బీఆర్ఎస్​కు గుండుసున్నా .. ఒక్క సీటు కూడా గెలవని గులాబీ పార్టీ

బీఆర్ఎస్​కు గుండుసున్నా ..  ఒక్క సీటు కూడా గెలవని గులాబీ పార్టీ
  •     పార్టీ చరిత్రలోనే ఘోర పరాజయం
  •     మెదక్ సహా14 చోట్ల మూడోస్థానానికే పరిమితం
  •     హైదరాబాద్‌ సీటులో నాలుగో ప్లేస్
  •     ఏమాత్రం ప్రభావం చూపని కేసీఆర్ బస్సు యాత్ర
  •     ఆర్‌‌ఎస్పీ, కొప్పుల, పజ్జన్నకు ఘోర పరాభవం
  •     పార్టీ చరిత్రలో తొలిసారి కోల్పోయిన లోక్​సభ ప్రాతినిధ్యం

హైదరాబాద్, వెలుగు:  లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌‌ఎస్‌ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఒక్కటంటే ఒక్క సీటు గెలవకపోగా, కనీసం గట్టి పోటీ కూడా ఇవ్వలేకపోయింది. బీజేపీని ఉద్దేశించి కేసీఆర్ చెప్పిన ‘వన్ ఆర్ నన్’ సూత్రం, ఆయన పార్టీకే వర్తించింది. రాష్ట్రంలో 17 నియోజకవర్గాలు ఉంటే, 14 నియోజకవర్గాల్లో బీఆర్​ఎస్​ మూడో స్థానానికే పరిమితమైంది. మహబూబాబాద్, ఖమ్మం స్థానాల్లో మాత్రమే బీఆర్‌‌ఎస్‌ అభ్యర్థులు రెండో స్థానంలో నిలిచారు. హైదరాబాద్‌లో అయితే ఏకంగా నాలుగో స్థానానికి పడిపోయింది. పార్టీ చరిత్రలోనే  ఇంతటి ఘోర పరాభవాన్ని ఎప్పుడూ ఎదుర్కోలేదు.  పోటీచేసిన ఎన్నికల్లో కనీసం ఒక్క సీటు కూడా గెలవకుండా ఉండడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

ఓటుతో ఆన్సర్ ఇచ్చిన జనాలు

లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు కేసీఆర్ బస్సు యాత్ర కూడా చేశారు. ఓ వైపు కేటీఆర్, హరీశ్‌రావు ఊరూరా తిరిగి ప్రచారం చేస్తే, కేసీఆర్ తన బస్సు యాత్ర ద్వారా ప్రజల వద్దకు వెళ్లారు. కానీ ఆయన  ఓట్లు అభ్యర్థించడానికి బదులు కాంగ్రెస్‌ను విమర్శించడం, ప్రజలను నిందించడంపైనే దృష్టిపెట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తప్పు చేశారని, ఇప్పుడు తమ తప్పు తెలుసుకుని, పశ్చాత్తాపపడుతున్నారని పేర్కొన్నారు.  ప్రజల గుండెలు చీల్చితే తన బొమ్మనే ఉంటుందని, బీఆర్‌‌ఎస్‌ను ప్రజలు కావాలని కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌పై 4 నెలల్లోనే తీవ్ర వ్యతిరేకత వచ్చిందని చెప్పారు. కేసీఆర్​ను ఓడించి తప్పుచేశామని, మళ్లీ ఆయనే రావాలని ప్రజలు కోరుకుంటున్నారని  కేటీఆర్ చెప్పుకొచ్చారు. కానీ, అవేవీ నిజం కాదని ప్రజలు తమ ఓటుతో తేల్చేశారు. కేసీఆర్ బస్సు యాత్ర, సభలు జరిగిన నియోజకవర్గాల్లోనూ ఆ పార్టీ అభ్యర్థులను ఓడించి, ఓటుతోనే ఆన్సర్​ ఇచ్చారు. 

