
- భవిష్యత్ తరాలకు సుస్థిరాభివృద్ధిని అందించేందుకే ఫ్యూచర్ సిటీ: మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్, వెలుగు: ఉగాది పండుగ తర్వాత ఏఐ సిటీకి మహేశ్వరంలో భూమి పూజకు ఏర్పాట్లు చేస్తున్నామని ఐటీ, ఇండస్ట్రీస్ శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. భవిష్యత్ తరాలకు సుస్థిరాభివృద్ధిని అందించడమే లక్ష్యంగా ఫ్యూచర్ సిటీని నిర్మించనున్నామని చెప్పారు. అందులోనే 200 ఎకరాల్లో ఏఐ సిటీని నిర్మిస్తామన్నారు. శుక్రవారం ఐటీసీ కోహినూర్‌లో నిర్వహించిన ‘క్లియర్‌టెలిజెన్స్’ ఇండియా డెలివరీ అండ్ఆపరేషన్స్సెంటర్ను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఏఐ సిటీలో పెట్టుబడులకు ఇప్పటికే అనేక దిగ్గజ సంస్థలు ఆసక్తి వ్యక్తం చేశాయన్నారు.
ఎమర్జింగ్టెక్నాలజీస్కు తెలంగాణ హబ్‌గా మారుతుందన్నారు. డేటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ వంటి టెక్నాలజీస్‌లో ఇప్పటికే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాలను ప్రారంభించామన్నారు. త్వరలోనే క్వాంటం కంప్యూటింగ్‌లోనూ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. టెక్నాలజీ అంటేనే ప్రపంచం హైదరాబాద్ వైపు చూసేలా చేయడమే తమ లక్ష్యమన్నారు. పారిశ్రామిక వేత్తలు ఎదిగితే.. రాష్ట్రం కూడా వృద్ధి చెందుతుందన్నారు. ప్రతిభ గల యువతే తెలంగాణకున్న అతిపెద్ద ఆస్తి అని మంత్రి పేర్కొన్నారు. రోజురోజుకు మారుతున్న టెక్నాలజీ కారణంగా అనేక సవాళ్లు తలెత్తుతున్నాయని, వాటికి పరిష్కారాలను కనుక్కునేందుకు కొత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉందని అన్నారు.
కొత్త ఆవిష్కరణల ప్రోత్సాహానికి తమ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందన్నారు. ఏఐ, డేటా ఇంజనీరింగ్, బిజినెస్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ సొల్యూషన్స్ తదితర రంగాల్లో సేవలు అందించే క్లియర్‌టెలిజెన్స్ ఇక్కడ ఓ బ్రాంచ్‌ను ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు. కాగా, ఈ కార్యక్రమంలో క్లియర్‌టెలిజెన్స్ సీఈవో ఓవెన్ ఫ్రివోడ్, మేనేజింగ్ పార్ట్ నర్ అనిల్ భరాడ్వా, డైరెక్టర్ మురళి తదితరులు పాల్గొన్నారు.