కిన్నెరసాని ప్రాజెక్ట్​లో మంత్రుల బోటు షికారు

కిన్నెరసాని ప్రాజెక్ట్​లో మంత్రుల బోటు షికారు

భద్రాద్రికొత్తగూడెం/పాల్వంచ రూరల్, వెలుగు: కిన్నెరసాని ప్రాజెక్ట్​లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వర్ రావు బోట్ షికారు చేశారు. కిన్నెరసానిలో విహరిస్తూ బోటులోనే లంచ్​ చేశారు. కిన్నెరసానిలో సహజ సిద్ధంగా ఏర్పడిన ఐల్యాండ్స్​ను పరిశీలించారు. ఏ విధంగా టూరిజం డెవలప్​ చేయవచ్చనే అంశాలపై మంత్రులు ఆఫీసర్లతో సుదీర్ఘంగా చర్చించారు. మంత్రి తుమ్మల స్వయంగా అందరికీ భోజనాలు వడ్డించారు. మంత్రులతో పాటు ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డి, ఎమ్మెల్యేలు కోరం కనకయ్య, కూనంనేని సాంబశివరావు, జారే ఆదినారాయణ, పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకటేశ్వర్లు, మట్టా రాగమయి, కలెక్టర్ జితేశ్ వి.పాటిల్, ఎస్పీ బి.రోహిత్ రాజు, ఐటీడీఏ పీవో రాహుల్, టూరిజం ఆఫీసర్లు బోటు షికారులో పాల్గొన్నారు. 

కొత్తగూడెంలో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు తుమ్మల మధ్యలోనే ప్రత్యేక బోట్​లో బయటకు వచ్చి వెళ్లారు. కిన్నెరసానిలోని డీఆర్ పార్క్​ను రాష్ట్రంలోనే అతి పెద్ద పార్క్​గా అభివృద్ధి చేసేందుకు అన్ని అవకాశాలు ఉన్నాయని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి జూపల్లి దృష్టికి తీసుకువచ్చారు. ట్రెక్కింగ్, తీగల వంతెన ఏర్పాటు చేయాలని కోరారు.