8 వేల కోట్లకుపైగా పెట్టుబడులకు పలు కంపెనీల సంసిద్ధత
హైదరాబాద్, వెలుగు: మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటన ముగిసింది. ఈ నెల 19న అధికారులతో కలిసి అమెరికా బయల్దేరిన ఆయన 20న లాస్ ఏంజిలిస్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి శాన్‌డియాగో, శాన్‌జోస్, బోస్టన్ మీదుగా న్యూయార్క్ చేరుకున్నారు. ఆదివారం తన అధికారిక పర్యటన ముగించుకొని న్యూయార్క్ నుంచి హైదరాబాద్‌కు తిరుగు పయనమయ్యారు. ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఎలక్ట్రికల్ వెహికల్, ఫిష్ ప్రాసెసింగ్, ఐటీ సంస్థలు తెలంగాణలో రూ. 8 వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాయి. పలు సంస్థలు ఎంత మొత్తంలో పెట్టుబడి పెట్టబోతున్నది స్పష్టతనివ్వగా.. మరికొన్ని సంస్థలు ఎంత మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించబోయేది పేర్కొన్నాయి. న్యూయార్క్‌లోని అడ్వెంట్ ఇంటర్నేషనల్ కంపెనీ హెడ్ క్వార్టర్స్‌ను శనివారం మంత్రి కేటీఆర్ సందర్శించి సంస్థ మేనేజింగ్ పార్ట్‌నర్ జాన్ మాల్డోనాడ్తో సమావేశమయ్యారు. హైదరాబాద్‌లో తమ సంస్థ కార్యకలాపాలు రూ.1,750 కోట్లతో విస్తరిస్తామని జాన్ మాల్డోనాడ్ తెలిపారు. న్యూజెర్సీ కేంద్రంగా పనిచేస్తున్న స్లేబ్యాక్ ఫార్మా ఫౌండర్, సీఈవో అజయ్‌సింగ్ హైదరాబాద్‌లో రూ.150 కోట్ల పెట్టుబడి పెడుతామని కేటీఆర్‌తో భేటీ సందర్భంగా ప్రకటించారు. హైదరాబాద్‌లోని జీనోమ్ వ్యాలీలో యునైటెడ్ స్టేట్స్ ఫార్మకోపియా రూ.1,525 కోట్లతో అధునాతన ల్యాబ్ ఏర్పాటు చేసి ఔషధాలు తయారు చేసే కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపింది. ఫార్మకోపియా చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ స్టాన్ బుర్హాన్స్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కేవీ నరేంద్రనాథ్ మంత్రి కేటీఆర్‌తో సమావేశం అనంతరం పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చారు.