ఖమ్మంలో భార్యాపిల్లలను చంపిన డాక్టర్.. కేసులో వీడిన మిస్టరీ
మత్తు ఇంజక్షన్ ఇచ్చి భార్య, గొంతునులిమి పిల్లల హత్య
డెడ్ బాడీలను కారులో ఉంచి.. చెట్టును ఢీకొట్టి యాక్సిడెంట్‌గా చిత్రీకరణ
తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నారనే ఘాతుకం
డాక్టర్, అతని ప్రియురాలు అరెస్టు
ఖమ్మం టౌన్, వెలుగు : పెండ్లయి ఇద్దరు పిల్లలున్న తర్వాత మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని.. భార్య, పిల్లలను హత్య చేశాడో డాక్టర్. కారులో బయటకు తీసుకెళ్లి మత్తు ఇంజక్షన్ ఓవర్డోస్ఇచ్చి భార్యను, గొంతునులిమి పిల్లలను చంపి.. ఆ కారుతో చెట్టును ఢీకొట్టి, వాళ్లు యాక్సిడెంట్ లో చనిపోయినట్టుగా చిత్రీకరించాడు. దీనిపై కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తం చేయడంతో పోలీసులు ఎంక్వైరీ చేపట్టగా అసలు విషయం బయటపడింది. ఈ కేసు వివరాలను ఖమ్మం టౌన్ఏసీపీ రమణమూర్తి ఆదివారం మీడియాకు వెల్లడించారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం బావోజి తండాకు చెందిన బొడా ప్రవీణ్ కు ఐదేండ్ల కింద ఏన్కూరు మండలం రంగాపురం తండాకు చెందిన కుమారి(25)తో పెండ్లయింది. వీళ్లకు బిడ్డలు కృషిక(4), కృతిక(3) ఉన్నారు. హైదరాబాద్ లోని జర్మన్ టెక్ హాస్పిటల్ లో అనస్థీషియ డాక్టర్ గా పని చేస్తున్న ప్రవీణ్.. అదే హాస్పిటల్ లో నర్స్ గా పని చేస్తున్న కేరళకు చెందిన సోని ఫ్రాన్సిస్ తో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఇది తెలిసి ప్రవీణ్ ను కుమారి నిలదీసింది. దీంతో తనకు అడ్డుగా ఉన్న భార్యాపిల్లలను చంపేయాలని ప్రవీణ్ నిర్ణయించుకున్నాడు.
సొంతూరుకు తీసుకెళ్లి హత్య..
పథకం ప్రకారం మే 17న భార్యాపిల్లలను తీసుకుని సొంతూరు బావోజి తండాకు ప్రవీణ్ వచ్చాడు. అదే నెల 28న పని నిమిత్తం వాళ్లను తీసుకుని కారులో ఖమ్మం వెళ్లాడు. పని ముగించుకుని తిరిగి ఊరికి వస్తుండగా మార్గమధ్యలో తనకు వేడి చేసిందని, జ్యూస్ తాగుదామని భర్తను అడిగింది. శరీరంలో వేడి తగ్గించే కాల్షియం ఇంజక్షన్ తన దగ్గర ఉందని ప్రవీణ్ చెప్పాడు. ఖమ్మం నుంచి ఇల్లందు వైపు వెళ్లే కోయచలక రోడ్డు దగ్గర కారు ఆపి.. అప్పటికే తన వెంట తెచ్చుకున్న కాల్షియం ఇంజక్షన్‌తో పాటు మత్తు మందు ఓవర్ డోస్‌ను కుమారికి ఇచ్చాడు. ఆమె చనిపోయాక తన ఇద్దరు బిడ్డలను గొంతునులిమి చంపేశాడు. తర్వాత డెడ్ బాడీలను కారులో తీసుకెళ్లి హర్యా తండా వద్ద చెట్టును ఢీకొట్టి యాక్సిడెంట్‌గా చిత్రీకరించాడు. అయితే, మృతదేహాలపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ప్రవీణ్‌తో పాటు అతని ప్రియురాలు సోనిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కారులో సిరంజి స్వాధీనం చేసుకున్నామని ఏసీపీ చెప్పారు. మత్తు ఇంజక్షన్ ఇచ్చి ఎలా చంపాలి? అది పోస్టుమార్టం రిపోర్టులో తెలియకూడదంటే ఏం చేయాలి? అని గూగుల్‌లో ప్రవీణ్ సెర్చ్ చేసినట్టు పేర్కొన్నారు.