కేటీఆర్‌‌కు దక్కని ఊరట

మెదక్‌ సీటులో పార్టీ అభ్యర్థిని గెలిపించే బాధ్యతను హరీశ్‌రావు తీసుకోగా, కరీంనగర్‌‌లో పార్టీ సీనియర్ నాయకుడు బోయిన్‌పల్లి వినోద్‌కుమార్‌‌ను గెలిపించే రెస్పాన్సిబిలిటీని కేటీఆర్ తీసుకున్నారు. ఆయన ప్రాతినిధ్యం వహించే సిరిసిల్ల కూడా ఇదే నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. దీంతో వినోద్‌కుమార్ గెలుపును కేటీఆర్‌‌ చాలెంజ్‌గా తీసుకుని, ప్రచారం నిర్వహించారు. ఇక్కడ కేసీఆర్ ఓ సభ కూడా నిర్వహించారు. నియోజకవర్గంలో బస్సు యాత్ర చేపట్టారు. అంతకుముందు పొలాల వద్దకు వెళ్లి రైతులను కలిశారు. సిరిసిల్లలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇవేవీ వినోద్‌కుమార్‌‌ను గట్టించలేకపోగా, కనీసం రెండో స్థానానికి కూడా తీసుకురాలేకపోయాయి. కేవలం 2.82 లక్షల ఓట్లతో ఆయన మూడో స్థానానికి పడిపోయారు.

సిట్టింగు సీట్లన్నీ అవుట్​..

గత పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌‌ఎస్ 9 ఎంపీ సీట్లలో గెలుపొందగా, ఈ సారి ఆ అన్ని నియోజకవర్గాల్లోనూ ఓటమి చవిచూసింది. మహబూబాబాద్‌ సిట్టింగ్ ఎంపీ మాలోతు కవిత, ఖమ్మం సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వర్‌‌రావు, మహబూబ్​నగర్​ సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి తమ స్థానాలను కోల్పోయారు. పెద్దపల్లి నుంచి గతంలో బోర్లకుంట వెంకటేశ్ బీఆర్‌‌ఎస్ ఎంపీగా గెలువగా, ఆయన ఎన్నికలకు ముందే బీజేపీలో చేరారు. అక్కడినుంచి పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పోటీ చేసి, ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్నారు. గత ఎన్నికల్లో గెలిచిన వరంగల్‌, చేవెళ్ల, జహీరాబాద్, మెదక్‌, నాగర్‌‌కర్నూల్‌ సీట్లను కూడా బీఆర్‌‌ఎస్ కోల్పోయింది. ఇక్కడి సిట్టింగు ఎంపీలు ఇతర పార్టీల్లోకి వెళ్లడంతో, కొత్త అభ్యర్థులను బీఆర్‌‌ఎస్ బరిలోకి దించినా..  ప్రయోజనం లేకుండా పోయింది. సికింద్రాబాద్‌లో ఎమ్మెల్యే పద్మారావుగౌడ్‌, నిజామాబాద్‌లో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ను పోటీ చేయించినా.. వారు మూడో స్థానానికే పరిమితమయ్యారు.

కేసీఆర్ ఇలాకాలోనూ తప్పని ఓటమి

కేసీఆర్ సొంత నియోజకవర్గం మెదక్‌లోనూ బీఆర్‌‌ఎస్‌ చిత్తుగా ఓడింది. ఈ నియోజకవర్గం పరిధిలోనే కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్, పార్టీ ట్రబుల్ షూటర్ హరీశ్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ పరిధిలోని 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్‌‌ఎస్ అభ్యర్థులే ఎమ్మెల్యేగా గెలిచారు. పార్టీ తరఫున అపర కుబేరుడిగా పేరున్న ఎమ్మెల్సీ వెంకటరామిరెడ్డికి టికెట్ ఇచ్చారు. ఈ అన్ని కారణాలతో ఇక్కడ  గెలుపుపై బీఆర్‌‌ఎస్ ఆశలు పెట్టుకుంది. ఎన్నికల ముందు వరకూ 14 సీట్లు గెలుస్తాం అని చెప్పుకొచ్చిన ఆ పార్టీ నాయకులు, ఎన్నికల తర్వాత మెదక్‌లో మాత్రం కచ్చితంగా గెలుస్తామంటూ మాట మార్చారు. మెదక్‌పై గట్టి ఆశలు పెట్టుకున్నారు. తీరాచూస్తే ఇక్కడ బీఆర్ఎస్​ అభ్యర్థి గెలవకపోగా..కనీసం రెండోస్థానంలో కూడా నిలువలేకపోయాడు.  సుమారు 70 వేల పైచిలుకు ఓట్ల తేడాతో మూడో స్థానానికే పరిమితమయ్యాడు. అసెంబ్లీ ఎన్నికల్లో చెల్లని రూపాయి, పార్లమెంట్ ఎన్నికల్లో చెల్లుతుందా? అంటూ కేసీఆర్ ఎద్దేవా చేసిన బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావే ఇక్కడ సత్తా చాటారు. మెదక్‌లో 2009 నుంచి 2019 వరకూ వరసగా నాలుగుసార్లు బీఆర్‌‌ఎస్ అభ్యర్థులే విజయం సాధించగా.. ఈసారి ఆ రికార్డును రఘునందన్‌రావు బ్రేక్ చేశారు.

