగల్​గా ఇండియన్​ సిటిజన్లుగా గుర్తింపు పొందారు. పోలీస్​ యాక్షన్​కి, సిటిజన్​షిప్​ యాక్ట్​ అమల్లోకి రావటానికి మధ్య ఏడేళ్ల గ్యాప్​ ఉంది. ఈ కాలంలో ఎవరు ఇండియన్లో, ఎవరు ఫారినర్లో అఫీషియల్​గా చెప్పటం కష్టంగా ఉండేది. ఈ పరిస్థితుల్లో ఫలానావాళ్లు విదేశీయులనటం కరెక్ట్​ అనిపించలేదు. ఇక, డిటెన్షన్​ క్యాంపుల్లో ఉంచినవాళ్లలో సౌదీ అరేబియా, ఏడెన్ (ఒక్కప్పటి యెమెన్ కేపిటల్​​)​, అఫ్ఘానిస్థాన్​లతోపాటు పాకిస్థాన్​, ఇండోనేషియా జనాలు కూడా ఉన్నట్లు తేల్చారు. వాళ్లను వెనక్కి పంపే విషయంలో ఆయా దేశాల ప్రభుత్వాలను సంప్రదించలేదు.  దీనివల్ల సంబంధిత దేశాల్లో నివసిస్తున్న ఇండియన్లకు ఇబ్బంది ఎదురవుతుందన్న ఆందోళన నెలకొంది. ఫలితంగా సౌదీ అరేబియాతో మూడేళ్లపాటు చర్చలు జరపాల్సి వచ్చింది. ఇంత చేసీ చివరికి పాతిక మందినైనా సౌదీకి పంపలేకపోయారు. వాళ్లు, వాళ్ల పిల్లలు ఇప్పటికీ ఇక్కడే ఉంటున్నారు. ఆ 23 మంది హైదరాబాద్​లో ఉండటం వల్ల వచ్చే నష్టమేమీ లేదంటూ నాటి ప్రభుత్వం సమర్థించుకుంది. దీన్నిబట్టి 71 ఏళ్ల కిందట చేపట్టిన ఎన్​ఆర్​సీలాంటి ప్రాజెక్టు ఫెయిలైందని హిస్టారియన్లు అంటారు. ఎన్​ఆర్​సీని దేశం మొత్తం విస్తరిస్తే బాగుంటుందేమో గానీ… కేవలం అస్సాంకో, హైదరాబాద్​కో పరిమితం చేయటం సరి కాదని సూచిస్తున్నారు.

ఇది ఎలా వెలుగులోకొచ్చింది?

హైదరాబాద్​లో 71 ఏళ్ల క్రితమే ఎన్​ఆర్​సీ మాదిరిగా సెర్చింగ్​ జరిగిన విషయాన్ని డాక్టర్​ టేలర్​ సీ షెర్మన్​ అనే రీసెర్చర్​ తన స్టడీలో గుర్తించారు. బ్రిటన్​లోని నేషనల్​ ఆర్కైవ్స్​లో ఉన్న హైదరాబాద్​ డాక్యుమెంట్లను ఆమె చదివి ఈ సంగతులు చెప్పారు. హైదరాబాద్​లోని నాటి మిలటరీ అడ్మినిస్ట్రేటర్​కి, ఇండియన్​ గవర్నమెంట్​కి మధ్య 1948–1950 మధ్య కాలంలో జరిగిన కమ్యూనికేషన్​ని కూడా రిఫర్​ చేశారు. డాక్టర్​ షెర్మన్​​ ప్రస్తుతం ‘లండన్​ స్కూల్​ ఆఫ్​ ఎకనామిక్స్​ అండ్​ పొలిటికల్​ సైన్స్’​లో ఇంటర్నేషనల్​ హిస్టరీ డిపార్ట్​మెంట్​ ప్రొఫెసర్​గా పనిచేస్తున్నారు.

‘సిటిజన్​షిప్​ ఇన్​ హైదరాబాద్​–పోస్ట్​ పోలీస్​ యాక్షన్​’ అంశంపై షెర్మన్ చేసిన రీసెర్చ్​ పేపర్లు కేంబ్రిడ్జ్​ యూనివర్సిటీ ప్రెస్​ నుంచి వచ్చే ‘మోడ్రన్​ ఏసియన్​ స్టడీస్’ జర్నల్​లో పబ్లిష్​ అయ్యాయి. నాన్​–ఇండియన్స్​ని వాళ్ల దేశాలకు పంపించటానికి చేసిన ప్రయత్నాలు ఆ రోజుల్లో పొలిటికల్​గా​, లీగల్​గా గందరగోళ పరిస్థితులకు కారణమయ్యాయని డాక్టర్​ టేలర్​ సీ షెర్మన్​ అన్నారు. సుమారు 21,‌‌000 మంది దిక్కుమొక్కులేనివాళ్లుగా మిగిలారని, వాళ్ల బాధలు వర్ణనాతీతమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.