హైదరాబాద్, వెలుగు: అంగన్వాడీ సెంటర్లలో చిన్నారుల కోసం అల్పాహార పథకాన్ని అమలు చేసేందుకు కేంద్రం నుంచి నిధులు ఇవ్వాలని కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణదేవిని రాష్ట్ర మంత్రి సీతక్క కోరారు. సోమవారం ఢిల్లీలో టీజీ ఫుడ్స్ చైర్మన్ ఎంఏ ఫహీం, ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ కమిషనర్ కాంతి వెస్లీతో కలిసి మంత్రి సీతక్క కేంద్ర మంత్రిని కలిశారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలతో పాటు.. అంగన్ వాడీ చిన్నారులకు బ్రేక్ ఫాస్ట్ అవసరాన్ని మంత్రి, అధికారులు ఆమెకు వివరించారు. ఐసీడీఎస్ ద్వారా మహిళలు, పిల్లలకు సంపూర్ణ పోషణను అమలు చేయడంలో తెలంగాణ అగ్రగామిగా ఉందని కేంద్ర మంత్రి దృష్టికి సీతక్క తీసుకెళ్లారు.
ప్రస్తుతం 3 నుంచి 6 సంవత్సరాల వయసు గల 8.6 లక్షల మంది పిల్లలకు సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రాం ద్వారా పూర్తి వేడి భోజనంతో పాటు గుడ్డు, స్నాక్స్ అందజేస్తున్నామని తెలిపారు. అయితే, కరోనా తర్వాత పలువురు చిన్నారులు పోషకార లోపంతో బాధపడుతున్నారని, వారి కోసం బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ ను స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. ఈ స్కీం వల్ల ప్రతిరోజూ అదనపు పోషకాహారం అందుకుంటారని చెప్పారు.
కాగా, ఈ స్కీం ప్రతిపాదనను కేంద్రమంత్రి అన్నపూర్ణాదేవి ప్రశంసించారు. చిన్నారులకు అల్పాహారం అందించే ఆలోచన చేయడం గొప్ప విషయమని రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించారు. బడ్జెట్ సమావేశాల్లో చర్చించి నిధుల మంజూరుకు కృషి చేస్తామని హమీ ఇచ్చారు. త్వరలో తెలంగాణలో తాను పర్యటించి.. మహిళా శిశు సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలను అధ్యయనం చేస్తామని సీతక్కకు కేంద్ర మంత్రి అన్నపూర్ణదేవి స్పష్టం చేశారు. తమ ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రికి మంత్రి సీతక్క ధన్యవాదాలు తెలిపారు.