- ప్రజాపాలన దినోత్సవం దేనికి సంకేతం: కూనంనేని
- చరిత్రను వక్రీకరించొద్దు.. ధైర్యంగా నిజాలు రాయాలి
- కమ్యూనిస్టుల త్యాగం, పోరాటాన్ని గుర్తించాలని డిమాండ్
- సీపీఐ ఆఫీసులో ఘనంగా తెలంగాణ విలీన దినోత్సవ వేడుకలు
హైదరాబాద్, వెలుగు: ప్రజాపాలన దినోత్సవం పేరుతో ఆనాటి పోరాటం ఉనికిలో లేకుండా పోయే ప్రమాదముందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాపాలన దినోత్సవం దేనికి సంకేతమని, పోరాటానికా? విలీనానికా? అని ప్రశ్నించారు. హైదరాబాద్ లోని సీపీఐ స్టేట్ ఆఫీస్లో మంగళవారం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం 76వ వార్షికోత్సవం, తెలంగాణ విలీనం దినోత్సవ వేడుకలను నిర్వహించారు.
ఈ సందర్భంగా సీపీఐ జాతీయ కార్యదర్శి సయ్యద్ అజీజ్ పాషాతో కలిసి కూనంనేని జాతీయ జెండా, ఎర్ర జెండాను ఎగుర వేశారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమర వీరులకు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కమ్యూనిస్టుల సారథ్యంలో ప్రజలు ఆయుధాలు పట్టుకుని రైతాంగ సాయుధ పోరాటంలో భాగస్వాములు అయ్యారన్నారు. చరిత్రను వక్రీకరిస్తే కనుమరుగై పోదన్నారు. కమ్యూనిస్టు పార్టీని చూసి పాలక పార్టీలు భయపడుతున్నాయన్నారు. ఆ భయంతోనే విమోచన దినమని, సమైక్యతా దినమని, ప్రజాపాలన దినోత్సవమని రకరకాల పేర్లు పెట్టుకుంటున్నాయని మండిపడ్డారు.
ధైర్యంగా చరిత్రను చరిత్రగా రాయాలని, అందులో కమ్యూనిస్టుల త్యాగాలు, పోరాటాలను పేర్కొన్నాలని, ఇతరుల త్యాగాలను గుర్తించాలని, వాటిని పాఠ్యాంశంలో చేర్చాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ విలీన దినోత్సవం పేరుతోనే ఉత్సవాలను నిర్వహించాలన్నారు. సీపీఐ జాతీయ కార్యదర్శి అజీజ్ పాషా మాట్లాడుతూ.. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ద్వారా మూడోంతుల తెలంగాణ ప్రాంతం కమ్యూనిస్టుల ఆధీనంలోకి వచ్చిందని గుర్తు చేశారు.