హైదరాబాద్ సిటీ, వెలుగు: నగరంలో ఆహ్లాదకర వాతావరణం కల్పించేందుకు పెద్ద ఎత్తున బ్యూటిఫికేషన్, పార్కుల అభివృద్ధి చేపట్టినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సోమవారం పలు ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతారెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబరితితో కలిసి ప్రారంభించారు. జూబ్లీహిల్స్ రోడ్ నెం.10లో రూ.32 లక్షలతో చిల్డ్రన్ లెర్నింగ్, ప్లే పార్కు, రూ.2.82 కోట్లతో ఎన్ఎఫ్ సీ జంక్షన్ అభివృద్ధి, రూ. 3.80 కోట్లతో పంజాగుట్ట ఫ్లైఓవర్ బ్యూటిఫికేషన్, రూ.3.15 కోట్లతో సోమాజిగూడ జంక్షన్ అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించారు.
మంత్రి మాట్లాడుతూ... నగర ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం కల్పించేందుకు జంక్షన్ల అభివృద్ధి, ఫ్లైఓవర్ల కింద వర్టికల్ గార్డెన్ల ఏర్పాటు, భావితరాలకు స్ఫూర్తినిచ్చేలా పెయింటింగ్ వేయిస్తున్నామన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను మరింత పెంపొందించేలా జంక్షన్లను తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి, ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి, సోమాజిగూడ కార్పొరేటర్ సంగీత యాదవ్, ఎస్ఇ రత్నాకర్, ఈఈ లు విజయ్ కుమార్, వెంకట నారాయణ పాల్గొన్నారు.