తెలంగాణలో వారం రోజులు వానలు!

 తెలంగాణలో  వారం రోజులు వానలు!
  • అల్పపీడన ప్రభావంతో  భారీ వర్షాలు కురిసే చాన్స్
  • రాష్ట్రానికి నాలుగు రోజులు ఎల్లో అలర్ట్
  • 50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వర్షాలు మళ్లీ జోరందుకున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పొద్దంతా ఎండ కొడుతున్నా సాయంత్రం కాగానే జోరు వాన కురుస్తున్నది. కొన్నిసార్లు ఆ వర్షం కొన్ని ప్రాంతాలకే పరిమితమైపోతున్నది. ప్రస్తుతం ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో రాష్ట్రానికి ఎల్లో అలర్ట్​కొనసాగుతున్నా.. సోమవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, దానివల్ల భారీ వర్షాలు పడొచ్చని అంటున్నారు. వాతావరణ శాఖ ప్రస్తుతానికి నాలుగు రోజులకే అలర్ట్​జారీ చేసినా.. వారం రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని చెబుతున్నారు. కాగా, వాతావరణ శాఖ రాష్ట్రానికి నాలుగు రోజుల పాటు ఎల్లో అలర్ట్ ​జారీ చేసింది. మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. పలు జిల్లాల్లో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ప్రస్తుతం రెండు ఆవర్తనాలు బంగాళాఖాతంలో కొనసాగుతున్నాయని, ఆ రెండింటి ప్రభావంతో సోమవారం అల్పపీడనం ఏర్పడుతుందని వెల్లడించింది. 

ఇదీ అలర్ట్...

సోమవారానికి గాను ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్​భూపాలపల్లి, ములుగు, రంగారెడ్డి, మహబూబ్​నగర్, నాగర్​కర్నూల్, వనపర్తి, నారాయణపేట జిల్లాలకు ఎల్లో అలర్ట్​ను వాతావరణ శాఖ జారీ చేసింది. మంగళవారం ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, జనగామ, సిద్దిపేట, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్​నగర్, నాగర్​కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలకు.. బుధవారం ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. ఇక గురువారం రాష్ట్రమంతటా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.  

పలు జిల్లాల్లో మోస్తరు వర్షం.. 

రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఆదివారం మోస్తరు వర్షం కురిసింది. నాగర్​కర్నూల్, రంగారెడ్డి, జయశంకర్​భూపాలపల్లి, ములుగు, వనపర్తి, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హనుమకొండ, మేడ్చల్​మల్కాజిగిరి, కరీంనగర్, సంగారెడ్డి జిల్లాల్లో పలు చోట్ల మోస్తరు వానలు పడ్డాయి. ములుగు జిల్లా మేడారంలో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వరంగల్​జిల్లా దుగ్గొండిలో 3.9  సెంటీమీటర్ల వర్షం కురిసింది.