రైతులను తొక్కించి చంపినోళ్లా నీతులు చెప్పేది?

రైతులను తొక్కించి చంపినోళ్లా నీతులు చెప్పేది?
  • చేతనైతే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రుణమాఫీ చేసి చూపించండి: మంత్రి తుమ్మల
  • దమ్ముంటే రైతుల కోసం జంతర్​ మంతర్​ వద్ద ధర్నా చేయాలి
  • 10 నెలల్లో రూ.18 వేల కోట్లు మాఫీ చేసింది కనిపిస్తలేదా?
  • మోదీతో మాట్లాడి రాష్ట్ర హక్కులను సాధించే సత్తా ఉన్నదా?
  • రూ.2 లక్షలకుపైగా రుణం ఉన్న వారికి షెడ్యూల్​ ప్రకటిస్తం
  • ఈ ఏడాదిలోనే పూర్తి రుణమాఫీ చేసి తీరుతామని వెల్లడి

హైదరాబాద్​, వెలుగు: ‘‘రైతులను తొక్కించి చంపినోళ్లు ఇప్పుడు నీతులు చెబుతారా?’’ అంటూ బీజేపీ నేతలపై మంత్రి తుమ్మల నాగేశ్వర్​రావు ఫైర్ అయ్యారు. బీజేపీ నేతలకు చేతనైతే.. రైతులపై ప్రేమ ఉంటే.. ఆ పార్టీ పాలిత రాష్ట్రాల్లో రైతుల రుణాలు మాఫీచేసి చూపించాలని సవాల్ చేశారు. సెక్రటేరియెట్​లో మంగళవారం తుమ్మల మీడియాతో మాట్లాడారు. రైతుల గురించి బీజేపీ మాట్లాడడమంటేనే అదో వింత అని ఎద్దేవా చేశారు.

పదేండ్లుగాఈ దేశాన్ని పరిపాలిస్తున్న బీజేపీ.. నల్ల చట్టాల రద్దు, ఇతరత్రా డిమాండ్ల సాధన కోసం లక్షలాది మంది రైతులు రోడ్ల మీదికి వచ్చి..  ఢిల్లీ శివార్లలో వందలాది మంది బలైపోయినా.. కనీసం పరామర్శించలేదని, ఇప్పుడు వారే రైతుల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉన్నదని అన్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పిన కేంద్రంలోని బీజేపీ సర్కారు దగా చేసిందని ఆరోపించారు. ఎంఎస్​పీ పెంచుతామని, స్వామినాథన్​ కమిటీ సిఫారసులను అమలు చేస్తామని రైతులను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిందన్నారు.  

సిఫారసులకు దూరంగా ఎంఎస్​పీ ప్రకటించడంతో ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే రైతులు రూ.2 లక్షల కోట్లు నష్టపోయారని తెలిపారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తమ​ ప్రభుత్వం మొదటి పంట కాలంలోనే ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యకరంగా లేక పోయినా  రాహుల్​గాంధీ వరంగల్​లో ఇచ్చిన మాటకు కట్టుబడి రుణమాఫీ చేస్తు న్నదని తెలిపారు. ఇప్పటి వరకు 3 విడతలుగా రూ.18 వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేసిన ఏకైన సర్కారు తమదేనని చెప్పారు. గత ప్రభుత్వం ఇవ్వని రైతుబంధు రూ.7, 656 కోట్లు రైతుల ఖాతాల్లో వేశామన్నారు. ఇలాంటి రాష్ట్ర ప్రభుత్వానికి సహకారం అందించాల్సింది పోయి రుణమాఫీ కాలేదని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. పది నెలల్లో 18 వేల కోట్లు మాఫీ చేసినా బీజేపీ నేతలకు కనిపిస్తలేదా? అని మంత్రి ప్రశ్నించారు.

