నమ్మిన ఫ్రెండే ఆరుగురిని హత్య చేసిండు.. తల్లి ఫిర్యాదుతో వెలుగులోకి..

  • ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో దారుణం
  • చనిపోయిన వారిలో దంపతులు, కవల పిల్లలు, ఇద్దరు చెల్లెళ్లు
  • లోన్ ఇప్పిస్తానని నమ్మించి ఆస్తి రాయించుకున్న ఫ్రెండ్​
  • తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో వరుస హత్యలు

కామారెడ్డి/నిజామాబాద్, వెలుగు:  ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. స్నేహితుడి ఆస్తిని కాజేసేందుకు ఓ దుర్మార్గుడు ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని హత్య చేశాడు. 15 రోజుల వ్యవధిలోనే అందరినీ చంపేశాడు. ఈ నెల 14న కామారెడ్డి జిల్లా భూంపల్లి దగ్గర కాలిపోయిన ఓ యువతి డెడ్​బాడీ దొరికింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా సీరియల్ హత్యలు వెలుగులోకి వచ్చాయి. ఆస్తి కోసమే ఫ్యామిలీ మొత్తాన్ని హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండల కేంద్రానికి చెందిన పున ప్రసాద్, ప్రశాంత్ ఇద్దరూ ఫ్రెండ్స్. 

35 ఏండ్ల ప్రసాద్.. కొన్నేండ్లు గల్ఫ్​లో పనిచేసి ఏడాదిన్నర కింద మాక్లూర్ వచ్చేశాడు. చెల్లి పెండ్లి తర్వాత తండ్రి చనిపోవడంతో కుటుంబ బాధ్యతలన్నీ ప్రసాద్ తీసుకున్నాడు. ఊర్లో గొడవల కారణంగా ప్రసాద్ తన ఫ్యామిలీతో కామారెడ్డి జిల్లా పాల్వంచ మండల కేంద్రానికి షిఫ్ట్ అయ్యాడు. 

లోన్​ ఇప్పిస్తానంటూ నమ్మించి..

తల్లి సుశీల, భార్య రమణి, ఇద్దరు కవల పిల్లలు చైత్రిక్, చిత్రిక, చెల్లెళ్లు స్రవంతి, స్వప్నతో కలిసి పాల్వంచలోనే ఉంటున్నాడు. ప్రసాద్​కు మాక్లూర్​లో రెండు ఇండ్లు, ఇంటి జాగా ఉంది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రసాద్​కు లోన్ ఇప్పిస్తానని అతని స్నేహితుడు ప్రశాంత్ నమ్మించాడు. లోన్ కోసం ఇండ్లు, జాగాను మార్టిగేజ్ చేయాల్సి ఉంటుందని చెప్పి ఏడు నెలల కింద వాటిని ప్రశాంత్ తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఎంతకూ లోన్ రాకపోవడంతో ప్రశాంత్​ను ప్రసాద్ నిలదీశాడు. మార్జిగేజ్ కోసమంటూ తీసుకున్న సంతకాలతో తన ఇండ్లు, జాగా ప్రశాంత్ అతని పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్న విషయం తెలుసుకున్నాడు. తన ఆస్తి తిరిగి ఇచ్చేయాలని ప్రశాంత్​పై ప్రసాద్ ఒత్తిడి తీసుకొచ్చాడు. ప్రసాద్ ఫ్యామిలీని చంపేస్తే ఆస్తి మొత్తం తనకే దక్కుతుందని ప్రశాంత్ ప్లాన్ చేశాడు. 

ఐదు చోట్ల.. ఆరుగురి హత్య

ముందుగా.. నవంబర్ 28న ప్రసాద్​ను తనతో తీసుకెళ్లి నిజామాబాద్ జిల్లా డిచ్​పల్లిలో చంపి శవాన్ని మాయం చేశాడు. ఓ కేసు విషయంలో పోలీసులు ప్రసాద్​ను తీసుకెళ్లారని, అతన్ని విడిపించేందుకు రావాలని భార్య రమణిని నమ్మించి ఆమెను నిర్మల్ జిల్లా బాసర తీసుకెళ్లాడు. ఆమెను అక్కడే హత్య చేసి డెడ్​బాడీని గోదావరిలో పడేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ తర్వాత ప్రసాద్, రమణి తీసుకురమ్మన్నారని నమ్మించి కవల పిల్లలు చైత్రిక్, చిత్రికను ప్రశాంత్ తీసుకెళ్లి నిజామాబాద్ జిల్లా మెండోరా బ్రిడ్జి దగ్గర చంపేశాడు. శవాలను ప్లాస్టిక్ కవర్లో చుట్టి బ్రిడ్జి పైనుంచి కాలువలో విసిరేశాడు. కవలల్లో ఒకరి డెడ్ బాడీ వారం కింద దొరకగా, మరో డెడ్ బాడీ సోమవారం గుర్తించారు. పోలీసుల అదుపులో ఉన్న ప్రసాద్.. కలవాలనుకుంటున్నాడని చెప్పి ఇద్దరు చెల్లెళ్లలను కూడా తీసుకుపోయి.. ఒకరిని మెదక్ జిల్లా చేగుంట వద్ద, మరొకరిని కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం భూంపల్లి వద్ద చంపినట్టు తేలింది. 

తల్లి సుశీల ఫిర్యాదుతో వెలుగులోకి..

ఈ నెల 14న భూంపల్లిలో యువతి శవాన్ని గుర్తించిన పోలీసులు విచారణ ప్రారంభించారు. అదే టైమ్​లో ప్రసాద్ తల్లి సుశీల.. ప్రశాంత్​పై అనుమానంతో పోలీసులను ఆశ్రయించింది. ప్రశాంత్​తో వెళ్లిన కొడుకు, కోడలు, కూతుళ్లు, పిల్లలు తిరిగిరాలేదని పోలీసులకు చెప్పింది. భూంపల్లి దగ్గర ఉన్న డెడ్​బాడీ ప్రసాద్ చెల్లెలదిగా పోలీసులు గుర్తించారు. దీంతో ప్రసాద్ ఫ్యామిలీ మిస్సింగ్ కోణంలో విచారించారు. ప్రశాంత్ కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు.. వరుస హత్యలకు పాల్పడినట్టు తేల్చారు. ఈ హత్యలన్నీ నవంబర్ 28 నుంచి డిసెంబర్ 13 మధ్య చేసినట్టు భావిస్తున్నారు. ప్రసాద్, అతని భార్యను ప్రశాంత్ ఒంటరిగానే హత్య చేశాడని, మిగిలిన హత్యల్లో మరో ముగ్గురు అతనికి సహకరించారని తెలుస్తున్నది. ప్రశాంత్​తో పాటు అతనికి సహకరించిన వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం.