హైదరాబాద్, వెలుగు: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నాసిక్ జిల్లా చంద్వాడ్ నియోజకవర్గంలో మంత్రి, సీనియర్ అబ్జర్వర్ సీతక్క పర్యటించారు. కాంగ్రెస్ అభ్యర్థి శిరీష్ కొత్వాల్తో కలిసి ద్రాక్ష, ఉల్లి రైతులతో సీతక్క భేటీ అయ్యారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వర్షాలతో పంటలు నష్టపోయినా మహారాష్ట్ర ప్రభుత్వం తమను ఆదుకోలేదని స్థానిక రైతులు వాపోయారు.
ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ, రైతు వ్యతిరేక బీజేపీని, షిండే ప్రభుత్వాన్ని ఓడించాలని పిలుపునిచ్చారు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించని ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలన్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే కాంగ్రెస్ అభ్యర్థి శిరీష్ కొత్వాల్ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, దూలే పట్టణంలోనూ సీతక్క రోడ్ షో నిర్వహించారు.