కన్నబిడ్డల్లా చూసుకుంటాం.. మూసీ నిర్వాసితులకు మంత్రి శ్రీధర్ బాబు భరోసా

కన్నబిడ్డల్లా చూసుకుంటాం.. మూసీ నిర్వాసితులకు మంత్రి శ్రీధర్ బాబు భరోసా

హైదరాబాద్: మూసీ నిర్వాసితులకు మంత్రి శ్రీధర్ బాబు భరోసా ఇచ్చారు. బాధితులందరికీ న్యాయం చేస్తామని ప్రకటించారు. పేదవాళ్లను కాపాడే బాధ్యత తమ ప్రభుత్వానిదేనని తెలిపారు. సొంత నివాసం లేనివాళ్లకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పారు. బాధితులందరినీ కన్నబిడ్డల్లా చూసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ప్రపంచంలోనే బెస్ట్ సిటీగా నగరాన్ని తీర్చిదిద్దుతామని చెప్పారు. మూసీ నిర్వాసితులకు భరోసా ఇస్తున్నామని, నిర్వాసితులందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామని మంత్రి స్పష్టం చేశారు.

ALSO READ | హైడ్రా కూల్చివేతలపై MLA దానం సంచలన వ్యాఖ్యలు

గోదావరి నీటిని మూసీలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని.. మూసీ ఈస్ట్, వెస్ట్ కారిడార్ల నిర్మాణం, లింకు రోడ్ల ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. పీపీపీ (పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్) కింద ఈ ప్రాజెక్టును చేపట్టబోతున్నామని మంత్రి శ్రీధర్ బాబు వివరించారు. దాదాపు 12 ఎన్జీవోలతో ప్రభుత్వం మాట్లాడిందని పేర్కొన్నారు. నిర్వాసితులకు ఇండ్లతో పాటు ఉపాధి కల్పించే బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకుంటుందని మంత్రి స్పష్టం చేశారు. మూసీ నిర్వాసితులను ఆదుకునేందుకు హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ప్రభుత్వ పథకాల్లో కూడా నిర్వాసితులకు ప్రియారిటీ ఇవ్వనున్నట్లు తెలిపారు. నిర్వాసితులకు న్యాయం చేసిన తర్వాతే మూసీ ప్రక్షాళన మొదలవుతుందని, మూసీలో శుద్ధి నీరు ప్రవహించే ప్రణాళికలు చేస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు.