
- గడువు కోరుతూ ప్రభుత్వానికి మున్సిపల్ శాఖ లెటర్
- ఇందిరమ్మ ఇండ్ల సర్వే లో అధికారులు.. దరఖాస్తుల క్లియరెన్స్ ఆలస్యం
హైదరాబాద్, వెలుగు: లే అవుట్ రెగ్యులరైజేషన్ (ఎల్ఆర్ఎస్) స్కీమ్ గడువును ప్రభుత్వం మరో రెండు నెలలు పెంచే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న గడువు బుధవారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో మరోసారి గడువు పెంచాలని కోరుతూ మున్సిపల్ శాఖ ప్రభుత్వానికి లేఖ రాసినట్లు సమాచారం. అయితే ప్రభుత్వం గడువుతోపాటు ప్రస్తుతం ఫీజు చెల్లించేందుకు ఇస్తున్న 25 శాతం రాయితీని కొనసాగిస్తుందా లేదా అనే దానిపై సందిగ్ధం నెలకొంది.
మరోవైపు నెల రోజుల నుంచి ఫీజు చెల్లింపులు పెరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా రూ.11 కోట్లు వసూలు కాగా, మంగళవారం రూ.10 కోట్లు వచ్చినట్లు మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కలిపి మొత్తం 15,37,159 అప్లికేషన్లు రాగా ఇప్పటి వరకు 3,24,296 మంది రూ.1,170 కోట్లు ఫీజు చెల్లించారు. బడంగ్ పేట, గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు, తుర్కయాంజల్ మున్సిపాలిటీ అత్యధికంగా ఫీజు చెల్లించిన వాటిలో ఉన్నాయి.
టెక్నికల్ సమస్యలు పరిష్కారం కావట్లే
ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను క్షేత్ర స్థాయిలో ఇరిగేషన్, రెవెన్యూ ఆఫీసర్లు క్లియర్ చేయటం లేదని అందుకే లేట్ అవుతున్నాయని మున్సిపల్ కమిషనర్లు అంటున్నారు. ఇందిరమ్మ ఇండ్ల సర్వేలో బిజీగా ఉండటం వల్ల ఎల్ఆర్ఎస్ అప్లికేషన్ల క్లియరెన్స్ ఆలస్యం అవుతున్నదని అధికారులు అంటున్నారు. మరోవైపు అప్లికేషన్లలో టెక్నికల్ సమస్యలు ఇప్పటికి పరిష్కారం కాలేదని దరఖాస్తుదారులు నిత్యం అధికారుల దృష్టికి తెస్తున్నారు. ఫీజు చెల్లించేందుకు దరఖాస్తుదారులు రెడీగా ఉన్నప్పటికీ ఆన్ లైన్ లో అప్ డేట్ కావడం లేదు. దరఖాస్తు దారులు చేస్తున్న ఫిర్యాదులను అధికారులు సాల్వ్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నా.. టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తూ ఫీజు జనరేట్ కావటం లేదంటున్నారు. రెండు నెలల నుంచి ఈ సమస్యలు ఇలాగే కొనసాగుతున్నాయని చెబుతున్నారు.