లోక్​సభలో నో బీఆర్​ఎస్​

 గులాబీ పార్టీ హిస్టరీలో తొలిసారి లోక్‌సభ ప్రాతినిధ్యాన్ని కోల్పోయింది. టీఆర్‌‌ఎస్ పార్టీని 2001లో కేసీఆర్ ప్రారంభించాక 2004లో వచ్చిన జనరల్ ఎలక్షన్స్‌లో కరీంనగర్‌‌ నుంచి కేసీఆర్‌‌ ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత జరిగిన 2009 జనరల్ ఎలక్షన్స్‌లో మహబూబ్‌నగర్ నుంచి కేసీఆర్, మెదక్‌ నుంచి విజయశాంతి గెలుపొంది, టీఆర్‌‌ఎస్ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. 2014 ఎన్నికల్లో 11 ఎంపీ సీట్లు గెలిచి బంపర్ మెజార్టీ సాధించింది. గత ఎన్నికల్లో 9  సీట్లలో విజయం సాధించి, రాష్ట్రంలో నంబర్‌‌ వన్‌గా నిలిచింది. ఈ సారి 9 సిట్టింగ్ సీట్లు సహా అన్ని సీట్లలోనూ బీఆర్‌‌ఎస్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. దీంతో ఆ పార్టీకి లోక్‌సభలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. టీఆర్‌‌ఎస్‌ను బీఆర్‌‌ఎస్‌గా మార్చి దేశాన్ని ఏలుదామని కలలుగన్న ఆ పార్టీకి, సొంతిల్లు లాంటి తెలంగాణలోనే ఒక్క సీటు కూడా దక్కకపోవడం గమనార్హం.

మూడోస్థానంలో ఆర్‌‌ఎస్పీ

అసెంబ్లీ ఎన్నికల్లో బహుజన్​ సమాజ్​ పార్టీ (బీఎస్పీ) స్టేట్‌ ప్రెసిడెంట్‌గా, ఆ పార్టీ నుంచి సిర్పూర్‌‌ కాగజ్‌నగర్‌‌లో పోటీ చేసిన ఆర్‌‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ అక్కడ ఘోర ఓటమిని చవిచూశారు. కేవలం 44,464 ఓట్లు సాధించి మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల వరకూ బీఆర్‌‌ఎస్‌ సర్కార్‌‌పై అనేక విమర్శలు గుప్పించిన ఆర్‌‌ఎస్పీ, అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత మాట మార్చారు. అదే బీఆర్‌‌ఎస్‌తో బీఎస్పీకి పొత్తు కుదిర్చారు. కానీ, ఈ పొత్తును బీఎస్పీ జాతీయ నాయకత్వం అంగీకరించకపోవడంతో ఆ పార్టీని వదిలేసి గులాబీ కండువా కప్పుకున్నారు. నాగర్‌‌కర్నూల్ నుంచి బీఆర్‌‌ఎస్‌ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఈసారి కూడా ఆయనకు మళ్లీ పరాభవమే మిగిలింది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి గెలుపొందగా, బీజేపీ అభ్యర్థి పోతుగంటి భరత్ ప్రసాద్ రెండో స్థానంలో నిలిచారు. ఆర్‌‌ఎస్పీకి మళ్లీ అదే మూడో స్థానం మిగిలింది.