- ప్రతి యూ ట్యూబ్ న్యూస్ చానెల్ కంపెనీ యాక్టు కింద నమోదు కావాలి
- సీనియర్ జర్నలిస్టులు, పత్రికా ఎడిటర్ల అభిప్రాయం
సికింద్రాబాద్, వెలుగు: న్యూస్‌పేపర్లకు ఆర్ఎన్ఐ రిజిస్ట్రేషన్, టీవీ చానల్స్ కు మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్ గుర్తింపు, కంపెనీ యాక్ట్ కింద నమోదు మాదిరిగానే యూట్యూబ్ న్యూస్ చానెల్స్ కంపెనీ యాక్ట్కింద నమోదు కావాలని పలువురు సీనియర్ జర్నలిస్టులు, పత్రికా ఎడిటర్లు అభిప్రాయపడ్డారు. న్యూస్ వెబ్సైట్లకు కూడా ఇవే నియమ నిబంధనలు ఉన్నాయని గుర్తుచేశారు. యూట్యూబ్ న్యూస్ చానెల్స్ గుర్తింపు, అక్రిడిటేషన్ల జారీకి అవసరమైన నియమ నిబంధనలు, అనుసరించాల్సిన విధివిధానాలపై తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో సోమవారం బేగంపేటలోని టూరిజం ప్లాజా హోటల్లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. మీడియా అకాడమీ చైర్మన్కె.శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షత వహించారు.
ప్రముఖ పత్రికా ఎడిటర్లు, సీనియర్ జర్నలిస్టులు, యూట్యూబ్ చానెల్స్ నిర్వాహకులు పాల్గొని పలు సూచనలు చేశారు. చట్టబద్ధత లేకుండా, హద్దు, అదుపు లేకుండా చలామణి అవుతున్న వారికి గుర్తింపు ఇస్తే మీడియా వ్యవస్థకు మాయని మచ్చ మిగులుతుందని చెప్పారు. సంస్థ రిజిస్ట్రేషన్, లేబర్ లైసెన్స్, పోస్టల్ లైసెన్స్, ట్రేడ్ మార్క్ లైసెన్స్, జీఎస్టీ రిజిస్ట్రేషన్, కార్యాలయ నిర్వహణ తీరు, సిబ్బంది తదితర అంశాలను పరిశీలించాలని అభిప్రాయపడ్డారు. యూట్యూబర్స్ ప్రసారాలు జర్నలిజం నైతిక ప్రమాణాలకు కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉంటుందన్నారు. భావస్వేచ్ఛకు ఉన్న పరిమితులకు లోబడి, జర్నలిజం వృత్తికి అనుగుణంగా, ఎప్పటికప్పుడు వార్తలు, చర్చా గోష్టిలు, ఇంటర్వ్యూలు, ప్రత్యేక కథనాలు ప్రసారం చేస్తున్న యూట్యూబ్ సంస్థలను మాత్రమే మీడియా సంస్థలుగా గుర్తించాలన్నారు. సబ్ స్క్రైబర్స్, వ్యూస్ ప్రధాన క్రైటేరియగా తీసుకోరాదని చెప్పారు.
వ్యక్తిగత ఎజెండాలతో, ద్వేషాలతో, కక్ష్యపూరిత ధోరణులతో, సమాజాన్ని తప్పు దోవ పట్టించే ప్రసారాలు చేస్తున్న వారిని పరిగణలోకి తీసుకోకపోవడం మంచిదని పలువురు వెలిబుచ్చారు. సమావేశంలో ఎమ్మెల్సీ ఆమీర్అలీ ఖాన్, ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె.శ్రీనివాస్, సీఎం సీపీఆర్ఓ అయోధ్యరెడ్డి, మీడియా అకాడమీ మాజీ అధ్యక్షుడు అల్లం నారాయణ, ప్రముఖ జర్నలిస్టులు దిలీప్ రెడ్డి, కట్టా శేఖర్ రెడ్డి, పద్మజా షా, ఎం.ఎ.మాజీద్, కరుణాకర్ దేశాయ్, జర్నలిస్ట్ నాయకులు విరహత్ అలీ, సోమయ్య, పలు యూట్యూబ్ చానెళ్ల ప్రతినిధులు, సమాచార శాఖ జాయింట్ డైరెక్టర్ జగన్, మీడియా అకాడమీ సెక్రటరీ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.