- పులి రక్షణ లో ట్రాకింగ్, ట్రేసింగ్ కీ రోల్ : డోబ్రియాల్
కాగజ్ నగర్, వెలుగు: పులుల రక్షణ కోసం తెలంగాణా, మహారాష్ట్ర ఫారెస్ట్ అధికారులు కలిసి పనిచేయాలని నిరంతరం పరస్పరం సమాచారం ఇచ్చిపుచ్చుకోవాలని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, ఫారెస్ట్ ఫోర్స్ హెడ్ ఆర్.ఎం. డొబ్రియాల్ అన్నారు. పులి కదలికలకు సంబంధించి నిరంతర పర్యవేక్షణ, ట్రాకింగ్, ట్రేసింగ్ తో మేలు జరుగుతుందని పేర్కొన్నారు. కాగజ్ నగర్ డివిజన్ అటవీప్రాంతంలో రెండు చోట్ల పులి దాడి చేసిన ఘటనల్లో ఓ మహిళ చనిపోవడం, మరో రైతు గాయపడడంతో కోఆర్డినేషన్ కోసం ఇరు రాష్ట్రాల ఫారెస్ట్ అధికారులు శుక్రవారం రెండురాష్ట్రాల సరిహద్దులో సిర్పూర్ టీ మండలం జక్కా పూర్, మాకిడి మధ్య లో మీటింగ్ నిర్వహించారు.
మహారాష్ట్ర లోని తాడోబా, తిప్పేశ్వర్ టైగర్ రిజర్వ్ లలో పులులు పెద్ద సంఖ్యలో ఉండడంతో వాటిని అనుకుని ఉన్న కాగజ్ నగర్ ఫారెస్ట్ లోకి కొన్నేండ్లుగా పులులు రాకపోకలు సాగిస్తున్నాయి. అక్కడి పులుల కదలికలు, పులుల సంరక్షణా చర్యలు ఏవిధంగా ఉన్నాయి, వాటి పర్యవేక్షణ ఎలా చేస్తున్నారు, టైగర్ ఆటాక్ జరిగిన సమయంలో ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారని మహారాష్ట్ర అధికాఉరులను అడిగా తెలుసుకున్నారు. మహారాష్ట్రలో పులిదాడిలో చనిపోతే రూ. 25 లక్షలు పరిహారం ఇస్తున్నట్టు, చనిపోయిన పశువులకు మార్కెట్ రేటు ప్రకారం పరిహారం ఇస్తున్నట్టు అక్కడ అధికారులు వివరించారు.
అడవుల ఆక్రమణలు జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని, పులుల సంరక్షణ లో స్థానికులను భాగస్వాములను చేస్తూ ప్రతీ గ్రామంలో ప్రైమరీ రెస్పాన్స్ రెస్క్యూ టీమ్ లను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. వీరికి ఒక్కొక్కరికి నెలకు రూ. 1500 గౌరవ వేతనం ఇస్తున్నామని, పులి దాడి, సంచారం గమనించినప్పుడు వెంటనే స్పందించి అలెర్ట్ చేస్తారన్నారు. తడోబా, కనర్ గాం ఫారెస్ట్ లో పులులు ఎక్కువున్నాయి.
మహారాష్ట్ర లోని టైగర్ రిజర్వ్, దాని కోర్ , బఫర్ ఏరియాల్లో త్వరలో క్షేత్ర స్థాయి పర్యటన చేయనున్నట్టు డోబ్రియాల్ ప్రకటించారు. కాగజ్ నగర్ సహా వివిధ ప్రాంతాల్లో ఆడ పులుల అవసరం ఉందని, ఆడపులుల సంరక్షణపై దృష్టి పెడతామని చెప్పారు. కాగ జ్ నగర్ ఫారెస్ట్ ఏరియాలో పులులకు అనువైన వాతావరణం, నివాసం ఉండేందుకు మెరుగైన వాతావరణం ఉంటే కవ్వాల్ టైగర్ రిజర్వ్ కి పులుల రాక పెరుగుతుందన్నారు.
కాగజ్ నగర్, సిర్పూర్ టీ రేంజ్ ల బార్డర్ ప్రాంతంలో పులుల సంచారంపై ప్రత్యేక దృష్టి పెట్టామని,ఎప్పటికప్పుడు సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నట్లు డీ ఎఫ్ ఓ నీరజ్ కుమార్ తెలిపారు. ఇటీవల దాడి చేసిన పులి తో పాటు మిగిలిన పులులకు సంబంధించి తమ వద్ద ఉన్న ఫోటోలు, సీసీ కెమెరా ఫుటేజీ ఉందన్నారు. ఇకపై నిరంతరం కలిసి కట్టుగా పులి సంరక్షణ, ట్రాకింగ్ చేయాలని ఆయన మహారాష్ట్ర అధికారులను కోరారు. మహారాష్ట్ర లో పర్యటనకు వస్తే సహకారిస్తామని చంద్రాపూర్ ఏ సీ ఎఫ్ ప్రకాశ్ అవధూతవార్ చెప్పారు.
కాగా మీటింగ్ జరిగిన చోట రెండు బండల నడుమ పులి స్కేర్ (మలం) ను ఫీల్డ్ బయాలజిస్ట్ లు గుర్తించారు. దాని శాంపిల్ ను ల్యాబ్ కి పంపించారు. ఈ మీటింగ్ లో స్టేట్ వైల్డ్ లైఫ్ చీఫ్ వార్డెన్ ఈలుసింగ్ మేరు , జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ నీరజ్ కుమార్, చంద్రాపూర్ ఏసీఎఫ్ ప్రకాష్ అవధూత్ వార్, దాబా ఆర్ఎఫ్ఓ గౌర్కార్ ,కాగ జ్ నగర్ ఎఫ్ డీ ఓ సాహు, బయాలజిస్ట్ ఎల్లం, సిర్పూర్ టీ రేంజ్ ఆఫీసర్ ఇక్బాల్ హుస్సేన్, సెక్షన్ ఆఫీసర్ మోహన్ రావు, సద్దాం తదితరులు పాల్గొన్నారు.