జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనుంది. ఇందులో భాగంగా నలుగురు మంత్రుల బృందం శుక్రవారం మేడిగడ్డ బ్యారేజీని సందర్శించనుంది. ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డితో పాటు మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో మేడిగడ్డకు చేరుకుంటారు. ఈ నేపథ్యంలో మేడిగడ్డ దగ్గర ఇరిగేషన్ శాఖ, ఎల్ అండ్ టీ కంపెనీ ఏర్పాట్లు చేశాయి. హెలీప్యాడ్‌ను సిద్ధం చేశారు. మహాదేవపూర్ మండలంలోని అంబటిపల్లి వద్ద ఎల్అండ్ టీ క్యాంప్ ఆఫీసులో పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు ఏర్పాట్లు చేశారు. మంత్రుల పర్యటన నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో పని చేసిన కాంట్రాక్టర్లు, సబ్ కాంట్రాక్టర్లను ఇరిగేషన్ శాఖ ఆఫీసర్లు మేడిగడ్డకు రప్పిస్తున్నారు. మంత్రులు వాళ్లతో మాట్లాడనున్నారు.
ఇదీ మంత్రుల షెడ్యూల్..
మంత్రుల బృందం ఉదయం 10:30 గంటలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో బయల్దేరి 11:30 గంటలకు మేడిగడ్డకు చేరుకుంటుంది. ఆ తర్వాత అక్కడే గంటన్నర పాటు కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంటుంది. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోవడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నష్టంపై మంత్రులు సమీక్ష నిర్వహిస్తారు. మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు మేడిగడ్డ బ్యారేజీని పరిశీలిస్తారు. 2 నుంచి 3గంటల వరకు జర్నలిస్టులతో కలిసి లంచ్ చేస్తారు. ఈ సమయంలో మీడియాతో మాటముచ్చట ఉంటుంది. మధ్యాహ్నం 3:20 గంటలకు అన్నారం బ్యారేజీ వద్దకు చేరుకుంటారు. బ్యారేజీలో ఏర్పడిన బుంగలను పరిశీలిస్తారు. 4:30 గంటలకు తిరిగి హెలికాప్టర్‌లో హైదరాబాద్‌కు వెళ్తారు.