- సోషల్ మీడియాలో వైద్య సలహాలిస్తూ ప్రజలను మోసం చేస్తున్న నకిలీ డాక్టర్
హైదరాబాద్, వెలుగు: సోషల్ మీడియాలో డాక్టర్‌గా చెలామణి అవుతూ... ప్రజలకు వైద్య సలహాలిస్తున్న ఓ నకిలీ డాక్టర్‌ను తెలంగాణ మెడికల్ కౌన్సిల్ (టీజీఎంసీ) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అంబులెన్స్‌లో పని చేయడం కోసం వేములవలస రాంబాబు అనే వ్యక్తి ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ తీసుకొని కొంతకాలంగా డాక్టర్‌గా చెలామణి అవుతున్నాడు.
వైద్యపరంగా ఎలాంటి అర్హత లేకున్నా.. ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్‌ల్లో (ఆల్ ఇన్ వన్ రామ్ పేరుతో) ఎమర్జెన్సీ సమయంలో ఎలాంటి ట్రీట్‌మెంట్ అందించాలి? ఐసీయూలో ఎలాంటి మందులు ఇస్తారు? అనే విషయాలపై సలహాలిస్తూ.. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడు. సాయి వాణి హాస్పిటల్ యాజమాన్యాన్ని కూడా ఈ ఫేక్ డాక్టర్ బురిడి కొట్టించాడు.
ఈ విషయం టీజీఎంసీ అధికారుల దృష్టికి రావడంతో కౌన్సిల్ మెంబర్లు డాక్టర్ శ్రీనివాస్, ఇమ్రాన్ ఆలీ మూడు నెలల రెక్కి నిర్వహించి హైదరాబాద్‌లోని సాయివాణి హాస్పిటల్‌లో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతనిపై ఎన్ఎంసీ చట్టం 34, 54, టీఎస్ఎంపీఆర్ యాక్ట్ 22 ప్రకారం కేసు నమోదు చేయనున్నట్లు టీజీఎంసీ మెంబర్ డాక్టర్ ఇమ్రాన్ ఆలీ తెలిపారు.
ఈ సందర్భంగా టీజీఎంసీ వైస్ చైర్మన్ డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. సోషల్ మీడియా ద్వారా చాలా మంది అర్హత లేకపోయినా డాక్టర్లుగా చెలామణి అవుతూ బీపీ, షుగర్ లాంటి వ్యాధులకు సలహాలిస్తూ ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నారని చెప్పారు. కొందరు అమాయకులు వారి సలహాలను పాటించి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని చెప్పారు. నకిలీ డాక్టర్ల సలహాలు పాటించొద్దని ఆయన ప్రజలకు సూచించారు.