- మెడిసిన్ చదువుకు అవసరమయ్యే డబ్బులు, పుస్తకాలు, బట్టలు అందజేత
- ఏ ఇబ్బంది ఉన్నా అండగా ఉంటానని భరోసా
హైదరాబాద్, వెలుగు : ఎంబీబీఎస్ సీటొచ్చినా.. ఆర్థిక స్థోమత లేక కూలి పనులకు వెళ్తున్న ఓ నిరుపేద విద్యార్థినికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అండగా నిలిచారు. ఆమె చదువులకు కావాల్సిన ఆర్థిక సాయాన్ని అందజేశారు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం సలాబత్ పూర్ గ్రామానికి చెందిన కాట్రోజు సుమలత మెడిసిన్‌లో ఉత్తమ ర్యాంక్ సాధించింది. ఫీజులు కట్టేందుకు ఆర్థిక స్థోమత లేక కూలీ పనికి వెళ్తున్నది. ఈ విషయం తెలుసుకున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి చలించిపోయారు. వెంటనే వారిని పిలిపించుకుని మాట్లాడారు.
తాను సుమలతకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా ఈ ఏడాది చదువులకు కావాల్సిన ఆర్థిక సాయంతోపాటు పుస్తకాలు, బట్టలు ఇతర ఖర్చులకూ డబ్బులు అందజేశారు. మంచిగా చదువుకొని డాక్టర్ గా పేద ప్రజలకు సేవ చేయాలని ఆశీర్వదించారు.. ఏ ఇబ్బంది ఉన్నా తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. భావోద్వేగానికి గురైన సుమలత, ఆమె తండ్రి శివరాం.. మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. కాగా, రాష్ట్ర ప్రజలకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాపాలనపై విషం చిమ్ముతున్న అజ్ఞానులకు జ్ఞానదీపం వెలిగేలా లక్ష్మీదేవి ఆశీర్వదించాలని అన్నారు.