![జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో మార్పులు](https://static.v6velugu.com/uploads/2025/02/telangana-local-body-elections-machinery-in-place-voter-lists-released_vRNKiS8AE0.jpg)
- ప్రాదేశిక ఎన్నికలకు యంత్రాంగం రెడీ
మెదక్/సిద్దిపేట/సంగారెడ్డి, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికలకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ప్రతి మండలంలో కనీసం ఐదు ఎంపీటీసీ స్థానాలు ఉండాలని నిర్ణయించడం, కొన్ని గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీల్లో విలీనం కావడం వల్ల కొన్ని చోట్ల ఎంపీటీసీ స్థానాల్లో మార్పులు చేర్పులు జరిగాయి. కొత్త మండలాలు ఏర్పాటు కావడం తో జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలు కూడా పెరిగాయి.
పెండింగ్ జీపీల ఓటర్ లిస్ట్‌ల విడుదల
సిద్దిపేట జిల్లాలో జిల్లా, మండల ప్రాదేశిక నియోజకవర్గాల ముసాయిదా జాబితాను అధికారులు విడుదల చేశారు. జిల్లాలో మొత్తం 26 జడ్పీటీసీ, 230 ఎంపీటీసీ స్థానాలున్నాయి. 2019 లో 23 జడ్పీటీసీ స్థానాలుండగా కొత్తగా మద్దూరు, అక్బర్పేట, భూంపల్లి, కుకునూరుపల్లి మండలాలు ఏర్పాటు కావడంతో వాటి సంఖ్య 26కు పెరిగింది. 2019లో 229 ఎంపీటీసీ స్థానాలుండగా మల్లన్న సాగర్ ముంపు గ్రామాలైన ఏటిగడ్డ కిష్టాపూర్, వేముల ఘాట్ రెండు ఎంపీటీసీ స్థానాలను తొలగించారు.
కొత్తగా మిరుదొడ్డి మండలం మోతే, దుబ్బాక మండలం కమ్మర్ పల్లి, చేర్యాల మండలం అర్జునపట్ల - ఎంపీటీసీ స్థానాలుగా ఏర్పడ్డాయి. దీంతో ఎంపీటీసీ స్థానాల సంఖ్య 230కి చేరింది. ప్రతి మండలంలో కనీసం ఐదు ఎంపీటీసీ స్థానాలుండాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పునర్విభజన ప్రక్రియ పూర్తి చేశారు. చిన్నకోడూరు మండలంలో అత్యధికంగా 14 ఎంపీటీసీ స్థానాలున్నాయి. కోహెడలో 13, అక్కన్నపేటలో 12, చేర్యాల, వర్గల్, గజ్వేల్, నంగునూరు మండలాల్లో 11 చొప్పున ఎంపీటీసీ స్థానాలుండగా దుల్మిట, కుకునూరుపల్లి, నారాయణరావుపేట మండలాల్లో ఐదేసి ఎంపీటీసీ స్థానాలున్నాయి.
సిద్దిపేట జిల్లాలో మొత్తం 9,77,924 మంది ఓటర్లుండగా, ఇందులో పురుషులు 4,78,452, మహిళలు 4,99,390, థర్డ్ జండర్ 82 మంది. అర్జునపట్ల, కమలాయపల్లి ఎంపీటీసీ స్థానాలను మద్దూరు మండలంలో కలపడాన్ని ఆ గ్రామాల ప్రజలు వ్యతిరేకిస్తున్నారు.
గత ఏడాది సెప్టెంబర్‌లో విడుదల చేసిన జీపీల జాబితాల్లో సాంకేతిక కారణాలతో పెండింగ్ లో పెట్టిన సిద్దిపేట రూరల్ మండలంలోని 15 గ్రామ పంచాయతీలతో పాటు కొండపాక మండలం తిప్పారం, అక్కన్నపేట మండలం కన్నారం గ్రామ పంచాయతీ ల ఓటరు జాబితాలను విడుదల చేశారు. వీటిపై అభ్యంతరాలను స్వీకరించి పరిశీలన అనంతరం ఈనెల 7న తుది ఓటరు జాబితాలను విడుదల చేయనున్నారు.
తగ్గిన ఎంపీటీసీ స్థానాలు
సంగారెడ్డి జిల్లాలో అధికారులు ముసాయిదా జాబితాను విడుదల చేశారు. జిల్లాలో మొత్తం 27 జడ్పీటీసీలు, 276 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. 2019లో జిల్లాలో 25 జడ్పీటీసీ స్థానాలు ఉండగా, నిజాంపేట్, చౌటకూర్ మండలాలను కొత్తగా ఏర్పాటు చేశారు. అలాగే 2019లో 295 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, ప్రస్తుతం 276కు తగ్గాయి. 11 గ్రామ పంచాయతీలను కొత్తగా ఏర్పాటు చేసిన నాలుగు మున్సిపాలిటీల్లో విలీనం చేయడంతో 19 ఎంపీటీసీ స్థానాలు తగ్గాయి.
హత్నూర మండలంలో అత్యధికంగా 16 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, నారాయణఖేడ్, న్యాల్కల్ మండలాల్లో 15 చొప్పున ఎంపీటీసీ స్థానాలున్నాయి. అమీన్పూర్, జిన్నారం, గుమ్మడిదల మండలాల్లో ఐదేసి ఎంపీటీసీ స్థానాలున్నాయి. మొత్తం 8,51,420 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 4,23,062 మంది, మహిళలు 4,27,739 మంది, ఇతరులు 52 మంది ఉన్నారు.
కొత్తగా మాసాయిపేట మండలం
మెదక్ జిల్లాలో ఇదివరకు 20 మండలాలు ఉండగా కొత్తగా మాసాయిపేట మండలం ఏర్పాటైంది. దీంతో మండలాల సంఖ్య 21 కి చేరింది. ఇదివరకు జిల్లా వ్యాప్తంగా 189 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, కొత్తగా మరో ఎంపీటీసీ స్థానం ఏర్పాటైంది. దీంతో జిల్లాలో ఎంపీటీసీ స్థానాల సంఖ్య 190 కి చేరింది. ప్రతి మండలంలో కనీసం ఐదు ఎంపీటీసీ స్థానాలు ఉండాలని నిర్ణయించడం వల్ల మాసాయి పేట మండలంలో పునర్ విభజన చేపట్టి కొత్తగా మరో ఎంపీటీసీ స్థానాన్ని ఏర్పాటు చేశారు. జిల్లాలోని 493 గ్రామ పంచాయతీల పరిధిలో మొత్తం 5,25,478 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 2,52,797 మంది కాగా, మహిళలు 2,72, 672, ఇతరులు 9 మంది ఉన్నారు.