దుబాయ్ లో జైల్లో మగ్గి.. 17 ఏండ్లకు ఇంటికొచ్చిన తెలంగాణ వాసి

  •    దుబాయ్ జైల్లో మగ్గిన  రాజన్న సిరిసిల్ల జిల్లా వాసి
  •     కేటీఆర్ కృషితో క్షమాభిక్ష 

కోనరావుపేట,వెలుగు : బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లిన వలసజీవి అక్కడ హత్య కేసులో 17 ఏండ్ల జైలు జీవితం గడిపి క్షమాభిక్షతో శుక్రవారం స్వగ్రామం చేరుకున్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా  కోనరావుపేటకు చెందిన దండుగుల లక్ష్మణ్ (38) 2005లో ఉపాధి కోసం దుబాయ్ వెళ్లాడు. 2006లో అక్కడ జరిగిన ఓ హత్య కేసులో జిల్లాకు చెందిన శివరాత్రి రవి, మల్లేశం, నాంపల్లి, హన్మాండ్లుతో పాటు లక్ష్మణ్​కు 25 ఏండ్ల జైలు శిక్ష పడింది. అప్పటి నుంచి లక్ష్మణ్  దుబాయ్ జైల్లోనే మగ్గుతున్నాడు. వీరి విడుదల కోసం మంత్రి కేటీఆర్ ప్రయత్నాలు చేశారు. ప్రాణాలు కోల్పోయిన నేపాల్​కు చెందిన బహదూర్ సింగ్ కుటుంబానికి కేటీఆర్ స్వయంగా షరియా చట్టం ప్రకారం రూ.15 లక్షల పరిహారాన్ని ఇచ్చారు.

దీంతో బాధిత కుటుంబం క్షమాభిక్షకు ఒప్పుకోగా వాటిని దుబాయ్ ప్రభుత్వానికి సమర్పించారు. అక్కడి ప్రభుత్వం నేర తీవ్రతను పరిగణలోకి తీసుకుని క్షమాభిక్ష ప్రసాదించలేదు. గత నెలలో మంత్రి కేటీఆర్ దుబాయ్ పర్యటనకు వెళ్లగా జిల్లాకు చెందిన ఖైదీల విడుదల కోసం అక్కడి ప్రభుత్వంతో మాట్లాడారు. మానవతా దృక్పథంతో క్షమాభిక్ష ఇవ్వాలని విజ్ఞప్తి చేయగా సానుకూలంగా స్పందించి లక్ష్మణ్ విడుదలకు ఒప్పుకుంది. దీంతో అతడు విడుదలై శుక్రవారం ఇంటికి చేరుకున్నాడు. 17 ఏండ్ల తర్వాత కొడుకును చూసుకున్న లక్ష్మణ్ తల్లి లస్మవ్వ,అన్న, అక్కలు  కన్నీటి పర్యంతమయ్యారు.  చాలాకాలం జైలులో ఉండడంతో లక్ష్మణ్ మానసిక పరిస్థితి బాగా లేదని,  ప్రభుత్వం వైద్యం చేయించి ఆర్థికంగా ఆదుకోవాలని లక్ష్మణ్ అన్న రాజు కోరాడు. తమ్ముడి విడుదలకు సహకరించిన మంత్రి కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలిపాడు.