- ఫీజిబిలిటీ ఉంటే ఏర్పాటు చేస్తం: మంత్రి పొంగులేటి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కొత్తగా రెవెన్యూ డివిజన్లు, మండలాలు కావాలని ప్రజాప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారని, అధికారులు కూడా ప్రతిపాదనలు చేస్తున్నారని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఫీజిబిలిటీ ఉంటే తప్పకుండా కొత్తవి ఏర్పాటు చేస్తామన్నారు. అసెంబ్లీలో క్వశ్చన్ అవర్‌లో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం చెప్పారు.
ఆయన మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చివరి నిమిషంలో రాజకీయ ప్రయోజనాల కోసం మండలాలు, రెవెన్యూ డివిజన్లు ప్రకటించారని, ఇప్పటికీ అక్కడ ఆఫీసులు, క్యాడర్ స్ట్రెంత్ లేదన్నారు. అశాస్త్రీయంగా జిల్లాలను ఏర్పాటు చేయడంతో కొన్ని నియోజకవర్గాలు రెండు మూడు జిల్లాల్లో ఉన్నాయన్నారు.
నాలుగైదు మండలాలు కలిపి ఒక జిల్లా చేశారు: మంత్రి కోమటిరెడ్డి
గత బీఆర్ఎస్ ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను ముక్కలు చేసిందని, రాష్ట్రంలో నాలుగైదు మండలాలు కలిపి ఒక జిల్లాగా చేసిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. చేర్యాలను డివిజన్‌గా చేయాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాల గడ్డ చేర్యాల ప్రాంతమని, అది ఒకప్పుడు అసెంబ్లీ నియోజకవర్గంగా ఉండేదని గుర్తుచేశారు. చేర్యాలను గత బీఆర్ఎస్ సర్కారు ముక్కచెక్కలు చేసిందని, ఫలితంగా ఆ ప్రాంత ప్రజలు వివిధ పనుల కోసం హుస్నాబాద్, గజ్వేల్, సిద్ధిపేట కలెక్టరేట్‌కు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు.