![లెదర్ పార్క్‌లకు సహకరించండి : మంత్రి శ్రీధర్ బాబు](https://static.v6velugu.com/uploads/2025/02/telangana-minister-sridhar-babu-seeks-central-support-for-mega-leather-parks_cD7bZHnhtY.jpg)
- కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌కు రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు విజ్ఞప్తి
- జహీరాబాద్ నోడ్ కు నిధులు రిలీజ్ చేయాలని వినతి
న్యూఢిల్లీ, వెలుగు: కరీంనగర్ జిల్లా రుక్మాపూర్, జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్‌లో మెగా లెదర్ పార్కుల ఏర్పాటుకు సహకరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కోరారు. శుక్రవారం ఢిల్లీలో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తో మంత్రి శ్రీధర్ బాబు భేటీ అయ్యారు. దాదాపు అరగంటకు పైగా సాగిన ఈ సమావేశంలో రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి, పెట్టుబడులు, ఇతర అంశాలపై చర్చించారు.
జహీరాబాద్ నోడ్ అభివృద్ధిపై కేంద్ర మంత్రితో మాట్లాడారు. ప్రస్తుతం ఈ నోడ్ పురోగతిని వివరించారు. మిగిలిన అనుమతులు మంజూరు చేయాలని, నిధులను త్వరితగతిన రిలీజ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ భేటీలో ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి, భవన్ రెసిడెంట్ కమిషనర్ డా.గౌరవ్ ఉప్పల్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
బయో ఏషియా-2025కి రండి..
హైదరాబాద్‌లో ఈ నెల 26న నిర్వహించనున్న బయోఏషియా–2025 కార్యక్రమానికి రావాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు మంత్రి శ్రీధర్ బాబు ఆహ్వానం అందించారు. జీవవిజ్ఞాన రంగంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశోధకులు, పాలసీ మేకర్లు, పారిశ్రామిక నిపుణులు ఈ వేదికపైకి రాబోతున్నట్లు వివరించారు.
పెట్టుబడులను ఆకర్షించేందుకుఈ ఏడాది జపాన్ లో జరిగే ఓసాకా ఎక్స్పో-2025లో తెలంగాణ ప్రభుత్వం పాల్గొంటుందని కేంద్ర మంత్రికి వివరించారు. ఈ అంతర్జాతీయ వేదికగా తెలంగాణ రాష్ట్ర పెట్టుబడులు, పరిశ్రమల సామర్థ్యాన్ని ప్రదర్శించినున్నట్లు తెలిపారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి రాసిన లేఖను కేంద్ర మంత్రికి అందజేశారు.