సరిహద్దు ప్రాంతాల నుంచి అక్రమంగా తరలింపు
బోర్డర్ వైన్స్ ఓనర్లతో ఏపీ బెల్ట్ షాపుల కుమ్మక్కు
చెక్ పోస్ట్‌లున్నా పట్టించుకోని ఆఫీసర్లు
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ లిక్కర్ ఏపీకి అక్రమంగా తరలిపోతోంది. ఏపీలో దశలవారీ లిక్కర్ బ్యాన్ అమలవుతున్నందున ఇక్కడి నుంచి యథేచ్ఛగా రవాణా చేస్తున్నారు. ఎక్సైజ్ శాఖకు ప్రత్యేకంగా చెక్ పోస్టులు ఉన్నా అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఏపీలో నియంత్రణ..
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్త ఎక్సైజ్ పాలసీ తీసుకొచ్చింది. ప్రభుత్వమే మద్యం షాప్స్ నడిపిస్తోంది. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకే మద్యం అమ్ముతున్నారు. గరిష్ట అమ్మకాలపై పరిమితి విధించారు. దీంతో మందుబాబులకు ఇబ్బందులు తప్పలేదు. కానీ బెల్ట్ షాపుల నిర్వాహకులకు ఫుల్ గిరాకీ ఉంటోంది. బ్లాక్‌లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. అయితే ఈ మద్యం మొత్తం తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి ఏపీకి అక్రమంగా తరలించిందేనని ఇటీవల తనిఖీల్లో బయటపడుతోంది. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న షాపులతో కుమ్మక్కై ఆంధ్రప్రదేశ్‌లో యథేచ్ఛగా తెలంగాణ లిక్కర్‌ను అమ్ముతున్నారు.
రాష్ట్రంలోని కొన్ని ఏపీ సరిహద్దు జిల్లాల వైన్స్‌లకు ఫుల్ గిరాకీ ఉంటోంది. నల్లగొండ, సూర్యాపేట, గద్వాల, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో అమ్మకాలు పెరిగాయి. ఆయా దుకాణాల్లో గతంలో రోజుకు లక్ష వరకు విక్రయాలు జరగ్గా, ప్రస్తుతం 5 లక్షల నుంచి 10 లక్షల దాకా పెరగడం గమనార్హం. సూర్యాపేట జిల్లాలోని హుజూర్‌నగర్, మట్టపల్లి, దామచర్ల, వాడపల్లి, అడవిదేవులపల్లి దుకాణాల నుంచి మద్యాన్ని అక్రమంగా ఏపీకి తరలిస్తున్నారు. దామరచర్ల మండల కేంద్రంలో నెలకు కోటి రూపాయలకు మించి మద్యం వ్యాపారం సాగుతున్నట్లు తెలిసింది. అంతేకాకుండా ఖమ్మం జిల్లాలోని ఎర్రుపాలెం, మీనవోలు, దెందుకూరు, మడుపల్లి, పెనుబల్లి, సూర్యాపేట జిల్లా రామాపురం క్రాస్‌రోడ్డు, హుజూర్‌నగర్, గద్వాల జిల్లాలోని అలంపూర్, నాగర్‌కర్నూలు జిల్లాలోని కొల్లాపూర్, దోమలపెంట, పెంట్లవెల్లిలలోని వైన్స్‌ల నుంచి మద్యం సరఫరా అవుతోంది.
చెక్ పోస్టులున్నా..
రాష్ట్రంలో మద్యం అక్రమ తరలింపు అడ్డుకట్ట కోసం ప్రత్యేకంగా ఎక్సైజ్ చెక్‌పోస్టులు ఉన్నాయి. దాదాపు అన్ని రాష్ట్రాల సరిహద్దులకు చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. మద్యం తరలించాలంటే ఈ చెక్‌పోస్ట్‌లను దాటుకుని వెళ్లాలి. అయితే ఎక్సైజ్ అధికారులు కూడా పట్టించుకోపోవడం, చూసిచూడనట్లు వదిలేయడంతో రాత్రికి రాత్రే వాహనాల్లో అక్రమ మద్యాన్ని బెల్ట్ షాపులకు విచ్చలవిడిగా సరఫరా చేస్తున్నారు. కొన్ని చోట్ల అధికారులు కుమ్మక్కై మద్యాన్ని ఏపీకి చేరుస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. తెలంగాణ ఎక్సైజ్ శాఖ తీరు ఇలా ఉండగా, ఏపీలో ఎక్కడికక్కడ తనిఖీల్లో తెలంగాణ మద్యం పట్టుబడుతోంది.
For More News..