
- తెలంగాణకు అన్యాయం జరగకుండా చూడాలి: మంత్రి ఉత్తమ్
- శ్రీశైలం, సాగర్ నుంచి ఏపీ అక్రమంగా నీటిని తోడేస్తున్నది
- మేడిగడ్డపై ఎన్డీఎస్ఏ రిపోర్టును త్వరగా ఇప్పించాలని విజ్ఞప్తి
- స్టేట్‌వాటర్ మినిస్టర్స్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న మంత్రి
హైదరాబాద్, వెలుగు: కృష్ణా జలాలకు సంబంధించి తెలంగాణ, ఏపీ మధ్య నెలకొన్న వివాదాలపై కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని ఇరిగేషన్‌శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. నీటి వాటాల్లో తెలంగాణకు అన్యాయం జరగకుండా చూడాలని కోరారు. తెలంగాణకు న్యాయం జరిగేలా నీటి కోటాలను తేల్చి, కృష్ణా ట్రిబ్యునల్ త్వరగా తీర్పునిచ్చేలా కేంద్రం జోక్యం చేసుకుంటే బాగుంటుందన్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ నుంచి ఏపీ అక్రమంగా నీటిని మళ్లించుకుపోతున్నదని.. కేంద్రం దాన్ని అడ్డుకోవాలని కోరారు.
కృష్ణా నదిపై టెలిమెట్రీలను ఏర్పాటు చేయాలని, అప్పుడే ఏ రాష్ట్రం ఎంత మేర నీటిని వాడుకుంటున్నదో లెక్క తేలుతుందని తేల్చి చెప్పారు. మంగళవారం రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రెండో ‘ఆలిండియా స్టేట్వాటర్మినిస్టర్స్కాన్ఫరెన్స్–2025’లో ఉత్తమ్ పాల్గొన్నారు. తెలంగాణ తరఫున ‘నీటి నిల్వ సౌలతులు, సరఫరా వ్యవస్థల బలోపేతం’ అనే అంశంపై ఆయన ప్రజెంటేషన్ ఇచ్చారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి కేంద్రానికి పలు డిమాండ్లు చేశారు. పాలమూరు–రంగారెడ్డి లిఫ్ట్స్కీమ్, సమ్మక్క సాగర్, సీతారామ సాగర్ప్రాజెక్టులకు వీలైనంత త్వరగా నీటి కేటాయింపులను చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పలు ప్రాజెక్టులకు తక్కువ వడ్డీ రేట్లతో దీర్ఘకాలిక రుణాలు ఇచ్చేలా చూడాలన్నారు.
మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనపై నేషనల్ డ్యామ్‌సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) త్వరగా రిపోర్టు ఇచ్చేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. కొన్ని నెలలుగా ఎన్డీఎస్ఏ విచారణ చేస్తూనే ఉన్నదని, ఇప్పటికీ నివేదిక ఇవ్వలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్డీఎస్ఏ త్వరగా నివేదిక ఇచ్చేలా కేంద్ర జలశక్తి శాఖ జోక్యం చేసుకోవాలన్నారు. మేడిగడ్డపై ఎలా ముందుకెళ్లాలో త్వరగా తేల్చాలన్నారు.
మూసీ ప్రాజెక్టుకు 10 వేల కోట్లు ఇవ్వండి..
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుకు 10 వేల కోట్ల నిధులివ్వాలని కేంద్రాన్ని ఉత్తమ్ డిమాండ్ చేశారు. ప్రాజెక్టుల్లో పూడికతీతపై కేంద్రం గైడ్‌లైన్స్‌కు అనుగుణంగా ముందుకు వెళ్తున్నామని చెప్పారు. దానికి నిధులు ఇవ్వాలని కోరారు.