ఆర్ఎంపీ, పీఎంపీ క్లినిక్​లలో తనిఖీలు

ఆర్ఎంపీ, పీఎంపీ క్లినిక్​లలో తనిఖీలు

చేర్యాల, వెలుగు : మండల కేంద్రంలోని ఆర్​ఎంపీ, పీఎంపీ క్లినిక్​లలో మంగళవారం తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యుడు (టీజీఎంసీ) బండారి రాజ్​కుమార్ తనిఖీలు నిర్వహించారు. పెద్దమ్మ గడ్డ ఏరియాలో జి. రామచంద్రం, భాస్కర్​, మద్దూరు మండల కేంద్రంలోని శ్రీశైలం యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్లు ఇస్తున్నట్లు గుర్తించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్ట ప్రకారం విద్యార్హత లేకున్నా అల్లోపతి వైద్యం చేసినందుకు వీరిపై కేసు నమోదు చేస్తామని తెలిపారు.

ఇలాంటి నకిలీ వైద్యులపై ఇప్పటివరకు 400 ఎఫ్​ఐఆర్​లు నమోదయ్యాయని వీరందరిని త్వరలో కోర్టులో హాజరుపరుస్తామన్నారు. రాష్ట్ర వైద్య మండలికి సంబంధించి 30 బృందాలు ప్రతి జిల్లాలో, ప్రతి గ్రామంలో  ఆర్ఎంపీ, పీఎంపీ క్లినిక్​లలో తనిఖీలు నిర్వహిస్తున్నాయని, పరిమితికి మించి వైద్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్షర, వెంకటసాయి హాస్పిటల్స్​ను సందర్శించి తెలంగాణ స్టేట్​ మెడికల్​ కౌన్సిల్​లో రిజిస్ర్టేషన్​ చేయించుకున్న వైద్యులతోనే రోగులకు వైద్యం చేయించాలని యాజమాన్యాలకు సూచించారు. ఆయన వెంట డాక్టర్​గౌతమ్ ఉన్నారు.