- 2050 మాస్టర్ ప్లాన్‌తో ముందుకెళ్తాం
- ఫార్మా సిటీ, ఐటీ, ఎయిర్‌పోర్ట్, అండర్ డ్రైనేజీ నిర్మిస్తాం
- వరంగల్‌లో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‍రెడ్డి
వరంగల్, వెలుగు: వరంగల్‌ను రాష్ట్ర రెండో రాజధానిగా అభివృద్ధి చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని ఉమ్మడి వరంగల్ ఇన్‌చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గురువారం వరంగల్‌లో జరిగిన వేడుకలకు ఆయన హాజరై జెండాను ఆవిష్కరించారు. అనంతం మంత్రి మాట్లాడుతూ 2050 జనాభా, అవసరాలను దృష్టిలో పెట్టుకుని వరంగల్ మాస్టర్ ప్లాన్‌ను రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఇందులో ఫార్మా సిటీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఐటీ సర్వీసెస్, మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లు, ఎకో టూరిజం, ఎడ్యుకేషన్ ఇన్స్‌స్టిట్యూషన్లు, ఎయిర్‌పోర్ట్, స్టేడియం, లాజిస్టిక్స్ పార్క్, టూరిజం వంటి అంశాల ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్డు పనులను యుద్ధప్రాతిపదికన చేపడుతున్నామన్నారు.
ఎయిర్‌పోర్ట్ నిర్మాణంతో పాటు సెంట్రల్ జైల్ స్థలంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనులను స్పీడప్ చేశామన్నారు. నర్సంపేటలో ఈ ఏడాది నుంచి మెడికల్ కాలేజీ, హాస్పిటల్ సేవలు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. వరంగల్ నగరంలో వరద ముంపు సమస్య రాకుండా నాలాలను విస్తరిస్తామని చెప్పారు. వరంగల్ పాత బస్టాండ్ స్థానంలో కొత్తది, రూ.80 కోట్లతో వరంగల్ కలెక్టరేట్ పనులను చేపడుతున్నట్లు తెలిపారు. వనమహోత్సవంలో భాగంగా జిల్లాలో 25 లక్షల మొక్కలు నాటినట్లు వివరించారు. సెప్టెంబర్ 9న సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా కాళోజీ కళాక్షేత్రాన్ని ప్రారంభిస్తామన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ సత్యశారద, మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కేఆర్.నాగరాజు, కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామిరెడ్డి, డీసీపీ రవీంద పాల్గొన్నారు.