హైదరాబాద్, వెలుగు: ఉస్మానియా, గాంధీ దవాఖాన్ల అభివృద్ధి కోసం సీఎస్‌ఆర్ ఫండ్స్ కేటాయించాలని ఫార్మా కంపెనీలను ఆరోగ్య మంత్రి దామోదర రాజనర్సింహా కోరారు. సోమవారం సెక్రటేరియెట్‌లో ఫార్మా కంపెనీల ప్రతినిధులతో మంత్రి భేటీ అయ్యారు.
సీఎస్‌ఆర్ ఫండ్స్‌లో సింహా భాగాన్ని దవాఖాన్ల అభివృద్ధికి, వైద్యసేవలు మెరుగుపర్చేందుకు కేటాయిస్తామన్నారు. బాలికల విద్య, వైద్యం కోసం కూడా నిధులు ఇవ్వాలని కోరారు. ఉస్మానియా, గాంధీ దవాఖాన్లను దర్శించి ఎవరేం పనులు చేయగలరో వివరాలతో రావాలని మంత్రి సూచించారు. సమావేశంలో డీఎంఈ వాణి, ఉస్మానియా సూపరింటెండెంట్ నాగేందర్, గాంధీ సూపరింటెండెంట్ రాజారావు తదితరులు పాల్గొన్నారు.