ఈ ఏడాదిలోనే రుణమాఫీ ప్రక్రియ పూర్తి

ఈ ఏడాదిలోనే రూ.31వేల కోట్ల పంట రుణాలను మాఫీ చేసి తీరుతామని మంత్రి తుమ్మల తెలిపారు.  తామెప్పుడు 42 లక్షల మందికి రుణమాఫీ చేశామని చెప్పలేదన్నారు. రాష్ట్రంలో 69 లక్షల నుంచి 70 లక్షల వరకు రైతులు ఉండగా.. 2018 డిసెంబరు 11 నుంచి  2023 డిసెంబర్​ 9 వరకు కటాఫ్​​ డేట్​ పెట్టి.. గత బీఆర్ఎస్​ కాలంలోని పంటరుణాల ఖాతాలకు సైతం మాఫీ చేయాలని బ్యాంకులకు సమాచారం ఇచ్చామని చెప్పారు.

గత ఐదేండ్లలో పంట రుణం తీసుకున్న రూ.31 వేల కోట్ల రుణాలకు సంబంధించిన  42 లక్షల  ఖాతాలను బ్యాంకులు ప్రభుత్వానికి పంపించాయని తెలిపారు. తాము ప్రకటించినట్టు రూ.2లక్షల లోపు రుణాలను కేవలం  26 రోజుల్లోనే  ఆగస్టు 15 వరకు రూ.18 వేలకోట్లు 22 లక్షల మంది రైతుల క్రాప్​లోన్​ ఖాతాల్లో జమచేసినట్టు చెప్పారు. కుటుంబ నిర్ధారణ కాని రైతులను నిర్ధారించే కార్యక్రమం చేపట్టామనీ, వారిని నిర్ధారించి మాఫీ నిధులు వేస్తామని తెలిపారు. రూ.2 లక్షలకు పైగా రుణం ఉన్న  రైతులకు షెడ్యూల్​ ప్రకటిస్తామని చెప్పారు. రూ.2లక్షలకుపైగా  ఎంత రుణం ఉంటే అంత మొత్తం చెల్లిస్తే వెంటనే ఆ రూ.2 లక్షలు ప్రభుత్వం మాఫీ చేస్తుందని స్పష్టం చేశారు. తాము రుణమాఫీ చేస్తుంటే బీజేపీకి వచ్చిన నష్టమేంటని ప్రశ్నించారు. 

రైతులను పావులుగా వాడుకోవద్దు

బీజేపీ తప్పుడు స్థలంలో ధర్నా మొదలు పెట్టిందని,  ఈ దేశ రైతాంగానికి సంబంధించిన సమస్యల పట్ల ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయాలని మంత్రి తుమ్మల అన్నారు.  రాజకీయ పదవుల కోసం  రైతులను పావులుగా వాడుకోవద్దని సూచించారు. ‘‘వివిధ పథకాలకు కేంద్రం నుంచి రూ.2,700 కోట్లు రావాల్సి ఉంటే రూ.1300 కోట్లు ఇచ్చారు. ప్రధాని మోదీతో మాట్లాడి తెలంగాణ హక్కులు సాధించే దమ్మున్నదా?” అని బీజేపీ నేతలను ప్రశ్నించారు. తాము అధికారంలోకి వచ్చిన 10  నెలల్లో మొదటి పంట కాలంలోనే బాకీ ఉన్న రైతుబంధు, రైతు బీమా చెల్లించామని చెప్పారు.  పంట నష్టానికి ప్రత్యేకంగా తామే ప్రీమియం కట్టి ఫసల్​ బీమాలో చేరామని తెలిపారు.  పీఎం కిసాన్​ యోజన కింద ఇచ్చే మొత్తాన్ని చిత్తశుద్ధి ఉంటే ఎకరానికి రూ.7500 కు పెంచాలని డిమాండ్​ చేశారు.  ఆరు నెలల్లోనే రాష్ట్ర సర్కారు రుణమాఫీకి రూ.18వేల కోట్లు, రైతుబంధుకు రూ.7500 కోట్లు ఇచ్చి.. రూ.25 వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేస్తే బీజేపీ నేతలకు ఇంటిదగ్గర నిద్రపట్టడం లేదని తుమ్మల ఎద్దేవా చేశారు.